పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
నారాయణాస్త్రపీడితుం డగు భీముఁ గృష్ణార్జునులు రథంబు డిగ్గఁ జేయుట (సం. 7-171-12)
వ. ఇవ్విధంబున నశ్వత్థామ యమ్మహాస్త్రంబు దీపింపం జేసిన నది పేర్చి కార్చిచ్చు వొదువు చందంబున సమీరనందనుం జుట్టుముట్టె; నట్లు సమర విముఖులై యేమియుం గాకున్న ధర్మనందనాదులను బలిమి వదలని చలంబున ననలంబు చేతం బొదువంబడిన వృకోదరునిం గని కృష్ణార్జునులు దేరు డిగ్గి రిత్తచేతులం బాఱి వారుణాస్త్రంబు కతంబునం బెద్ద గాలక యున్న యాభీముని రథంబు డిగ్గఁ ద్రోవ, డిగక బిగిసిన నచ్యుతుం డతని కిట్లనియె. 387
తే. ‘ఇమ్మహాస్త్రంబుఁ గడిమి మైఁ గ్రమ్మఱింప | నెవ్వరికి రామిఁ జేసి కా కేము శక్య
మైన నూరక యుండుదు మయ్య? వలవ | దుడుగు నాబుద్ధి విని డిగ నుఱుకు తేరు.’
388
వ. అనుచు నతని నిరాయుధుం జేసి యర్జునుండు తోడ్పడ నరదంబు డిగ్గఁ ద్రోచె; నిత్తెఱంగునఁ బాండవ సైన్యంబంతయు దైన్యంబు నొందుటయు, నారాయణాస్త్రంబు ప్రశాంతిం బొందెఁ దదనంతరంబ. 389
క. హరి పనుప వారి బలములు | పురికొని వాహన వితానములు శస్త్రాస్త్రో
ద్ధుర భంగి నొప్ప నడరెం | గురుసేనలమీఁదఁ దూర్యఘోషము సెలఁగన్‌.
390
వ. ఆ సంరంభంబు సూచి సుయోధనుం డశ్వత్థామతో ‘నింకను నమ్మహాస్త్రంబు ప్రయోగింపు’ మనుటయు, నతం డది పునఃప్రయోగంబున కర్హంబు గా; దట్లయినం బ్రయోగించిన వారిని వధియించు; నిట్లగుట గురునకు వరదాన కాలంబునం గేశవుం డానతిచ్చెఁ; జావోటములు రెండును నొక్కరూపు కావున నమ్మహనీయాస్త్రంబు పగతుర నోడించి యంతటి తోడఁ దెగియెఁ; గృష్ణుఁ డీ యుపాయంబున నప్పరమ సాధనంబు గడపి పుచ్చె; మన మేమి సేయుద?’ మనుచు నిట్టూర్పు నిగిడించె; ననవుడు నాంబికేయుండు సంజయున కి ట్లనియె. 391
క. ‘నారాయణాస్త్ర మిమ్మెయి | వైరి చమూసంచయంబు వధియింపక పో
రారాజును ద్రౌణియుఁ దా | రే రూపున సంచరించి? రెఱిఁగింపు తగన్‌.’
392
వ. అని యడిగిన నమ్మనుజపతికి సూతసూనుం డి ట్లనియె. 393
క. ఆ మనుజపతికి నశ్వ | త్థామ యటులు సెప్పుటయు, నతం ‘డన్యాస్త్ర
స్తోమంబునఁ బాండవసే | నామర్దన మాచరింపు’ నావుడు గడిమిన్‌.
394
తే. ద్రౌణి గౌంతేయసేనపై బాణవితతిఁ | బరఁగఁ జేయుచు నాచార్యమరణ మంత
రంగ సంతాప మొనరింప నక్కజముగఁ | దఱిమి పాంచాలతనయునిఁ దాఁకె నధిప!
395
తే. తాఁకి యిరువదే నమ్ము లుదగ్రవృత్తి | నతని తనువునఁ బఱపి రయంబు మెఱయ
మఱియు నిరువదిమూఁ డుగ్ర మార్గణముల | నిగుడఁ జేసిన నాతండు వెగడు పడక.
396
వ. నిశిత నారాచంబుల నొప్పించినం గోపించి. 397
మ. గురుపుత్రుండు గడంగి సూతు హరులం గోదండముం గేతువున్‌
ధరణిం గూల్చినఁ జూచి సాత్యకి మదౌద్ధత్యంబునం దాఁకుడున్‌
శర మొక్కంటన మూర్ఛ వుచ్చి వెస ధృష్టద్యుమ్ను ఫాలంబు ని
ష్ఠుర నారాచహతంబు సేయుటయు వాఁడుంఁ దేరిపై సోలినన్‌.
398
వ. కనుంగొని రోషవిషాదంబులు మనంబునం బెనంగొనఁ గిరీటియు భీమసేనుండునుం గవిసినన్‌ బాసటయై శిశుపాలపౌత్రుం డగు యువరాజును మాళవుండగు సుదర్శనుండును బౌరవుం డగు వృద్ధక్షత్రుండును గూడుకొని యయ్యేవురు నయిదయిదు సాయకంబు లేయ నక్కుంభసంభవ సంభవుండు వానిం బంచవింశతి కాండంబుల ఖండించె; నిట్లు దొడంగి యందఱకు నన్నిరూపులై యేపునం బోరుచుండి ప్రచండ భల్లత్రయంబున భుజంబులు శిరంబునుం దునిమి సుదర్శనుఁ గృతాంత దర్శనంబున కనిచి, పౌరవు తేరునుం దలయును నఱికి విశిఖశిఖలం జేదికుమారు మ్రందించి, మదంబున సింహనాదంబు సేసి, శంఖం బొత్తినం జిత్తంబులు గలంగి పాంచాలురుం బాండవ బలంబులు జలం బెడలి పాఱినం బోక నిలిచి భీమార్జును లమ్మొన మరల్చి; రప్పుడు పాకశాసనతనయుం డతని నిలునిలు మని యదల్చి సంరంభవిజృంభితుండై. 399
క. ‘గురుసుత! నీదుభుజావి | స్ఫురణము దివ్యాస్త్ర వీర్యమును గురుధరణీ
వరుదెస కూర్మియుఁ జూపితి | దెరలకుమీ’ యనుడు నతఁడు దీప్తాకృతి యై.
400
మ. నియతిం బావక బాణ మేయుడు మహాగ్నిజ్వాలికా మాలిక
ల్హయ సందోహ రథవ్రజ ద్విరద మాలా సద్భట శ్రేణికా
క్షయముం జేయుచు సర్వభూత భయదాకారంబునం బేర్చి య
త్యయకాల జ్వలనోద్ధతిం గవిసి యేకాక్షౌహిణిం ద్రుంపఁగన్‌.
401
క. కురుసేన యుబ్బి యార్చుచు | హరియు నరుఁడు మడియుదురు శరానల శిఖలన్‌
సరి గలరే త్రిభువనముల | గురుసుతునకు ననఁగఁ దూర్యఘోషము లెసఁగెన్‌.
402
తే. ఎల్ల దివ్య బాణంబులుఁ బొల్ల వోవఁ | జేయునట్లుగ బ్రహ్మ సృజించినట్టి
కీర్తనీయమహాస్త్రంబు గ్రీడి మంత్ర | నిష్ఠ యొప్పఁ బ్రయోగించె నృపవరేణ్య!
403
వ. ఆ బ్రహ్మాస్త్రంబుచేత నద్భుతంబగు నశ్వత్థామ యాగ్నేయాస్త్రంబు సంక్షీణంబగుటయుఁ, గైటభాంతకుండును గిరీటియుం బాంచజన్య దేవదత్తంబులు పూరించినఁ, బాండవసైన్యంబున సింహనాద శంఖ భేరీ మహారావంబులు సెలంగెఁ; గౌరవసేన లేటమొగంబు వడియె; నప్పు డగ్గురునందనుండు. 404
ఆ. ‘తెల్లమయ్యె నాకు దివ్యాస్త్రబలము లే | కునికి సిగ్గుమాలి యనికి నింకఁ
గడఁగ నేల? దీని నుడిగెదఁ గా’ కని | యుల్లమునఁ దలంచి విల్లు వైచి.
405
వ. అరదంబు డిగ్గి తొలంగి పోవం బోవ. 406
క. జిగి దొలఁకాడఁగ నేలకు | మొగి లేలొకొ డిగ్గె ననఁగ ముందటఁ దోఁచెన్‌
విగత దురితత్వభాసుం | డగు వేదవ్యాసుఁ డ మ్మహాపురుషునకున్‌.
407
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )