పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
అశ్వత్థామ శివున కాత్మోపహారం బొసంగ నిశ్చయించుట (సం. 10-7-4)
సీ. ‘స్థాణు, నుగ్రుని, శివు, శర్యు, నీశానుని, | భద్రప్రదుని, శంభు, రుద్రు, గిరిశు,
నవ్యయు, శ్రీకంఠు, హరుఁ, బరమేశ్వరుఁ, | బురహరు, నజుని, శంకరుఁ, ద్రినేత్రు,
బహురూపు, విశ్వరూపత్వసంవ్యాప్తుని. | నంబికా హృదయేశు, నమరవంద్యు,
గణనాథు, విభు, శూలఖట్వాంగధరు, జటా | మండలాలంకృతమౌళి, నభవు
 
ఆ. నాశ్రయించి యతని కాత్మోపహార మ | ర్వించువాఁడఁ గాక పెక్కు తలఁపు
లేల నాకు నమ్మహేశ్వరేశ్వరుఁ డెట్టి | గతి యొనర్చి నది సుఖంబ కాదె?’
112
వ. అని తలంచి భూతకృత్యం బైన పరాక్రమ ప్రతిబంధ రూపం బుగ్గడించి. 113
క. ‘ఏ నీ యాపదఁ గడచిన | నానా భూతోపహార నవ్యార్చన నీ
శానునిఁ బ్రీతుం జేసెదఁ | బూని ప్రమథగణము నన్నుఁ బొగడునటులుగన్‌.’
114
చ. అని హృదయంబునం బలుకు నమ్మహనీయచరిత్రు ముందటం
గనకపువేది దోఁచె నధికద్యుతిజాలము లుల్లసిల్ల; నం
దనలము విస్ఫుదత్పటుశిఖావలి నొప్పి వెలింగె; దానికి
న్మనము దవిర్ప; నిశ్చయమునం దెలివొందె నతండు నెంతయున్‌.
115
వ. అప్పుడు ప్రదీప్తవదనులుఁ, బ్రజ్వలిత నేత్రులు, నేకపాదులుఁ, గరితురంగ సింహసూకరానన సమాన ముఖులును, దీవ్ర దంప్ట్రాకరాళాస్యులును మఱియు ననేక ప్రకారంబులగు వక్త్రంబులం బొలుచువారును, వక్రాంగులు, దీర్ఘదేహులు, హ్రస్వశరీరులు, నతి స్థూలకాయులుఁ, గృశమూర్తులుఁ, బింగళగాత్రులు, నీలతనులు, మఱి నా నావర్ణంబులు గలుగువారును, బంచశిఖులును, జటాధారులును, గిరీటధరులును, మఱియు బహుభంగి కంబులైన మౌళితలంబులం బొలుపొందువారును లోనుగా వివిధ విశేష వికృతస్వరూపులగు నసంఖ్యాత ప్రమథులు చిత్రాంబర మాల్యాంగరాగంబులు, రత్నకనకమయ భుజగాస్థిమాలా భూషణంబులును, ధనుస్తూణ కృపాణ ముసల ముద్గర పరశు భిండివాల శూల ప్రభృతి స్ఫార ప్రహరణంబులు మెఱయ మృదంగ పణవ డమరు ఘంటా గోముఖాది తూర్యంబులు మెరయ విస్ఫుర ద్ధ్వజ పతాకాకుంచికలు శోభిల్లఁ బాడుచు, నాడుచు, నార్చుచు, బొబ్బలిడుచు, నవుడుగఱచుచుఁ, ద్రుళ్ళుచు, గురువులువాఱుచుఁ, గరటి బృంహితంబులుఁ, గంఠీరవగర్జితంబులు, శంఖరవంబులు, భేరీధ్వనులుంబోని యెలుంగులు సెలంగ, బెట్టిదంబులగు పలుదెఱంగుల పలుకు లెసంగ, బ్రహ్మద్వేషు లగువారి మాంసరుధిరంబులఁ బూర్ణంబు లగు కపాలంబులు గరతలంబులం గొని యాభీలంబు లగు భక్షణపానంబు లాచరించుచు, సోమపాన శమదమ తపోబ్రహ్మచర్య ప్రముఖుంబు లగు తమ విశిష్టకర్మంబులకు భవుండు విస్మయంబు నొందుంగాని యష్ట గుణంబగు నైశ్వర్యంబు నొందియుఁదారువిస్మితులుగాని యట్టిమహానుభావు లద్దేవునకు గౌరికి గజముఖ షణ్ముఖులకంటె నర్మిలికిం బట్టగు భవ్యులు దివ్యజనస్తవ్యు బఁయ్యస్త్ర గురుతనూభవు తెంపెఱుంగుటకు సౌప్తిక వ్యాపార ఘోరత్వంబుఁ గనుంగొని వినోదించుటకు వచ్చి యతని చిత్తంబునకు బెదరు పుట్టించువారై భీషణా కారంబుల నుల్లసిల్లిన నాధైర్యధుర్యుండు. 116
మ. వెఱ పావంతయులేక వారిఁ గలయన్‌ వీక్షించి నమ్మోమునం
జిఱునవ్వున్‌, మదిఁ దెంపుసొంపు వెలయం, జెల్వంబురెట్టింప, నం
దఱుఁ గీర్తింప, రథంబుమీఁది ఘనకోదండంబు చేనంది, చి
చ్చఱుకం జేరె నుదాత్తభంగి మహనీయోత్సాహ సందీప్తుఁడై.
117
ఆ. ఇవ్విధమునఁ జేరి యవ్వేది లోపల | భాసమానుఁడైన పావకుండు
దేహమొక్క యాహుతిగఁ జేయుటకుఁ దగు | నంత లేకయునికి నతఁడు సూచి.
118
క. తన యరదముమీఁదం గల | ధనుర్వితానము, లనత్ప్రదర జాలములం
గొనివచ్చి వేదియం దిం | ధనములుగాఁ జేర్చి తెంపు దలకొనుమదితోన్‌.
119
వ. పేర్చి యప్పరమేశ్వరు నుద్దేశించి. 120
క. ‘తెఱఁ గెట్టిదియో నా మది | నెఱుఁగ మదాత్మోపహార మిచ్చెద నీకుం
గఱకంఠ! వరము నాకుఁ బ | గఱఁ బరిమార్పంగ శక్తి గలుగుటయ చుమీ!;’
121
వ. అని ప్రార్థించి. 122
క. ‘ఆంగిరస కుల జనిత మీ | యంగము శిఖియందు దీని నాహుతిగాఁ జే
యం గంటి భవద్భక్తి సు | సంగతిమతితోఁ గృతార్థజన్ముఁడ నైతిన్‌.’
123
క. అని పలుకుచుఁ బరమేశ్వరు | మనమున నిడి యూర్ధ్వ బాహు మహితాకారుం
డును ఘనసమాధి యగుచున్‌ | విను ముఱికెను గురుసుతుండు వేదికపైకిన్‌.
124
ఆ. ఉఱికి మంటలోన నుల్లంబు తెలివొక | యింతయేనిఁ గుంద కిద్ధమూర్తిఁ
దేజరిల్ల నున్న ధీరవర్యునకుఁ బ్ర | త్యక్షమయ్యె శివుఁడు దయదలిర్ప.
125
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )