| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| క. |
మది నయ్యిరువుర మాటలు | బదిలంబుగఁ బట్టికొనుటఁ, బట్టియు నెట్లుం దుది నది యట్టుల కాఁగల | యదియై యుండుటను, దాని కత డొడఁబడియెన్. |
312 |
| వ. | ఇట్లు సమ్మతించి. | 313 |
| క. |
అనృత భయము నాజిజయము | గొనియెడు తమకంబు పెంపు గుదియింపఁగఁ బాం డునరేంద్రు నగ్రతనయుం | డనుమానము వాయఁ బెట్టి యస్త్రగురునితోన్. |
314 |
| తే. |
వలయు కొలఁది నెలుంగెత్తి వర్ణ సమితి | యచ్చుపడఁగ ‘ నశ్వత్థామ సచ్చె’ ననియె నని పదంపడి యల్లన యతని చెవికి | వినఁగ రాకుండఁ ‘గుంజర’ మనియె నధిప! |
315 |
| వ. | ఇ వ్విధంబునం బలుకుటయు. | 316 |
| క. |
నేలకు నల్లెఁడు పొడువునఁ | గ్రాలుచు మును మెఱయు గురుని రథచక్రము ల క్కాలంబున సమరజయ | శ్రీ లోపము దెలియ నంటసిలఁబడియె నృపా! |
317 |
| వ. | అప్పుడు. | 318 |
| క. |
తనుఁ బాండుతనయులకు ద్రో | హునిగా నక్కుంభజన్ముఁ డూహించుచు న మ్మునులట్టు సెప్పి; రటుగా | వునఁ గా కేమి యిది దగవవుం బొమ్మనుచున్. |
319 |
| శా. |
ధృష్టద్యుమ్నునిఁ జూచుచున్ రణసముద్రేకంబు బాహాబలా వష్టంభంబును శౌర్యనిర్వహణ గర్వస్ఫూర్తియుం దొంటియు త్కృష్టత్వంబును దక్కి స్రుక్కి వగ బుద్ధిం బీఁకువీఁకాడఁగాఁ జేష్టాహీనతఁ బొంది యగ్గురుఁడు సంక్షిప్తాంగుఁ డై యున్నెడన్. |
320 |
| వ. | అతని వధంబునకై పాంచాలవిభుని వేలిమిం బుట్టినవాఁ డగుట నప్పార్షతుండు దత్సమయజనితోత్సాహ రోష విశేషాయత్తచిత్తుం డగుచు నమ్మహీసురుమీఁదం గవిసి యేసిన ననికి నొల్లని యుల్లంబునఁ బరుని యుల్లాసంబు సహింపలేని తేజంబును బురికొని యతండు వోరం దొడంగిన దివ్యాస్త్రంబులు ప్రతిభాసింపక యుండె; నట్లయినను మనసుబలిమి కలిమిం బ్రకృతి బాణంబుల నాతని బాణబాణాసన రథ రథ్య సూత కేతనంబులు వొడిసేసె; నాధృష్టద్యుమ్నుండు గద గొనినం దునియలు గావించెఁ; బలకయు వాలునుం గొని వచ్చి యవ్వీరుండు సారథి తురంగంబుల యంగంబుల వ్రయ్యనేయఁ దత్కరవాల ఖేటపాటనంబు సేసి తనువునం జండకాండంబులు నించె; నట్లు నించి నొంచినం గని శినివరుండు గృపకర్ణ కృతవర్మల తోడం బెనంగు చుండియుఁ గ్రూరనారాచ దశకం బయ్యాచార్యుమేన నిగిడించె; నంత నత్యంతరయంబునం జనుదెంచి యనిలనందనుండు ద్రుపదనందనుఁ గుంభసంభవు బారికిం దప్పించుకొని పోయినం బొమ్మని పలికి, డెందం బెప్పటి చందం బగుటయు నిశ్చలభావం బొందె; నివ్విధంబున నాలుగు దివసంబులు నొక్కరాత్రియు నేనగు దివసంబులో నిరువది గడియలు నిరువది యొక్కవే యట్టలాడ భండనంబు సేసి పాండవ బలంబులు నుఱుమాడి పేరడవి గొని కాల్చి పొనుంగుపడిన కార్చిచ్చు కైవడిం గుదిసి య మ్మహాత్ముండు. | 321 |
| సీ. |
సంగరంబునఁ దన్వి సని శాంతిఁ బొందిన | చిత్తంబుతోఁ దమసేన దిక్కు గనుఁగొని పెలుచ నోకర్ణ! యోకృప! యో సు | యోధన! పోర న న్నొత్తి యెపుడుఁ జెప్పుదు; రేను నాచే నయినంతయుఁ | జేసితి; నింక నిశ్చింతవృత్తి సుగతికిఁ జనఁ గోరి తగ నుజ్జగించెద | బాణాసనంబును బాణములను; |
|
| తే. |
దెలివి గలిగి మనుం’ డని పలికి శరశ | రాసనము లూడ్చి తేరిపై ననఘమూర్తి యొప్పఁ గూర్చుండి సంభృత యోగనిష్ఠ | నొంది తేజోమయాత్ముఁ డై యుండె నధిప! |
322 |
| వ. | అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గృపాణపాణియుఁ బాదచారియునై భారద్వాజు దెసకుం గవియుటయు, నుభయ సైన్యంబుల హాహాకారంబు లెసఁగె; నంతం దనువు విడిచి యప్పుణ్యపురుషుండు ప్రకట జ్యోతీరూపంబున నెగసి పరమస్థానంబునకుం జనియెఁ; దత్తేజోమూర్తి యేను గంటిఁ, గృష్ణార్జున ధర్మనందన కృపాచార్యులునుం గనిరి; దక్కటి మానవులు గానరు; సురలు సూచి సంతసంబునం బొదలి; ర ట్లడరిన యాద్రుపద నందనుండు. | 323 |