పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
దుశ్శాసనుఁడు సహదేవునితో యుద్ధంబు సేసి మూర్ఛిల్లుట (సం. 8-17-30)
ఉ. ధీరజనోత్తముండు సహదేవుఁడు మైగలి దుస్ససేనుఁడున్‌
వీరులు పిచ్చలింపఁ బ్రజ వి న్నద్రువం బొరినార్వఁ బోరుచో
వారక సాయకత్రయము వాఁడిమి నయ్యువరాజు నొంచె వి
స్తార మనోజ్ఞహారలసితంబగు నా ఘనబాహువక్షముల్‌.
116
చ. ధృతి వొగడొందనేచి సహదేవుఁడు నీసుతు శాతదీప్త స
ప్తతి శరవిద్ధుఁ జేసి వడిఁ దద్రథచోదకు మార్గణత్రయా
హతుఁడుగఁ జేయ నల్గి వెస నాతని చాపము ద్రుంచి యాతఁ డు
ద్ధతి యలరంగ డెబ్బది శితప్రదరంబుల మేను నొంచినన్‌.
117
సీ. నకులానుజుఁడు గృపాణంబున వైచిన | దుస్ససేనుని విల్లు దునియలయ్యె
నెడ గని యవ్వీరుఁడేచి బల్వింట మం | టలు గ్రమ్మున మ్మేయుటయు నతండు
గడువెస నెత్తిన కరవాలమునఁ ద్రుంచి | యతనిమై లక్షించి యదియ వైవ
నడుమన యాతండు నఱికినఁ బ్రస్ఫీత | చాపంబుగొని చతుష్షష్టి నిశిత
 
ఆ. కంకపత్త్రములను గడఁక నయ్యువరాజు | పరఁగఁ జేయుటయును బాండుతనయుఁ
డడఁచె నొక్కటొకటి నైదైదు తీవ్ర శి | లీముఖముల బాహులీల మెఱయ.
118
వ. ఇట్లు విక్రమవిజృంభితుండై సహదేవుండు శతశాత శిలీముఖంబు లడరించిన. 119
చ. రయమున వాని నన్నిటి శరత్రితయంబునఁ ద్రుంచి సాయక
ద్వయమున నాతనిం బటునవప్రదరంబుల సారథిన్‌ భవ
త్ప్రియతనయుండు నొంచి దివి దీటుకొనంగఁ జెలంగి యార్వ న
త్యయసమవర్తిచాడ్పున నతం డుదితభ్రుకుటావిలాసుఁడై.
120
మ. పటునారాచము దీప్తిజాలము నభోభాగంబునం బర్వ ను
త్కట వేగంబున నేయఁ గంకటము వక్షఃపీఠముం దూఱి నె
త్తుటి పొం దేమియు లేక యుచ్చి చనినం దూగాడి యాతండు వ్రా
లుటయుం దేరు దొలంగ సూతుఁడు భయాలోలాకృతిం దోలినన్‌.
121
క. అమ్మాద్రీపుత్రుఁడు వా | లమ్ముల దుశ్శాసనుని మహాసైన్యము రౌ
ద్రమ్ముగఁ గలంచె దివిజ గ | ణమ్ము వినుతిసేయఁ దమమొనలు నలి నార్వన్‌.
122
చ. నకులుఁడు సూతపుత్రుఁడుఁ బెనంగునెడన్‌ నకులుండు సూత పు
త్రకునకు నిట్లనుంఁ దలఁచి దైవము నేఁడు నిజప్రసన్న దృ
ష్టికి ననుఁ బాత్రభూతుఁడుగఁ జేయుట గానఁగ వచ్చె నాదుచూ
డ్కికి నిను గోచరంబుగ ఘటించిన యా చతురత్వసంపదన్‌.
123
క. కౌరవ పాండవులకు నీ | వైరము నీ వలనఁ గాదె వచ్చెను నిను మ
ద్ఘోరశరనిహతిఁ బడఁ గ | న్నారఁ గనుంగొనక కోపమాఱునె? యొంటన్‌?
124
చ. అనవుడు రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ని
ట్లనుట దలంప నర్హమగు నైనను జెన్నఁటి పల్కులేల? నె
ట్టన భుజశక్తి మార్తురకడంక యడంచినఁ బల్కు టొప్పుఁగా
క నిలిచి చూపు నీ చలముకల్మియుఁ జేతులబల్మియుం దగన్‌’.
125
వ. అని పలికి కర్ణుండు. 126
సీ. ఉబ్బి మాద్రీసుతు డెబ్బది మూఁడు దూ | పులఁ గప్పుటయు నతఁ డలిగి యతని
పై డెబ్బది నిశితబాణంబు లేసిన | నా సూతనందనుఁ డక్కుమారు
ధనువు నుగ్గుగఁ జేసి తనువున ముప్పది | కాండముల్‌ సొనిపిన నొండు విల్లు
గొని డెబ్బదింట నాతని నొంచి మూఁడు మా | ర్గణములు సూతునంగమునఁ బఱపి
 
తే. భల్లమున విల్లుదునుమాడి యెల్ల జనులు | నద్భుతంబందఁ ద్రిశతసాయకపరీతుఁ
జేసి నకులుండు నిష్ఠురహాస భాసి | తాననాంభోజుఁడై పొలుపారె నధిప!
127
క. సూతసుతుఁడు బలు విలుగొని | యాతని వక్షమున నాటె నైదమ్ములు ని
ర్ఘాత సమసప్తశరముల | నాతఁ డతని నొంచి విల్లు నఱిముఱిఁ ద్రుంచెన్‌.
128
వ. మఱియు నొక్క మహనీయకార్ముకంబుఁ గొని కర్ణుండు గడంగె నప్పు డయ్యిరువురు నొండొరులతూపులు ద్రుంచుచు నిజమార్గణంబుల నొకళ్ళొకళ్ళ నెత్తుట ముంచుచుం బేర్చి వివిధవిశిఖ జాలంబు లడరించిన నంబరంబు శలభపటల సంవృతంబునుంబోలె నుండె నా సమయంబున నకులునగ్రభాగంబునకు వచ్చిన సోమకబలంబులు గర్ణక్రూర నారాచాది బహుళబాణపాతంబులఁబలాయితంబులయ్యెఁ గర్ణునకు బాసటయై తఱిమిన కౌరవ సైనికులు మాద్రేయు రౌద్ర విజృంభణంబున దూరవిఘటితులై ర ట్లిరువాఁగును నెడగలిగి చూచుచుండ నారథికోత్తము లుదాత్త ఘోరాకారంబుల నుల్లసిల్లిభల్లప్రముఖ ప్రదరంబులఁ బరస్పరాంగంబులం బొదివి యంబుద పిహిత మూర్తులగు మార్తాండ శశాంకుల చందంబు నొంది యన్యోన్య దివ్యాస్త్ర తేజోవిలాసంబుల నయ్యైయస్త్రంబుల వారించుచుం బోరి రట్టి యెడ. 129
క. అలుక వొడమి కర్ణుండు న | కులు చాపము ద్రుంచి సూతుఁ గూల్చి తురంగం
బులఁ జంపి చక్రరక్షుల | తలలు నఱికి సిడిముద్రుంచి దరహాసముతోన్‌.
130
వ. మెఱసినం గుపిత చిత్తుండై. 131
చ. పలకయు వాలునుం గొనియెఁ బాండుకుమారుఁడు రెండు చెక్కలై
యిలఁ దొరఁగంగ నేసె గదయెత్తినఁ ద్రుంచె రథంబు డిగ్గి యు
జ్జ్వలపరిఘాభిరాముఁడయి వచ్చిన నప్పరిఘంబు రూపుమా
పి లసిత లాఘవ స్ఫురణ పెంపునఁ గర్ణుఁడు నొంచె నాతనిన్‌.
132
ఆ. మర్మభేదులైన మార్గణంబుల కోహ | టించి సిగ్గుఁ జలము డిగ్గఁ ద్రావి
యెల్లజనులుఁ జూడఁ బొల్లఁదనంబున | కోర్చి యక్కుమారుఁ డోడిపాఱె.
133
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )