పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
ద్రోణు పరిభవంబునకుఁ గోపించి సాత్యకి ధృష్టద్యుమ్ను నాక్షేపించుట (సం.7-169-8)
సీ. అనుటయు నా సూత తనయుఁ డవ్విభునకు | నిట్లను నతని రూక్షేక్షణముల
నరుఁ డుపలక్షించి తొరఁగు కన్నీరితో | నిట్టూర్పు నిగిడించి ‘ యట్టిరోఁత
మాట లేటికి?’ నన మాఱు పల్కక హరి | ధర్మపుత్రాదులు దలలు వంప
నలిగి సాత్యకి ద్రుపదాత్మజుఁ గనుఁగొని | ‘నీ జిహ్వ దునియదు నీ శిరంబు
 
తే. వగుల; దమ్మెయి గురునకుఁ బరిభవంబు | సేసి యిమ్మెయిఁ బలుకంగఁ జేయునదియుఁ
గలదె? యీరాజు సన్నిధిఁ గాన బ్రదికి; | తింకఁ బలికిన నోరు ప్రేయింతుఁ జుమ్ము!
366
క. తన మాఱే యని గంగా | తనయు శిఖండియు వధించెఁ; దత్కార్యం బా
తనికిఁ బ్రియ మైనఁ బనిచెం | దన మనుమనిఁ బనుపుసేఁత దగదె నరునకున్‌?
367
వ. ఆ శిఖండియు నీవు నుద్భవించి పాంచాల కులంబుఁ గీర్తికిం బుణ్యలోకంబునకుం బాపితి’ రనిన ధృష్టద్యుమ్నుండు నవ్వుచు నతని నవలోకించి. 368
క. సైరించిన నెఱుఁగవు నీ | చారిత్రము దలఁప నన్య శరకృత్తకరున్‌
భూరిశ్రవుఁ జంపి తదియు | వీర వ్యవహారమే వివేక విహీనా!
369
తే. అతఁడు నీ ఱొమ్ముద్రొక్కిన యపు డొకండు | జేయఁ జాలవ యగ్గురు సాయకములఁ
బాండవానీకములు విచ్చి పాఱ నెన్ని | యెడల మార్కొంటి వాతని నెఱుఁగ వెట్లు?
370
క. వలవని ప్రేలరి మాటల | నలిగింపకు నన్ను నేమి యాడిన నింకం
దల ద్రెవ్వ నేయుదుం గురు | బల మదె పురణించె బడలు పఱుతము రమ్మా!’
371
వ. అని పలికిన శినివరుండు రోషారుణితలోచనుండై కోదండంబు రథంబున నిడి గద పుచ్చికొని ‘మాటల నలిగెదేని వ్రేటున శిక్షించెద’ ననుచు ధరణికి లంఘించి కవిసినం గని, కేశవుండు పనుపం బవనతనయుండు రథంబు డిగ్గి రయంబునం జని పట్టి యాఱడుగుల కొలఁది నిలువరించె; నట్టియెడ సహదేవుం డా శైనేయు నుద్దేశించి ‘మిమ్మును బాంచాలురం గడచిన బంధువులు మాకును మిమ్మును మిగిలిన బాంధవు లా పాంచాలురకును వారల కంటె మాకంటె - నెక్కుడు సుహృజ్జనులు మీకును లేకునికి దెల్లం; బిట్టి మీలో మీ రెరవు పడం దగునే? యలుక దక్కు’ మనునెడ నాధృష్టద్యుమ్నుండు వడముడితో ‘నతనిం బట్టక విడువుము; నాచేతంగాని నీచేత నిలువండు; నేనొక్కచేతి భూరిశ్రవుండనే? యేల? యడిచిపడియెడు?’ ననవుడు నాభీమసేను బాహువుల లోనం దిరుగుడు పడుచు నురగంబు చందంబున సాత్యకి రోఁజుచున్నం గృష్ణ యుధిష్ఠిరు లయ్యిరువురం బ్రయత్నంబున వారించిరి; తదనంతరంబ. 372
క. భేరీ మృదంగ శంఖ మ | హారవములు సెలఁగఁ బాండవానీకంబుం
గౌరవ సైన్యముఁ దాఁకెను | వారిధు లొండొంటిఁ దాఁకు వడు వమరంగన్‌.
373
క. మును ద్రోణునిఁ బొలియించితి | మని పాండవబలము బలియు నశ్వత్థామం
గొని కురుసేనయు నత్తఱి | ననూనగర్వమున నుద్భటాటోపమునన్‌.
374
వ. పెనంగందొడంగె; నప్పుడు ద్రౌణి దుర్యోధనుం గనుంగొని. 375
క. ‘అనృతంబు పలికి బ్రదికెద | మని చూచిన రాజు మూఁక లన్నియు నెట్లై
యనిఁ బడియెడునో యెమ్మెయిఁ | గనుకనిఁ బఱచెడునో చూడు కన్నారంగన్‌.’
376
వ. అని పలికి నియతుం డయి నారాయణాస్త్రంబు ప్రయోగించిన. 377
మ. ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుండు గుంఠీభవ
త్కిరణుం డయ్యె, దిశావితానము వడంకెన్‌, మి న్నదిర్చెన్‌, మహీ
ధర సంతానము లోలి గ్రక్కదలె, నుద్‌భ్రాంతంబులై యంబుధు
ల్వొరలెం గట్టులమీఁదఁ బిట్ట పిడుగు ల్మ్రోసెన్‌ మహోదగ్రతన్‌.
378
వ. ఇట్లు భీకర ప్రొదుర్భావంబైన యద్దివ్యసాధనంబు మండలార్ధ చంద్ర భల్లనారాచక్షుర ప్రముఖంబులు ననల మయంబులు నగు ననేక దేదీప్యమాన మార్గణమూర్తులు గైకొని కౌంతేయ సైన్య సంతానం బంతయు నొకపాయగాఁ గవిసినం గని తెంపుపెంపునం దత్సైనిక నికరంబులు వివిధ విశిఖంబులఁ బరపుచు, నయ్యయి ముఖంబుల మగిడించుచు, బలువునం గడంగినం బొంగుచు నింగిని నేలను నడుమను నాభీలజ్వాలాచ్ఛటా జటిలంబుగాఁ బైపయి నడరి యమ్మహాస్త్రంబు చతురంగంబులం ద్రుంగించుచు నెదు రెంతెంత పెనంగె నంతంతియ పేర్చి యేర్చుచుం బఱవం దొడంగిన, నమ్మొనలు పఱవం దొడంగె; నప్పుడు నరుం డూరకునికి సూచి నారాయణుండు నతండును వినుచుండ ధర్మసూనుండు సాత్యకి ధృష్టద్యుమ్నుల నాలోకించి యి ట్లనియె. 379
సీ. ‘ఆ సభఁ బాంచాలి గాసి సేయఁగ నుపే | క్షకుఁ డయి చూచెఁ; బెక్కండ్రఁ గూర్చి
కొని బాలు నభిమన్యుఁ గూల్చె; నించుక వడి | యాఁగిన నర్జునుఁ డగ్నిఁ జొచ్చు
నను వగ మనల నాతనికిఁ దోడ్పడఁ బోవ | నీ కాఁగె నమ్మెయి; నిట్టి ధర్మ
పరుఁ డైన కలశసంభవుతోడ సరివచ్చు | టుచితంబె? యీవచ్చు నుజ్జ్వలాగ్ని
 
తే. వలని కరిగెద; మీరు మీ వాహినులును | బాఱి పొం డెక్కడేని; నప్పార్థుకోర్కి
యంత సఫలత బొందెడు; నచ్యుతుండు | నెట్లు దనకు రుచించెఁ దా నట్లు సేయు.’
380
వ. అనిన విని జనార్దనుండు సత్వరుండై పెద్ద యెలుంగున నెల్లవారును విన ‘సైనికులారా! సామజ హయ రథంబులు డిగ్గి యాయుధంబులు వెట్టి నిలువుండు; భూమిగతులగు నిరాయుధుల నిమ్మహాస్త్రం బేమియుం జేయ; దది యెట్లనిన నిట్లగుట దీనికిఁ బ్రతివిధానంబుగా దీని నొసంగిన మహాత్ముండు విధియించె’ ననుటయు సకల జనంబులు నమ్మాట కియ్యకొని యట్లు సేయం జూచిన సమయంబున సమీరనందనుండు. 381
చ. ‘ డిగకుఁడు వాహనంబులు గడింది మగంటిమి గోలుపోవ మీ
రు గడఁక దక్కి పెట్టకుఁడు రూపఱ నాయధముల్‌ మహాస్త్ర శ
క్తి గెలుతు గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు భూ
రి గద విహార భంగియు నరిప్రకరంబులు పిచ్చలింపఁగన్‌.’
382
వ. అని బరవసంబు సేసి, శంఖం బొత్తి, మల్లచఱిచి, సింహనాదంబు సెలంగ నశ్వత్థామకు మార్కొనుటయు; నవ్వీరుం డదల్పుతో నన్నారాయణాస్త్రంబు నిగుడం జేసిన. 383
క. అనలశిఖాసదృశము లగు | ననేక బాణములు భీమునరదము వొదువం
గని యమ్మొన యోధులు వా | హనములు డిగ్గి వెట్టి రాయుధము లిలన్‌.
384
వ. పదాతి దళంబులుం గైదువులు వెట్టి; రప్పు డద్దివ్యసాధనం బెవ్వరికి బాధకంబు గాక యా భీమసేను దెసకు మొగం బగుటయు. 385
క. నరుఁడు గని సత్వరంబుగ | వరుణాస్త్రం బేయుటయును వావిరి నది త
త్పరుషత మానెడునట్లుగఁ | బరఁగిన గురుసుతుఁడు పెద్ద ప్రబలం జేసెన్‌.
386
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )