పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
అశ్వత్థామ పూన్కివలనఁ గౌరవయోధులు మరల ననికిఁ గడంగుట (సం. 7-166-43)
వ. అని పలికి మఱియు నిట్లను ‘మా తండ్రి నారాయణు నారాధించి యొక్క మహాస్త్రంబు వడసె; నది నాకు నిచ్చె; న ద్దివ్యసాధనంబు వధ్యు లవధ్యులను విభాగంబు లేక విరోధి విధ్వంసనంబు సేయుఁ; దత్ప్రయోగంబున జయంబు సేకొనియెదం జూడు!’ మనుటయు నమ్మహీపతియు ననుజులు సేనాపతులును శంఖంబులు పూరించి సింహనాదంబులు సేసి మరలిన, భేరీమృదంగాది తూర్యధ్వనులు నింగి ముట్టఁ దురంగ రింఖా రథనేమి గజపద ఘట్టనంబుల నిల గ్రక్కదల మన సైన్యంబులు మరలి యురవడించె; ననిన విని ధృతరాష్ట్రుండు. 342
ఆ. ‘అట్లు గడఁగు కౌరవానీకములఁ గని | పాండుపుత్రు లేమి భంగివార
లై? రెఱుంగఁ జెప్పు’ మనవుడు నమ్మహీ | శ్వరున కిట్టు లనియె సంజయుండు.
343
వ. ఇత్తెఱంగునం గురుబలంబులు పురికొనం గౌంతేయులుం గూడుకొని సైన్యంబు సుసంగతంబు సేసికొని సంగరక్రీడ కమరి; రప్పుడు గ్రీడి నాలోకించి ధర్మతనయుండు. 344
క. ‘గురుఁడు వడిన నవ్విధమునఁ | బరమభయాకులతఁ బొంది పఱచియు నట వే
తిరిగి కురుబలము పోరికిఁ | గర ముద్ధతి నగ్గలింపఁ గత మెయ్యదియో?
345
క. ఇలయును నింగియు నద్రువం | జెలఁగె మహారవము వారి సేనలఁ గురుచా
వలుక నొనర్చిన నక్కడ | బలరిపుఁ డేతెంచి తోడు పడి నడచె నొకో!’
346
వ. అనిన విని యమ్మనుజపతికి నతం డి ట్లనియె. 347
ఆ. ‘న్యస్తశస్త్రుఁ డైన యాచార్యుఁ జంపిన | నెవ్వరొక్కొ? వారి కివ్విధంబు
బలిమి గలుగఁ జేసి రలుకమై ననుచు సం | దియము పడగ నేల? తెలియ వినుము.
348
చ. జనకు నధర్మవృత్తి మెయిఁ జంపుటకై తలవట్టె నొక్కరుం
డన విని రిత్తవోవునె మహాద్భుత శౌర్యము నస్త్రవీర్యమున్‌
మనము జగంబుఁ గన్న యతిమానుషవిక్రమశాలి; వీని నె
వ్వని కెదురంగ రా దనఁగ వ్రాలిన ద్రోణసుతుండు భూవరా!
349
తే. జన్మవేళన యాతఁ డుచ్చైశ్శ్రవంబు | భంగి హేషించెఁ బృథివి గంపంబు నొంద;
నప్పు డతని కశ్వత్థామ యని యొనర్చెఁ | బేరు జనములు విన నశరీరవాణి.
350
వ. అతఁడు సూవె కౌరవసైన్యంబు నిప్పటి సంరంభంబునకుం గారణం’ బని చెప్పి వెండియు. 351
ఆ. ‘అనఘ! నిన్ను శిష్యుఁడును ధార్మికుండు స | త్యవ్రతుండు నని మహాదరమున
నడిగె; నీవు ధర్మహానికి నోర్చిన | గురుఁడు నిశ్చయించెఁ గొడుకు చావు.
352
క. ఛలము గొని యిట్లు వడయఁగ | వలయునె రాజ్యంబు? దీన వచ్చిన కలిమిం
గలుగునె పెంపుం బేరును? వెలి యైతిమి లోకమునకు వేయును నేలా?
353
వ. అదియునుం గాక. 354
మ. వల దిట్లే లని యేను బేరెలుఁగునన్‌ వారించుచున్‌ బాఱఁగాఁ
దల యిట్లేటికిఁ బట్టి త్రెవ్వ నడిచెన్‌? ధర్మప్రణాశం బెదం
దలఁపం డాగ్రహవృత్తిఁ బార్షతుఁడు; దద్దైన్యంబునం గ్రోధవి
హ్వలుఁ డై యీతనిపై వడిం బడక యశ్వత్థామ సైరించునే?
355
క. మన సేవల నొక్కెత్తునఁ | గొనఁ దలఁచి కడంగి వచ్చు గురుపుత్రుని మా
ర్కొన ధృష్టద్యుమ్నునిఁ గా | వను శక్యమె నీకు? నిచటివారికి? నధిపా!’
356
వ. అనినం గోపించి యనిలనందనుం డా సంక్రందననందనున కి ట్లనియె. 357
చ. ‘అడవుల నుండు తాపసుల యట్టులు పల్కెదు రాజనీతి యి
ట్టొడఁబడి చేయ వచ్చి వధ కొల్లమి యొప్పునె? ధర్మనిష్ఠ యె
క్కడఁ గల దాసభన్‌ ద్రుపదకన్యక పాటున కిట్టి వెన్నియుం
గడుకొని చేసినన్‌ మనలఁ గల్మష మొందఁగ నేర దర్జునా!
358
తే. అరులు మనమీఁద నురవడి నరుగుదేర | నేము సిడిముడిపడుచుండ నిట్టు లనుట
యొప్ప ‘దురిసినపుండుల నుప్పు’ వెట్టె | దరయ; దీనికి నిన్ను నే మందు పార్థ!
359
క. కురువీరు లెఱుఁగుదురు ననుఁ; | గురువీరుల తెఱఁగు నేనుఁ గొంత యెఱుఁగుదున్‌;
శరపరిఘప్రహరణములఁ | బొరిగొనియెదఁ గాక వారిఁ బో నిచ్చెదనే?
360
వ. అని పలికె; నప్పుడు ధృష్టద్యుమ్నుండు బీభత్సున కిట్లనియె. 361
చ. ‘వెరవును లావు లేని ప్రజ వేయు విధంబుల దివ్యబాణ వి
స్ఫురణము సూపి చూపి పొరిపుచ్చె మహోగ్రత ధార్మికుండె య
గ్గురుఁ? డది గాక యే నతనిఁ గూల్పన పుట్టినవాఁడ; నింతవ
ట్టరయక నన్ను నిట్లు సెడనాడుట పాడియె నీకు వాసవీ!
362
క. పితృసఖుఁ డగు భగదత్తునిఁ | బితామహుం డైన వృద్ధు భీష్ముని నీ వు
ద్ధతిఁ జంపుట పుణ్యంబే? | ప్రతివీరునిఁ జంపు టేల, పాపం బయ్యెన్‌?
363
క. భూనాథుఁడు బొంకఁడు; విను | మేనును ధర్మంబు దప్ప; నిది యేటికి మి
థ్యానింద? శిష్యవంచకుఁ | డైన గురుఁడు సచ్చె; గెలువు మరిసైన్యంబున్‌.’
364
ఆ. అనియె ననుడు సంజయున కాంబికేయుఁ డి | ట్లను మునీంద్ర జాతుఁ డైన ద్రోణు
నట్లు చేసి యద్దురాత్ముఁ డమ్మెయిఁ బల్క | వినుచు నచటివారు గనల రెట్లు?
365
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )