పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
బ్రాహ్మణశాపంబునఁ గర్ణురథచక్రంబు భూమింగ్రుంగుట (సం. 8-66-42)
క. ‘భూసురశాపంబున నిదె | యీ సూతజు రథము చక్ర మిలఁ గ్రుంగెడు, వీ
తాసుఁ డగు నీతఁ’ డని సే | నాసముదయ యుగ్మకము వినం బలికె నృపా!
341
వ. పరశురామదత్తంబయిన భార్గవాస్త్రంబను పేరిటి మహనీయసాధనం బప్పుడు రాధేయునకుం బ్రతిభాసింప కుండె; దాపటికల్లు గ్రుంగినఁ దేరు ఘూర్ణిల్లె; నట్లు జామదగ్న్య మహీసురుల శాపంబు లస్త్రబలంబునకు రథంబునకు వైకల్యం బాపాదించి చిక్కువఱుచుటయును, సర్పముఖశరం బాభంగి నిష్ఫలప్రయత్నం బగుటయును దనమనంబున నొ వ్వడరి యక్కర్ణుండు గరంబులు విదుర్చుచు. 342
తే. ‘ధర్మవాదులు, ధర్మతత్త్వ ప్రధాన | చిత్తులగువారిఁ బూని రక్షించు ధర్మ
మందు; రది బొంకు గావించె నతులధర్మ | శీలుఁ డగు నాకు ధర్మువు సెలవు లేద?’
343
క. అని ధర్మంబును దూఱఁగఁ | దను నర్జును బాణవితతి తద్దయ వడిఁ దాఁ
కినఁ గర్ణుండు విషాదం | బున వెండియుఁ బెద్ద దూఱు భూవరముఖ్యా!
344
క. కన లధికమైన లావె | క్కిన యయ్యంగపతి నొంచెఁ గృష్ణార్జునులన్‌
సునిశిత శరములు మఱియుం | జొనిపెను దనధైర్యమహిమ సుర లగ్గింపన్‌.
345
వ. అలిగి, యర్జునుం డాశీవిషంబులుంబోని విశిఖంబు లాఱు కర్ణుమే నుచ్చి చననేసినం గ్రోధభాషితుండై, యతండు బ్రహ్మాస్త్రంబు ప్రయోగించుటయు; నప్పార్థుం డైంద్రాస్త్రంబు ప్రయోగించిన. 346
క. అమితబలం బగు బ్రహ్మా | స్త్రముచే నయ్యస్త్ర మపహృతం బగుటయుఁ, జి
త్తమున విషాదము దనుకఁగఁ | గమలాక్షుఁడు గారవమున గాండివితోడన్‌.
347
వ. ‘నీ యస్త్రం బిప్పుడు కర్ణాస్త్రంబుచే విధ్వస్తం బయ్యె; నిట్లుగా నేల? యనవుడుఁ గవ్వడి బ్రహ్మాస్త్రప్రయోగంబున నమ్మహనీయ సాధనంబు బాధితంబు సేసి రాధేయాంగంబు బాణజాలంబులం బొదివి నొప్పించిన, నమ్మేటిమగండు గాండీవంబు మౌర్వికోటిఁ బాసిపో నేసిన, నా సవ్యసాచి మగుడ నమర్చి మార్గణంబులు నిగిడించిన, రయంబున నా సూతపుత్రు చూడ్కి కమ్మౌర్వి యూడుట దోఁపకుండె; నవ్వీరుండు వివ్వచ్చు విశిఖంబులు వారించి యతని తనువు నొంచిన వెండియుఁ బుండరీకాక్షుండు సహస్రాక్షనందను నుద్దేశించి. 348
క. ‘నిను నొంచువాఁడె కర్ణుం? | డనితర సులభప్రకారమగు భుజవీర్యం
బున నసమానోజ్జ్వల ఖే | లనమునఁ దెగటార్పు శరవిలాస నిరూఢా!’
349
వ. అనునప్పుడు, విష విస్ఫుర ద్భుజంగ భంగికం బైన బాణంబు రౌద్రమంత్ర సహితంబు సేసి, కర్ణుండు పార్థుప్రాణంబులు గొన నప్పళించి సంధింప, మున్ను కొండొక క్రుంగిన చక్రంబు కుండ మునుంగం దిగఁబడిన, నొడ్డగెడవై యరదం బేటునకు ననువీక తక్కిన, నుక్కఱి యక్కర్ణుం డప్రతీకారంబులగు రోష విషాదంబులఁ గన్నీరొలుక, రథంబు డిగ్గి కవ్వడిదెసఁ గనుంగొనుచు నిట్లనియె: 350
సీ. ‘అరదంబు చక్రంబు ధరఁ జాలఁ గ్రుంగిన | నెత్తెద, నంతకు నేయ కుండు;
మేను భూమిస్థుఁడ నీవు రథస్థుండ | వియ్యెడఁ దగ వగు నేయ కునికి;
విరిదలవానిని విరథుని నాయుధం | బిడినవానిని శూరు లేయ రెందు;
మహిత శూరుఁడ వనుమాత్రగా దుత్తమ | కులుఁడవు, రణధర్మకోవిదుండ,
 
ఆ. విట్టి నీవు దగిన యట్టి భంగిన యని | సేయవలయు; నిట్లు సెప్పు టెల్లఁ
బాడి యేర్పడంగఁ బలుకుట గాని, గో | విందునకును, నీకు వెఱచి కాదు!’
351
వ. అనిన విని, యచ్యుతుం డతని కిట్లనియె : 352
క. ‘ఏమీ! తగవును ధర్మము | నీ మనమున నేఁడ పుట్టెనే? గర్వము ను
ద్దామ దురభిమానము నే | లా మఱచితి కర్ణ? యా చలం బెటఁ బోయెన్‌?’
353
ఆ. ‘పరమధర్మపరులు పాండుభూవల్లభ | సుతులు, వారి నతులశుభము లొందు;
ధర్మహీను లైన ధార్తరాష్ట్రులకుఁ బా | టిల్లు నివ్విధమున నెల్లచేటు.’
354
వ. ‘దీనికి నీవు కటకటంబడినం బోవునే?’ యని పలికి వెండియు. 355
సీ. ‘గొంతియు నందఱు గొడుకులు సుప్తులై | యుండంగ లక్కయిల్‌ మండఁ జేసి
కపటంపు జూదంబు ఘటియించి ధర్మాత్ముఁ | డగు ధర్మసుతు సిరి యపహరించి,
యంతఁ బోవక ద్రుపదాత్మజఁ దెచ్చి స | భాస్థలి నమ్మెయి భంగపఱిచి,
యమ్మహాత్ములఁ జంప నడవికి ఘోషయాత్రావిధి నెపమున దాడి వెట్టి,
 
తే. బాలు నభిమన్యు నొక్కని బహురథికులఁ | బనిచి చంపించె మీసుయోధనుఁడు; దలఁపఁ
గాని, యిప్పాపముల కాదికర్త నీవ; | యిన్ని యెడలను నీపాడి యెందుఁ బోయె?’
356
వ. అని యిట్లు, కృష్ణుండు గర్ణుతో నాడుమాటలఁ దోడ్తోడం బెరిఁగిన యద్ధనంజయు మనంబు రోషానలంబు రోమకూపంబులఁబటుజ్వాలారూపంబుల వెడలుట, యతివిస్మయ ప్రదంబై యుండె; నయ్యుగ్రమూర్తి సముదగ్ర పరాక్రమంబునం గురియు పటుబాణా సారంబు వారించి, యవ్వీరు నంగంబున నయ్యంగపతి నిశితాస్త్రంబులు నిగిడించుట మహాద్భుతంబయ్యె; నత్తెఱంగున నీడంబోక పెనంగు నతం డతిరయంబున నన్నరునిం బది దొడ్డనారసంబుల నొప్పించిన, నత్తేజోధనుం డాజ్యధారాచ్ఛటాసేకంబున నుద్రేకంబు నొందిన హుతవహుండునుం బోలె మండి, శత్రుసంత్రాసనంబును మిత్రోల్లాసనంబును బ్రగుణమణి జాంబూనదమయంబును జనప్రస్తుతి పాత్రంబును హస్తికక్ష్యాత్మకంబును నగు నతని కేతనంబును గనకపుంఖప్రభా భాసితంబైన భల్లంబునఁ బడనేసినం గౌరవులు నిజ యశో బలదర్ప ప్రియంబుల మొత్తంబులు వడుటగాఁ దలంచుచు హాహాకారంబులతో నా రాధేయుని దెస నిరాశులై; రట్లు ప్రస్ఫీతకేతుపాతనం బాచరించిన, దానం గనలి కర్ణుం డతినిశిత క్రూరనారాచజాలంబులు గృష్ణార్జునులమీఁదం గురిసి వెగడుపఱిచి యరదంబు పిఱిందికొమ్ము క్రిందికి మూఁపు సొనిపి లావున నెత్తిన, రథచక్రంబు విడువక, భూమి గులపర్వత కానన సముద్రసహితం బాఱంగుళంబు లెగసె; నట్లు కర్ణుండు రథంబు నిలిపి, మీఁదికిం జని, యెప్పటి బాణంబు సంధింప వెండియుఁ జక్రంబు దిగంబడినఁ; గ్రమ్మఱ రథంబు డిగ్గి యెత్తనమరె; నయ్యవసరంబునఁ గృష్ణుపనుపునం గ్రీడి దోడన. 357
మ. కులిశ ప్రస్ఫురణాపహాసననివిభాగుచ్ఛంబులం గల్గి యాఁ
కలిమైవచ్చు కృతాంతవక్త్ర మన నుగ్రంబై మురారాతి రు
ద్రుల చక్రంబును శూలముం దెగడుచుం గ్రూరంపు టొప్పారు నం
జలికంబైన మహాస్త్రముం దొడివి కర్షం బుబ్బునం జేయుచున్‌.
358
క. ‘ఏను దపశ్చరణంబున | దానంబున గురుజనాభితర్పణమున, ని
త్యానూన వ్రతశీలుఁడ | నేనియుఁ గర్ణుతలఁ ద్రెంచు నీశర’ మనియెన్‌.
359
క. అని, తెగ నిండఁ దిగిచి యే | సిన, నయ్యస్త్రంబు రోదసీకుహరంబుం
దనమెఱుఁగుల నించుచు నిరు | మొనల జనుల గాఢమూర్ఛ ముంచుచు నిగిడెన్‌.
360
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )