| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇరుగెలంకుల మూఁకలం గలయం గనుఁగొని యెలుంగెత్తి. | 307 |
| క. |
‘తొడరుఁడు పొదువుం డేయుఁడు | పొడువుఁడు బీభత్సుఁ బ్రిదిలి పోనీక వెసం బడవైపుం డొక్కుమ్మడిఁ | గడఁగి!’ యనుచుఁ జేయి వీచెఁ గౌరవనాథా!’ |
308 |
| క. |
విను, మతఁ డిమ్మెయిఁ బురికొలి | పిన, రథ కరి తురగ సుభటబృందములు రయం బున నురవణించె నయ్య | ర్జును పైఁ దగువారు నిలిచి చూచుచు నుండన్. |
309 |
| వ. | ఎదిరి సైన్యంబు సమరంబు దొఱంగి యుండుట యెఱింగి కడఁగుట పాడిగా దని దొరలు దురంబునకుం జొరకుండిరి; గాండీవి కోదండగుణ రణన భరిత భూనభోంతరుం డగుచు వివిధ విశిఖ జ్వాలా కలాపంబుల వేఁడిమి సూపిన, నేపఱి వెఱచి యమ్మూఁకలు పఱచినం గనుంగొని యక్కురునాథుం డద్దొరల నుద్దేశించి. | 310 |
| క. |
‘బీరమును లావుఁ గల్గిన | మీరందఱుఁ గర్ణు నొకని మీఁదన యిమ్మైఁ బోరెల్లఁ ద్రోచి ఫల్గునుఁ | జేర కునికి యాయుధోపజీపుల తెఱఁగే?’ |
311 |
| వ. | అనిన విని, యుల్లంబుల లేని యుత్సాహంబు దెచ్చికొని వా రొక్కుమ్మడి నురవడించిన. | 312 |
| మ. |
భరిత క్రోధ మహోగ్రవృత్తి సిడముల్ భంజించుచున్, సూతుల న్ధరణిం గూల్చుచుఁ, జాపముల్ నఱకుచున్, రథ్యంబులం జంపుచున్, నరుఁ డాభీల పరాక్రముం డగుడు దైన్యం బంది వెన్నిచ్చి వి చ్చిరి వా రందఱు; దివ్యసంఘము నుతించెం జూచి యవ్వీరునిన్. |
313 |
| చ. |
కురుపతి వెండియుం దఱుమఁ గోల్తల సేయర క్రమ్మఱంగ నె వ్వరు నతిభీతి నిట్లు మనవా రెడగాఁ జని చూచుచుండి; ర ప్పరుసున నా సమిద్ధరణిభాగము శూన్యతఁ బొందఁ గర్ణుఁ డ న్నరుఁ దలపడ్డ నప్పటి రణంబు మహాద్భుత మయ్యె భూవరా! |
314 |
| చ. |
శ్రమమున సోలుచుండియుఁ బరాక్రమసంపద సొంపు మీఱ, దు ర్దమ వివిధాస్త్రజాల తిమిరంబుల నొండొరుఁ గప్పి కప్పి శౌ ర్యములును బాహువీర్యములు రాజుల నచ్చెరు వందఁజేయ ను గ్రముగఁ బెనంగి రయ్యమరరాజతనూజుఁడు సూతసూనుఁడున్. |
315 |
| వ. | అట్టియెడఁ, దక్షకునపత్యంబై తత్సోదరుం డగు నైరావతుండు పెనిచి యుపలాలింప నుల్లసిల్లిన యశ్వసేనాభిధానుం డగు నాగకుమారుండు, సర్పముఖశరాకారంబుగైకొని తనయొద్ద నుండఁ, దాను బసిండి యొఱం బెట్టి యనుదినంబును గంధపుష్పంబులు నక్షతంబుల నర్చించుచు నయ్యర్జునుమీఁదం బ్రయోగించువాఁడై యున్న, యట్టి యమ్మహనీయాస్త్రంబు రోషావేశ వివశుం డగుచుఁ బుచ్చికొని, తల దెగవ్రేయుటకై యక్కర్ణుండు సముదీర్ణ జ్వాలాజాలంబు లంబరంబునం బర్వఁ జూపఱులు హాహాకారంబులు సేయం గార్ముకగుణంబున సంధించి తెగవాపినం గని, యారథికుచూపు కంఠంబు దక్కటికిం గాక తప్పి యపాంగ ప్రదేశంబు కొలంది యగుటంజేసి, యది నెపంబుగా శల్యుం డతనికిఁ జిత్తవైకల్యం బాపాదింపం దలంచి ‘యీ సంధానంబు మెడ దునుముట కనుగుణంబు గాదు! నిపుణంబుగా నిరూపించి యొండుభంగి సంధింపు’ మనినఁ గర్ణుండు గనలునఁ గనుఁగవఁ గెంపు గడలుకొన, నమ్మద్రపతిం జుఱచుఱం జూచి. | 316 |
| క. |
‘ననుబోఁటి జోదునుం గా | దని పలుకఁగ నేర్పు నీకు నంత గలదె? య ట్లును గాక వినుము కర్ణుం | డినుమాఱొక శరము దొడుగునే పరులు నగన్?’ |
317 |
| వ. | అని పలికి, కలుషం బగుచిత్తంబుతో నెలుంగెత్తి ‘ఫల్గున! ఫల్గున! పొలిసి’ తంచు నేసిన. | 318 |
| క. |
పలుదెస మంటలు ప్రబ్బఁగ | నలఘుస్ఫురణమున నిగుడు నయ్యస్త్రంబున్ జలజాక్షుఁడు గని పంచాం | గుళ మాత్రము రథము ధరణిఁ గ్రుంగ నదుముడున్. |
319 |
| క. |
సుర గరుడ ఖచర విద్యా | ధర ఖేచరు లంబరం బుదాత్తధ్వనిసం భరితముగఁ బొగడి రమ్ముర | హరు దివ్య ప్రసవ విరచితార్చనతోడన్. |
320 |