పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
ప్రతివింధ్యుఁడు చిత్రుఁడను రాజుం జంపుట (సం. 8-10-15)
ఉ. ఏలినవాని పాటుఁ గని యేడ్తెఱఁ దద్బల మొక్క పెట్ట యా
భీలతఁ జుట్టు ముట్టుటయుఁ బేర్చినయుద్ధతిఁ దీవ్ర సాయక
జ్వాలల నేర్చి యుద్భటభుజావిభవం బలరంగ నల్గడం
దోలె నుదాత్తవిక్రమకుతూహలి నా మనుమండు భూవరా!
98
సీ. అప్పుడు ప్రతి వింధ్యుఁడైదు బాణములఁ జి | త్రుని మేనునొంచి తత్సూతు వక్ష
మునఁ గ్రూర శరములు మూఁడు నాటించి యొ | క్కమ్మునఁ గేతు వల్లార్చి పేర్చి
యతఁడు దన్నుగ్రనవాస్త్ర పీడితుఁజేయ | విలుద్రుంచి వెసఁబంచ విశిఖ నిహతుఁ
గావించి శక్తి యుగ్రమ్ముగ వైచినఁ | బెలుచ నాలుగు దునియలుగఁ జేసె
 
తే. నలిగి యాతండు గదవైచి యక్కుమారు | ఘోటకంబుల సూతునిఁ గూల్చె నదియ
పట్టుకొని వైచె మగుడ నప్పాండు పౌత్రు | చేయి వడి నుచ్చిపోవ నచ్చిత్రుఁ డధిప!
99
ఉ. బాహువు నొచ్చినం గినిసి భాసురతోమరమెత్తి కౌరవ
వ్యూహము సంచలింప నతఁ డుగ్రత వైచినఁ గంకటంబుఁ ద
ద్దేహము నుచ్చిపోవుటయుఁ ద్రెళ్ళె నరేశ్వర! యవ్విభుండు వ
జ్రాహతిఁగూలు పర్వతమునాకృతి నుత్కట వైకృతంబుగన్‌.
100
వ. ఇట్లు చిత్రుండు దెగటాఱినం గనుంగొని మన యోధులు ప్రతివింధ్యుపై నడరి యనేకాస్త్ర శస్త్రంబులం బొదివినం బొలివోని కలితనంబున నేలకుఱికి యక్కుమారుండు గోదండటంకారంబున నంబరంబు పూరించుచు బాణాసారంబు వరగింపఁ బాండవసైనికులు బెట్టిదంపుటురవడిం గదిసి యతనికిం దోడ్పడుటయు మనవారలు విచ్చి వెన్నిచ్చి పఱచి రప్పుడశ్వత్థామభీమసేనుల సంగ్రామంబు భీమంబయి చెల్లె నందు. 101
క. గురుపుత్రుఁడు దొంబది శిత | శరములఁ బావని రథంబు సంవృతముగఁ జే
సె రయం బారఁగ సాయక | పరంపరలు వఱపె నతనిపై నతఁ డలుకన్‌.
102
వ. వాని మగిడించి. 103
క. అనిలజుఫాలము గురునం | దనుఁడు పటు ప్రదరకీలితము సేయుడు నా
తని నిటలంబున నతఁ డే | పున బాణత్రయము నాటె భూవరముఖ్యా!
104
వ. మఱియును. 105
చ. గురుసుతభీమసేను లతి ఘోరవిధంబులఁ బోరి యొండొరుం
దెరలుపలేని సామ్యమున దీపితులై లయకాల విస్ఫుర
త్తరణియుగంబుఁబోలె శరధామ సమగ్రతఁ బ్రజ్వరిల్లి యొ
ప్పిరి రథ చిత్రచారులఘు భీషణసంచరణంబు లొప్పఁగన్‌.
106
తే. వారి వీక్షించి ఖచరులు పోరు లెందుఁ | జూడమే? దీని కెన యని యడఁగలదె?
కలుగ వింకను వీరలబలముఁ జలము | నలవు వెరవు నిట్లుండునే? యనుచునుండ.
107
ఉ. ఒండొరు కేతువుల్‌ దునిమి యొండొరుసూతుల నొంచి యేపుమై
నొండొరు తేరివాహముల యు బ్బడఁగించి నిశాతవిస్ఫుర
త్కాండచయంబు లొండొరులకాయములన్‌ వడిఁ గ్రుచ్చి వ్రాలి ర
ప్పాండుసుతుండుఁ గుంభజునిపట్టియు మూర్ఛలు దమ్ముఁ గ్రమ్మినన్‌.
108
వ. ఇట్లు రథంబులపై నొఱగి మూర్ఛిల్లిన. 109
క. అనిలజు సారథియును గురు | తనయుని రథచోదకుఁడు నతని నాతనినిం
గొని యుల్లంబుల బలితపు | దునుకు సొరఁగ ననికిఁ దొలఁగఁ దోలిరి రథముల్‌.
110
ఉ. క్రీడితనూజుఁడైన శ్రుతకీర్తియు శల్యుఁడు నేచి దిక్కుల
ల్లాడఁగఁ బోరుచో శరము లాఱయిదుల్‌ శ్రుతకీర్తి శల్యుమై
గాఁడఁగ నేయ మూఁడు పటుకాండము లాతని మేనఁ గ్రుచ్చి సం
తాడితుఁ జేసె సూతు నిశితప్రదరంబున నాతఁ డుద్ధతిన్‌.
111
చ. నరతనయుండు దత్తనువు నాటఁగఁ దొమ్మిదియమ్ములేసి స
త్వరముగ సూతునంగమున వాలికతూపులు మూఁడు నాటి ని
ష్ఠురశరపంచకస్ఫురణ సూపినఁ గోప మెలర్ప నమ్మహీ
శ్వరుఁడు గడంగి విల్‌ దునిమి సప్తశరంబుల నొంచె నాతనిన్‌.
112
వ. అట్టియెడ. 113
సీ. వేఱొక్క విల్లెత్తి వివ్వచ్చుకొడు కఱు | వదినాలుగమ్ములు వఱపె మద్ర
పతిమేన నతఁడు దొంబదితూపు లడరించి | యేసె నవ్వీరు శరాసనంబు
ఖండంబులుగ వాఁడు గం డడంగక గద | వైచినఁ బొడిసేసి యేచి శక్తి
నిగిడింపఁ దునుమాడె నిశితభల్లంబునఁ | ద్రుంచెఁ దదీయ సూతుని శిరంబు
 
ఆ. వాయుజవములైన వాహంబు లప్పుడు | గలఁగి యరద మనికిఁ దొలఁగ నీడ్చెఁ
దెఱపిగాంచి శల్యుఁ డఱిముఱిఁ జొచ్చిక | లంచెఁ బాండు సుతుబలంబు నధిప!
114
సీ. కమలాకరము లీలఁ గలఁచి యాడెడు గంధ | దంతావళము సముద్దండతయును
దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా | వధియించు కంఠీరవంబు నేపు
నీరసారణ్యంబు నిర్భరాటోపతఁ | గాల్చు దావాగ్ని యుగ్రక్రమంబుఁ
బ్రకటవిక్రాంతిఁ బురత్రయంబును సమ | యించు ఫాలాక్షుని యేడ్తెఱయును
 
ఆ. బోల్పఁ బట్టునయ్యె భుజగర్వ శౌర్య | ప్రతాపదుర్దమప్రకోపములకు
మద్రవిభుఁడు గోలుమసఁగి శాత్రవసైన్య | హననకేలి సలుపునవసరమున.
115
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )