| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అమ్మహావీరు నాలోకించి కులూతదేశాధీశుండయిన క్షేమధూర్తి నిజబలంబులం బురికొల్పికొని యేచిత్రోచి యాహ్వానంబు సేసి తన కరటిం గొలిపిన నది గిరి గిరం దాఁకు తెఱంగున నతని మాతంగంబునకు మార్కొనియె నయ్యిరువురు నొండొరులపైఁ దోమరస్తోమంబు లడరించి యార్చుచు నుద్దండ పరాక్రమంబులగు వేదండంబుల పటు ప్రచారంబులు చారు భీషణంబులుగా నొకళ్ళొకళ్ళం జుట్టుకొని వచ్చుచుం బెనంగి. | 77 |
| క. |
కోదండంబులు గొని బా | హాదర్పము లెసఁగఁ బోరి యన్యోన్యధను శ్ఛేదంబులఁ బొరిఁబొరి నా | పాదించిరి రయము జనులు ప్రస్తుతి సేయన్. |
78 |
| వ. | దానం గోపం బగ్గలించి. | 79 |
| తే. |
శక్తులను దోమరంబుల సరభసముగఁ | బోరుచో భీమసేనుని పేరురమున క్షేమధూర్తి సముజ్జ్వలతోమరంబు | లేడు నాటించె దర్పంబు రూఢికెక్క. |
80 |
| చ. |
అనిల తనూభవుండు దపనాంశు నిభంబగు తోమరంబు వై చిన నడుమం గరూశపతి చిత్రముగాఁ దునుమాడి వీఁక నా తనిఁ బటు షష్టికాండ పరితాడిత దేహునిఁ జేయ మేటివిల్ గొని యతఁ డక్కులూతపతికుంజరమున్ వెసఁగప్పె నమ్ములన్. |
81 |
| వ. | అట్లు భీమసేనుండు గరూశపతి విక్రమంబు సరకు సేయక యతని దిక్కునుం జూడక క్షేమధూర్తి సామజంబును సాయకమయంబు జేసిన నది మొగ తిరిగి పఱచినం బోవనీక యప్పావని వెనుకొనుటయు నక్కులూతపతి ప్రయత్నంబున నమ్మాతంగంబు మరల్చి యతని యంగంబునను దద్గజంబు శరీరంబునను నిశాత శరపరం పరలు వఱపిన. | 82 |
| చ. |
ఉఱక సమీరసూనుఁడు దదుగ్ర ధనుర్దళనం బొనర్చి యే డ్తెఱఁ గరి నొంప నాతఁడు గడిందిమగంటిమి నొండువింట ను న్మెఱుఁగులు గ్రమ్ముకోల నతనిం గడునొంచి తదీయహస్తి పొ ల్పఱి మహిమ్రొగ్గనేసిన ధరాధిప! నీ బల మార్చె నుబ్బునన్. |
83 |
| మ. |
గదసేతంగొని దంతి డిగ్గి చని యా కౌంతేయుఁ డవ్వీరు ను న్మద మాతంగముఁ గూలనేసినఁ గృపాణస్ఫారదోర్దండుఁడై కదియన్ వచ్చె నతండు నిష్ఠురగదాఘాతంబునం గూల్చె నే పు దలిర్పన్ వెసనామరుత్తనయుఁ డా భూమీశు భూమీశ్వరా! |
84 |
| వ. | ఇవ్విధంబున నేనుంగు పీనుంగు కడన పడిన క్షేమధూర్తి వజ్రప్రహారంబునం గూలిన కులశైలంబు సమీపంబున నిర్ఘాతపాతపతితంబయిన కంఠీరవంబు కరణి నొప్పె నతనిం గనుంగొని మన మొన వెఱచఱచి పఱచినఁ బాండవ బలంబులు వెనుకొనుటయు. | 85 |
| మ. |
పటు బాణప్రకరంబు లంబరముఁ గప్పం గర్ణుఁ డాసేనఁ దాఁ కుటయున్ సైన్యము దైన్యముం దొఱఁగి మార్కొన్నన్ భుజాసంపదు త్కట గర్వోద్ధురభంగిఁ బాండుసుతులున్ దర్పంబు సొం పేర్పరిం చుటకుం జొచ్చినఁ బేర్చెఁ బోరనిమిషస్తోమాద్భూతాపాదియై. |
86 |
| వ. | అందు. | 87 |
| క. |
సూతతనయ నారాచ | స్యూతములై వారణంబు లొఱలును సొగయున్ భూతలమునఁ బొరలు దెరలు | వే తూలును జిఱ్ఱఁ దిరుగు విచ్చుం జచ్చున్. |
88 |
| వ. | అప్పుడు నకులుం డతని మార్కొనియె; భీమసేనుం డశ్వత్థామను, సాత్యకి గైకేయులగు విందానువిందులను జిత్ర సేనుండనురాజు శ్రుతకర్మను, బ్రతివింధ్యుండు చిత్రుండను మనుజనాథుని, ధర్మపుత్రుండు దుర్యోధనుని, ధనంజయుండు సంశప్తకులను, ధృష్టద్యుమ్నుండు గృపాచార్యుని, శిఖండి గృతవర్మను, శ్రుతకీర్తి శల్యుని, సహదేవుండు దుశ్శాసనునిం దలపడి రట్టియెడ. | 89 |
| సీ. |
శైనేయుతోడ విందానువిందులు మహా | హవము సేయంగ నయ్యాదవోత్త ముఁడు పేర్చి వారి కార్ముకములు రెంటిని | దునిమి యంగంబుల నినిచెఁ దూపు లవ్వీరు లన్య శరాసనోద్ధారులై | యతనిపైఁ బఱపిరి శితశరంబు లతఁడును వారు నన్యోన్యచాపచ్ఛిదా | వైచిత్రి నొప్పారి రేచి దొడ్డ |
|
| తే. |
విల్లుగొని యతి రయమున భల్లనిహతి | నాతఁ డనువిందు తలఁద్రుంప నది ప్రదీప్త రత్నకుండలశోభాభిరామపతన | భంగిఁ దదనీక శోకసంపాదియయ్యె. |
90 |
| మ. |
కని విందుండు ప్రదీప్తచాప ధరుఁడై కాండప్రసారంబులన్ శినివీరుం గుసుమాఢ్య కింశుకసముం జేయంగ నయ్యోధుఁ డా తని యంగంబులఁ బంచవింశతి శితాస్త్రంబుల్ వడిం గ్రుచ్చె నే పున వారొండొరుసూతులం దునిమి నిప్పుల్రాలు కన్దోయితోన్. |
91 |
| తే. |
ఒకళు లొకళుల హయముల నుర్విఁగూల్చి | యొండొరుల కార్ముకమ్ములు ఖండితములు సేసి తేరులు డిగ్గి రుద్భాసి తాసి | చర్మశోభిత హస్తులై సరభసముగ. |
92 |
| వ. | ఇట్లు పాదచారులై మండల ప్రచారంబుల మెఱయుచు. | 93 |
| క. |
చేరి బహు చిత్ర గతులం | బోరంగా నొడ్డనములఁ బొలిసెం బలకల్ నేరిమిమైఁ గెళవున శిని | వీరుం డిరువఱియగాఁగ విందుని వ్రేసెన్. |
94 |
| వ. | ఇత్తెఱంగున నయ్యిరువురం జంపి సాత్యకి యుధామన్యు తేరెక్కి యుక్కున వేఱొక్క రథంబు సన్నద్ధంబు గావించుకొని కైకేయబలంబులం బఱపెఁ జిత్రసేనుండును నీ మనుమండగు శ్రుతకర్మయుం బెనంగునెడ నాశ్రుతకర్ముండు. | 95 |
| క. |
ఆ రాజు నైదు వాలిక | నారసముల నొంప నతఁడు నవశరముల న క్కౌరవుని నేసి నొంచెను | సారథి నై దింట నధిక సంరంభమునన్. |
96 |
| సీ. |
శ్రుతకర్మ కోపించి క్రూరనారాచ మ | జ్జన నాథుజత్రుదేశమున నాటఁ బడి మూర్ఛవోయినఁ బైపయి వెండియు | నేయఁ దెప్పిఱి యతం డెసకమెసఁగ నుక్కునఁ దునుమాడె నక్కుమారుని శరా | సన మతఁడొండొక చాపమెత్తి తఱచుటమ్ముల నేదు వెఱిఁగిన చందంబు | సేసె రయంబునఁ జిత్రసేను |
|
| తే. |
నాతఁ డాతనియురమున శాతశరము | దూఱనేయ నబ్బాలుండు తోన వివిధ బాణముల నానృపుని ముంచి శోణితమున | భల్లమొక్కటఁ దల నేల డొల్లనేసె. |
97 |