| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
క్షరితశోణితమగు శార్దూల చర్మంబు | పరిధానకరణి విభాసితముగ; నురగాత్మకములైన యుపవీతములు హార | ములు నంగదంబులు పొలుపుమిగుల; వివృతవిశాలాస్యవివరంబు నిశిత దం | ష్ట్రానికరంబు ఘోరంబు గాఁగ; భాసుర కాంతి వికాసంబు లగు లోచ | నంబులు బహుసహస్రంబు లొప్ప; |
|
| తే. |
నుగ్రమును సుందరంబును నుజ్జ్వలంబు | నై మహాకార మద్భుత మావహింప భూత మొక్కటి భీషణ స్ఫురణ మెసక | మెసఁగ నగ్గురుపుత్రు కట్టెదుర నిలిచె. |
95 |
| క. |
విను మా భూతం బిట్టిది | యని కలరూ పేర్పఱింప నమరులకు వశం బె? నరేంద్ర! తదాకృతి గనుఁ | గొనినన్ భేదిల్లవలయుఁ గొండకు నైనన్ |
96 |
| వ. | ఇ ట్లతని యగ్రభాగంబున నావిర్భూతం బైన యమ్మహాభూతంబు నాస్యకుహరంబున, నాసికా వివరంబులఁ, జెవులఁ, గన్నుల, నన్నింట మంటలు వెడలి మింట నడరఁ దదీయతనుతేజోమరీచిసంఘంబుల శంఖ చక్రగదాహస్తులై హృషీకేశు లనేకులు వెడలి; రి ట్లఖిలభూతభయంకరంబగు నమ్మహాభూతంబు నాలోకించి యవ్వీరవరుండు. | 97 |
| చ. |
హృదయమునం గలంక యొకయించుక యేనియు లేక వీర సం పద యలరంగ భల్లముఖ బాణతతుల్ నిగిడింపఁ బెద్దగా వదనంము విచ్చి భూత మనివార్య విధంబునఁ ద్రావె బాడబం బుదధిజలంబు ద్రాగెడు మహోగ్ర సముద్ధతి వాని నన్నిటిన్. |
98 |
| చ. |
అతుల శరంబు లట్లు వృథయైనఁ గనుంగొని ద్రౌణి రశ్మి మం డిత మహనీయశక్తి నిగిడించిన భూతముఁ దాఁకి యంత్యకా లతిమిరవైరి మండల విలగ్న మహోల్కయుఁ బోలెఁ బిన్న పి న్న తునియలై యడంగె నరనాథ! యతండు విషాద మందఁగన్. |
99 |
| చ. |
అలఘుతరాత్మసారుఁడగు నగ్గురుపుత్రుఁడు ఘోరఖడ్గమున్ బిలగతసర్పముం దిగిచి భీషణరేఖ నటించుభంగి న గ్గలపు రయంబునం బెఱికి గాఢవిముక్తము గాఁగ వైచినం బొలుపఱి పోయె దూదిక్రియ భూతశరీరసమాగమంబునన్. |
100 |
| తే. |
సరభసంబుగఁ దోమర సమితిఁ జక్ర | వితతిఁ బరఁగించి పేర్చె నవ్వీరవర్యుఁ; డదియు నదియును దోడ్తోడ నల్ల నగుచు | మ్రింగె నమ్మహాభూతంబు మేదినీశ! |
101 |
| క. |
అలిగి యతండు నాతాంతో | జ్జ్వల గద వైచుటయు నదియు సత్వరలీలన్ జలచర మామిషముంగొను | పొలుపు నెఱయ మెఱయ మ్రింగె భూతం బధిపా! |
102 |
| ఆ. |
ఇవ్విధమున సకల హేతులు వమ్మయి | పోవ నతివిషణ్ణబుద్ధి యగుచు నట్టు నిట్టుఁ జూచు నతనికి బహు జనా | ర్దనులు దోఁచి రంబరమున నెల్ల. |
103 |
| ఉ. |
భీకర విష్ణురూపములు పెక్కిటు లొక్కటఁ దోఁపఁ దీవ్రతా పాకులమానసుండగుచు నగ్గురుసూనుఁడు ‘దుర్మదంబునన్ జేకొననైతి నట్లు కృపు చెప్పిన సత్యహితోపదేశముల్; నా కిది పెద్దయే?’ యని మనంబున నిట్లని వల్కె వెండియున్. |
104 |
| ఆ. |
‘మహిత శాస్త్ర కలిత మార్గంబు విడిచి ని | జేచ్ఛఁ బగఱ గెలువ నెవ్వఁ డరుగు వాని నయ్యధర్మవర్తన క్రౌర్యమ | యెవ్విధమునఁ జెఱుచు నింత నిజము.’ |
105 |
| సీ. |
గోవు, బ్రాహ్మణు, బాలకుని, వృద్ధు, నంధుని, | సఖుఁ, దోడఁబుట్టువు, జడుఁ బ్రమత్తు, మత్తుని, గురుని, నున్మత్తుని, సుప్తుని, | నంగన, భీతుని నస్త్రశ్రస్త నిహతి నొప్పించుట విహితంబు గాదని | యార్యులు సెప్పుదు; రట్టి ధర్మ మార్గంబు దొఱఁగి దుర్మంత్రంబుమైఁ బగ | యడఁగింపఁ గడఁగిన నసురవృత్తిఁ |
|
| ఆ. |
జేట గాక కార్యసిద్ధి గా నేర్చునే? పెద్ద యెత్తికొనిన భీతి మగుడఁ బడుట కష్టసరణి; బలిమి దయ్యముతోడఁ | జెల్ల; దింక నేమి సేయువాఁడ? |
106 |
| ఉ. |
అక్రమవృత్తి గీడుతెరువై ఫలియింపద; ద్రోణసూతి దు ర్విక్రమనింద కర్హుఁడె? సవిస్మయ మైనమనంబు భూతవృ త్తిక్రమవేదిగాదు; గణుతింపఁగ నేమియొ యిమ్మహాద్భుత ప్రక్రియ కాదికారణము? పాపనిరూఢుఁడు నీతిఁగాంచునే? |
107 |
| వ. | అని పెక్కు భంగుల వగచి పల్లటిల్లిన చిత్తంబుఁ బట్టుకొల్పి యిట్లని నిశ్చయించె. | 108 |
| వ. |
భావం బేకముఖంబుఁ జేసికొని యావద్ధ్వాంతభానున్, మహా దేవుం, బర్వత కన్యకాప్రియు, దయార్ద్రీభూత చేతస్కు లో కావిర్భావ వివర్ధనా లయకృతి వ్యాపార పారంగతున్. దేవేంద్ర ప్రముఖామరార్చితుని భక్తి ప్రౌఢతం గొల్చెదన్. |
109 |
| ఆ. |
అఖిల దేవతామయాత్ముఁ డద్దేవుఁ; డ | ట్లగుట నిఖిలదైవికాపదుదయ నిరసనం బొనర్చు; నియతి నప్పరమేశుఁ | గొలిచి, యుపుడ కీడు దొలఁగఁ ద్రోతు.’ |
110 |
| వ. | అని యిట్లు నిశ్చయించి నియతుండై రథంబు డిగ్గి ధరణీతలంబునం గూర్చుండి భావంబున భూతనాథు నెల కొలిపి యక్కుంభజసంభవుండు. | 111 |