| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| వ. | తోఁచిన వినయసంభ్రమంబులతోడ వినతుండై గద్గదకంఠుం డగుచు ‘మునీంద్రా! మదీయం బగు నాగ్నేయాస్త్రంబు వృథ యయ్యె; నిది యేమి మాయయొ యెఱుంగ; సురాసుర గంధర్వాది జాతులకును దుస్సహంబయిన యద్దివ్య సాధనంబు మనుష్యు లగు కృష్ణార్జునుల దహింపఁ జాల దయ్యె’ ననవుడు నా తపోధనవర్యుండు ‘వినుము! నీ సంశయంబు వాపెద’ నని యతని కి ట్లనియె. | 408 |
| ఆ. |
‘ఆదిదేవుఁ డైన య వ్విష్ణుఁ డఖిలలో | కాభిరక్షణార్థమై జనించి మహిత తపము సేసె మైనాకశైలంబు | నందుఁ బెద్దకాల మభవుగుఱిచి. |
409 |
| సీ. |
పవనాశనుఁడు నూర్ధ్వబాహుండు నగుచు న | న్నారాయణుం డతిఘోరనిష్ఠఁ జలుపు నాతపమున సంతుష్టుఁ డై బాల | శశిరేఖ నొప్పారు జడముడియును శూలపినాకాది సుమహితాయుధముల | వెలిఁగెడు చేతులు విలసదురగ యజ్ఞోపవీత సమంచిత వక్షంబు | శోభిల్లఁగాఁ బొడసూపె శంభుఁ |
|
| తే. |
డపుడు పద్మాక్షుఁ డవ్విరూపాక్షునకు ధ | రాతలము జానుపాణి శిరంబు లొంద మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోడ్పుఁ గేలు | భక్తిఁ గదియించి యిట్లని ప్రస్తుతించె. |
410 |
| క. |
‘స్థావరములు జంగమములు | నీవలనం గలిగెఁ; దద్వినిర్మలరక్షా ప్రావీణ్యము దగఁ బ్రభువుల | కేవారలకైన నీవ యిత్తు మహేశా! |
411 |
| క. |
సురలాదిగఁ గల జీవులు | పురుషార్థ చతుష్టయంబుఁ బొంది సుఖిత్వ స్ఫురణము నొందుట నీదగు | కరుణాతిశయంబు వడసి కాదె కపర్దీ! |
412 |
| క. |
వేదములు ధర్మవాచక | వాదంబులు దద్విలాసవంతం బగు ధా త్రీదేవోత్కరము భవ | త్ప్రాదుర్భావములు గావె? బాలేందుధరా! |
413 |
| క. |
నినుఁ దనుఁగా నతినిర్మల | మనస్సమాధిప్రకర్షమగ్నత వలనం గనుఁగొని తద్రూప భజన | మొనరించు మహాత్ముఁ డమృత మొందుఁ బశుపతీ!’ |
414 |
| వ. | అని మఱియు ననేక భంగులం బ్రస్తుతించి ‘దేవా! నిన్ను భక్తి భజియించు నాకు ననన్య సులభ ప్రభావం బొసంగు’ మని యభ్యర్థించుటయు, దేవముఖ్యుం డగు విష్ణుదేవుం బ్రసన్నదృష్టి నాలోకించి యప్పరమేశ్వరుండు ‘నీవు నరసుర గంధర్వ కిన్నర గరుడోరగాది భూతంబుల నవలీల గెలిచి పరమ తేజో విరాజమానుండవై వర్తింపుము; నీకు నస్త్రంబుల శస్త్రంబుల నగ్ని - జలంబుల నశనినార్ద్రంబునను శుష్కంబునను స్థావరంబునను జంగమంబునను జావు నొప్పులు లేకుండం గలయవి దొడరిన నన్నైన జయింపు’ మని వరం బిచ్చెం గావున నన్నారాయణుం డవిజయ్యుండై నెగడె; నతనియంద జనియించిన నరుండును నట్టివాఁడై కూడి సంచరించు నరసఖుం డగు నద్దేవుండు నిజమాయా విశేషంబులం జగన్మోహనుండై విహరించు నమ్మహాత్ము లిరువురును దానవుల వధియించుటకును ధర్మసంస్థాపనంబు సేయుటకు నై వలసిన యప్పుడెల్లను జననాది కృత్యంబులు గైకొని వినోదింతురు; వారలు గదా యీ కృష్ణార్జును లని చెప్పి కృష్ణద్వైపాయనుండు వెండియు నిట్లనియె. | 415 |
| క. |
‘ నీవుఁ దపస్తేజో వి | ద్యావిభవ సమగ్రమూర్తి వగు దైవమ; నీ కే వినిపించెదఁ దెలియం | గా విను వారలకు నీకుఁ గలయంతరముల్. |
416 |
| తే. |
శుభ్ర మగు నుర్విమృత్తిక సురుచిరంపుఁ | బ్రతిమఁ గావించికొని యందుఁ బరము నావ హించి పూజావిశేషంబు లెల్లఁ జేసి | నీవు దొలుమేనఁ గొలిచితి నిష్ఠతోడ. |
417 |
| క. |
వారలు లింగాధిష్ఠా | నా రూఢుంగా నొనర్చి యర్చించిరి భ వ్యారాధన పరులై మును | గౌరీపతి నతులనియమ కల్పన వెలయన్. |
418 |
| వ. | ఎత్తెఱంగునం జేసినను పరమేశ్వరారాధనంబు సర్వార్థసాధనం బగు; నందును లింగంబునందుఁ బూజించుట యర్చయం దారాధించుటకంటె ననేక గుణంబు లెక్కుడు గావున లింగార్చన పరులగు వారల నర్చారాధకుండవగు నీకు నెట్లు జయింప వచ్చు? మీమీ పూర్వజన్మంబుల యర్చనంబుల ఫలంబులు దారతమ్యంబులతో ననుభవింప వలవదే?’ యని తెలియం బలుకుటయు, నశ్వత్థామ పులకితాంగుండును సమాహితాంతరంగుండునునై రుద్రునిం దలంచి నమస్కరించి గేశవుం గొనియాడి పరాశర నందనున కభివందనంబు సేసిన, నమ్మహాముని యంతర్ధానంబు సేయఁ దానును మరలివచ్చి నిజ రథారూఢుండై యరుణగభస్తి యస్తగిరి సమీపంబున కరుగుటఁ గనుంగొనుచుఁ గురుపతి పాలికిం జని యతనికిం గాలోచితం బెఱింగించినవాడై బలంబులఁ దివియ నియమించె; నట్లు తిరిగి దీనంబు లగు నాననంబులతోడం గౌరవులు విడిదలకుం బోయిరి; పాండవులు బహుతూర్య నినదంబులు సింహనాదంబులుం జెలంగం బొంగారిన సముద్రంబు చందంబున నుల్లసిల్లు సైన్యంబు మగిడించుకొని నిశ్చింతంబు లగు నంతఃకరణంబులతోఁ గృష్ణోపలాలితు లగుచు నిజశిబిరంబులకుం జనిరి; తదనంతరంబ ధనంజయుండు. | 419 |