పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
ధృష్టద్యుమ్నుండు మృతుండైన ద్రోణుని కంఠంబు దునుముట (సం. 7-165-47)
చ. అరదముపైకి దాఁటి కుపితాత్మత ద్రోణుశవంబు కేశముల్‌
గరమున బె ట్టమర్చికొని ఖడ్గహతిన్‌ మెడ ద్రుంచివైచె స
త్వరముగ మాను మాను మను వాక్యముతో నరుఁడేగఁ, దప్పు సు
మ్ముర యని ధర్మజుండు దివి ముట్టు నెలుంగున బి ట్టదల్పఁగన్‌.
324
వ. ఇత్తెఱంగునం దునిమి యతం డయ్యట్టయుం దలయును ధరణీతల గతంబు సేసె; నిట్లు శతవృద్ధుం డగు నయ్యస్త్ర గురుండు నీ దుర్మంత్రంబునఁ ద్రుంగిపోయినం బొంగి పాండవానీకంబు పైకొని తఱిమిన మన మొనలు వెఱచఱచి కనుకనిం బఱచెం; బఱచిన మనంబు గలంగి యప్పుడు నీ కొడుకు లేట మొగంబులు వడు దొరలతోడం గూడఁ దిరుగ నట్టియెడ దుర్యోధన దుశ్శాసన కృప కర్ణ కృతవర్మ మద్రేశ్వరుల మాతంగంబులం దురంగంబుల ముందఱ పెట్టికొని ‘కటకటా!’ యనుచు ‘నింత పుట్టునే ?’ యనుచు ‘నింక నేమి గల;’ దనుచు ‘నెట్లు సేయంగల వార?’ మనుచు ‘నేది దుది?’ యనుచు మరలి మరలి చూచుచుం జనుచుండఁ దక్కిన యలంతి మానుసు లెల్లను దలచీర వాటించు తలంపు లేక యొండొరుల నిలు నిలు మని పలుకుచుం గాలు నిలువక పలుదిక్కులకుం బాఱి రత్తఱి నశ్వత్థామ మున్నొక్కకెలనం గయ్యంబు సేయుచుండి నీసేన య ట్లగుటఁ గనుంగొని యక్కురుపతి కడకుం జని యతని కి ట్లనియె. 325
తే. ‘బలము లిది యేమి నలుగడఁ బాఱఁ జొచ్చె? | కర్ణ కృప ముఖ్యు లేటికిఁ గలఁగి లేట
మొగము వడి? రేల నీవును మున్నువోలె | నిలువరింపంగఁ దగియెడు నిలుపు లేవ?’
326
వ. అని యడిగిన నతం డతనిమొగంబు సూచి యాచార్యు తెగుట సెప్పంబోయి డగ్గుత్తికవడి యూరకుండె; శారద్వతుండు వెలువెలం బాఱుచు నెట్టకేలకు నెలుంగు దెచ్చికొని. 327
సీ. ‘పాంచాల పాండవ ప్రముఖ సైన్యంబుల | ద్రోణుండు బలువిడిఁ ద్రుంచుటయును,
నుక్కఱి పాండవు లొక్కచోటికి వచ్చి | నిలువరింపఁగ, లేక తలఁకుటయును,
వాయుతనూజుఁ ‘డశ్వత్థామ సచ్చెఁ జు’ | మ్మని కుంభజునితోడ నాడుటయును,
నమ్మాట గొనక ధర్మాత్మజు నవ్వార్త | యాచార్యుఁ డేర్పడ నడుగుటయును
 
తే. భీముచేత నశ్వత్థామనామ గజము | మున్ను చచ్చుట కతమున న న్నరాధి
పతియు నది నెపముగ నట్ల పలుకఁ, జాల | నడలి యతఁ డాయుధంబులు విడుచుటయును.
328
వ. అప్పుడు. 329
క. గురుఁ డమలయోగనిష్ఠం | దిరమై యుండంగ వచ్చి, ధృష్టద్యుమ్నుం
డరదముమీఁది కెగసి త | చ్ఛిరోజములు పట్టికొని యసిం దునుముటయున్‌.
330
వ. చెప్పి యప్పుడు ధర్మనందన ధనంజయులు వారింప నతం డుడుగక యట్లు సేసె ననియు నెఱింగించి, యట్లు భారద్వాజుండు పడిన బలంబులు విఱిగె; నేమును నిరుత్సాహుల మయితి; మేనుంగు పేరి నెపంబుగా నట్టి మాట పుట్టుట కృష్ణకృతం బయిన కపటోపాయంబుగానోపు; నని యంతయు నేర్పడం బలికె ననుటయు ధృతరాష్ట్రుండు సంజయుదిక్కు మొగంబై. 331
మ. ‘వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ శ్రీరాముతో
సరిసేయం దగువాఁడు దండ్రితల పాంచాలాత్మజుం డట్లు ని
ష్ఠురుఁ డై పట్టె ననంగఁ ద్రుంచె నన వించున్‌ వారితోఁ గూడ నా
తురుఁ డై పోయెనొ? పోక నిల్చియలుకన్‌ దోర్దర్పముం జూపెనో?
332
క. తను నాధృష్టద్యుమ్నుం | దునుముటకై కోరి కనియె ద్రోణుఁడు పరమా
స్త్ర నిరూఢి పరశురాముఁ డ | తని కిచ్చిన యంతవట్టు దన కతఁ డిచ్చెన్‌.
333
వ. అట్టి జనకు నా ద్రుపదనందనుం డట్లు సేసిన నక్కొడు కెట్లు సేసెనో వినవలతుం జెప్పు మనవుడు నమ్మహీపతి కతఁ డి ట్లనియె. 334
తే. కృపుని పలుకులు విని దట్టకెంపు గదురు | గన్నుఁగవ నశ్రుజలములు గ్రమ్ముదేరఁ
బాణితలమున నొత్తి యా ద్రోణతనయుఁ | డిట్టు లనుఁ దగఁ గౌరవాధీశుతోడ.
335
ఉ. ‘చావులు లేవె యెందు? ననిఁ జచ్చుట యొప్పదె? యిట్లు లోకసం
భావితు న మ్మహాత్ముఁ దల వట్టె నొకండను వాఁడి మాట య
మ్మై వడి దాఁకి చిత్తమున కార్తి యొనర్ప సహింపరాదు గా
కే విన నున్కి వాఁ డెఱుఁగఁడే? నను నిమ్మెయి భంగపెట్టునే?
336
క. నా దివ్యాస్త్రంబులు బా | హాదర్పము నింకఁ గాల్పనా? గురుఁ డాజిం
దా దిక్కుమాలి పగతుని | చే దైన్యముఁ బొందె నటె! యిసీ! యే మందున్‌?
337
క. దీనికి మూలము ధర్మజుఁ | డా నిక్కము గల్గు రాజు నని దండితుఁగా
నే నెట్లు సేసి పుత్తునొ | కో! నా చిత్తము కలంకయును నెవ్వగయున్‌.
338
ఆ. పుత్రుఁ గనుట యెల్ల శత్రునిచేఁ దల | వట్టి తాను దునుమఁబడుట కయ్యె
నస్త్రగురున; కింక నన నేమి గలదు? నా | యిచ్చుబాస కౌరవేంద్ర! వినుము.
339
మ. హరియుం బాండవులున్‌ మదీయ పటు బాహాశక్తి దివ్యాస్త్ర ని
ర్భర సంతాప పరీతులై యొదుఁగ ఘోరస్ఫార సంక్రీడఁ ద
త్తురగస్యందన వారణప్రకరముల్‌ ద్రుంగన్‌ విజృంభించెద
న్సుర సంఘంబులు వచ్చి యడ్డుపడిన న్దుర్వారదర్పోద్ధతిన్‌.
340
క. తనుఁ దాన చెప్పికొను టొ | ప్పని పని యగు; నైనఁ దండ్రి పరిభవమునకుం
గనలు గదిరి యి ట్లంటిని; | విను మే నే మనిన నేమి వృథ వో దధిపా!’
341
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )