పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
సర్పముఖ శరంబున నర్జునుకిరీటంబు భూమిపైఁ బడుట (సం. 8-66-11)
మ. కురువంశోత్తమ! వారిదిక్కు ప్రజ సంక్షోభింప నప్పాఁప తూ
పు రయం బుగ్రము గాఁగ బి ట్టడరి, దంభోళిప్రభగ్న క్షమా
ధర శృంగాకృతిగా హరించె బహురత్నస్ఫీత రశ్మిచ్ఛటా
స్ఫురితం బైన కిరీటమున్‌ విజయునొప్పుం దేజముం గుందఁగన్‌.
321
తే. జనులు విహ్వలు లగునట్టి ఘనరవంబు | దిశలయందు నాకసమున దీటుకొనఁగఁ
గర్ణుఁ డట్లు భేదించె దిక్పతులచేత | నైనఁ జెడని కిరీట మయ్యహిశరమున.
322
క. సురపతి తపంబు సేసినఁ | బరమేష్ఠి ప్రియంబుఁ బొంది, బహుమానపుర
స్సరముగ నిచ్చినయది య | క్కిరీట మరిభీషణత్వ కీర్తిదము నృపా!
323
ఆ. వనధివాసులగు నివాత కవచులను | దనుజు లాపురందరున కజయ్యు
లైన, నతఁడు వనుప నర్జునుఁ డోర్చిన | మెచ్చి యక్కిరీట మిచ్చె నధిప!
324
చ. వినుము నరేంద్ర! చూడ విన విస్మయ మిట్టిది పాఁపరమ్ము వా
త నెగయు ఘోర రూప భయద ప్రథమాన విషాగ్ని జిహ్వికల్‌
దనికినఁ బెల్చ మండుచు నిలాస్థలి డొల్లె నినుండు పశ్చిమాం
బునిధి నితాంతదృశ్యరుచి పొల్పెసఁగం బడుభంగి దోఁపఁగన్‌.
325
వ. అప్పుడు. 326
ఉ. శృంగములేని నీలగిరి చెల్వునఁ గ్రీడి కిరీటహీనుఁ డ
య్యుం గనుపట్టె వెల్లతల యొల్లియ మౌళి దృఢంబుగా నమ
ర్చెం గురునాథ! పూర్ణశశి చెన్నునఁ బూర్వమహీధరంబు కాం
తిం గడచన్నయందము ప్రతీతము గాఁగ నటించు చాడ్పునన్‌.
327
వ. అట్లు రాధేయకర ప్రముక్తంబై కిరీటంబు నిర్దహించి నేలం గలసిన యమ్మహోరగంబు గ్రమ్మఱం గవిసినం గని, కమలనాభుండు గవ్వడితో ‘మనమీఁద మగుడ నిమ్మహాసర్పంబు సనుదెంచు చున్నయది’ యనిన నతం ‘డిది యెక్కడి పా? మిట్లు వచ్చుటకుఁ గతం బేమి?’ యని యడిగిన ‘దీని నెఱుంగవే? ఖాండవం బేర్చునప్పుడు దనతల్లిని రక్షించుకొని యనలంబునకుఁ దప్పిపోవం, బోవ నీక, నీ వేసిన నన్నాగాంగన మృతిం బొందె; నప్పగ వాటించికొని కర్ణుకడ నమ్మెయి నున్న యశ్వసేనాభిధాన భుజంగంబు.’ 328
తే. ‘ఆతఁ డేయఁ గిరీటంబు నపహరించి | దానఁ గోపంబు వోవక తాన కడఁగి
నిన్నుఁ బరిమార్పఁ గడఁగెడు’ నన్న నెఱిఁగి | యాఱు పటుభల్లములఁ దునుమాడె నతఁడు.
329
వ. అత్తెఱంగున. 330
సీ. ఉరగంబుఁ దునిమి, వే మరలి కర్ణునిమీఁదఁ | బదియుఁ బండ్రెండును బటుశరములు
నిగిడించి యుజ్జ్వలంబగు దొడ్డనారసం | బేసిన, నది రుధిరాసవంబు
పానంబు సేయుచు మే నుచ్చి చనిన, దం | డాహతం బైన మహాహివోలె
నా సూతనందనుఁ డత్యుదగ్రుం డయ్యు | నంతకుమును పాఁపరమ్ము చేత
 
తే. నర్జునుఁడు సావమికి వెఱఁగంది యాతఁ | డటులు గెరలి పండ్రెండువాలమ్ము లేసి
పద్మనాభుని నొప్పించి, పార్థు నొకటి | కొఱఁతగా నూరు శరముల నుఱక నొంచె.
331
క. వెండియు బలువిడి నయ్యా | ఖండలసుతు నురము గ్రూరకాండంబుల నొం
డొండ కడు నొవ్వనేసి, య | తం డుబ్బున నార్చె గగనతల మద్రువంగన్‌.
332
తే. ఆర్చి పెలుచ నట్టహాసంబు సేసిన | నలిగి యతఁడు భల్లములఁ దదీయ
భూరికంకటంబు పాలు పఱ నఱకి, యు | ల్లసిత మకుటకుండలములు డులిచె.
333
వ. డులిచిన నబ్బలుమగండు. 334
క. శిరమునఁ గర్ణంబుల నె | త్తు రొలుక బరిమేనితోడఁ దూలక బాహు
స్ఫురణంబు మెఱయ సాయక | పరంపరలు నరునిమీఁదఁ బఱపెం బెలుచన్‌.
335
తే. వానిఁ దునుమాడి యాపాండుసూనుఁ డలఘు | శరచతుశ్శతిఁ బొదివి నెత్తురులు మేనఁ
బఱప గైరిక నిర్ఝరప్రకర శోభి | తాచలము వోలి పొలిచె నయ్యంగరాజు.
336
ఉ. అమ్మెయి నుగ్రుఁడై మఱియు నర్జునుఁ డుజ్జ్వలవత్సదంతకాం
డమ్ములు పెక్కు సత్వర దృఢస్ఫురణం బలరంగ నేసి, ర
థ్యమ్ముల సూతుఁ గేతనము నాతనితేరును గూడఁ గప్పె, మే
ఘమ్ముల గ్రమ్మి భూధరము గప్పినభంగిఁ దలంపఁ బట్టుగన్‌.
337
వ. ఇ వ్విధంబున విక్రమ కుతూహలియై విజృంభించె నప్పుడు. 338
ఉ. నెత్తుటఁ దోఁగి మేను కమనీయరుచిం గొమరార, బాణసం
పత్తి యుదగ్రతన్‌ మెఱయ, భాస్వరుఁడై యరదంబుమీఁద భూ
పోత్తమ! కర్ణుఁ డొప్పె నరుణోజ్జ్వలమండల కాంతిపూరము
న్మొత్తపు దీప్తులుం దగ నినుం డపరాద్రి వెలుంగుచాడ్పునన్‌.
339
వ. ఇట్లు సూతనందనుండు నొచ్చియుఁ బొలివోనిబంటుతనంబున జంట మెఱుంగులు చదలం బరఁగ శరంబు లడరించుచు, బహుబాణంబులు రేణువులుగాఁ జేయుచుండ సవ్యసాచి దివ్యాస్త్ర విలాసంబు భాసమానం బయ్యె నయ్యవసరంబునఁ గాలుం డదృశ్యాకారంబున. 340
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )