పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
అశ్వత్థామకు శివుఁడు ప్రత్యక్షంబై ఖడ్గం బొసంగుట (సం. 10-7-59)
వ. ఇ ట్లెదుర నిల్చిన భక్తవత్సలుం డగు భవానీవిభుండు దరహసిత ముఖుండగుచు దివ్యావలోకనామృతంబు
వెల్లిగొల్పిన నవ్వేదియందుఁ గమలాకరంబులో నున్న చందంబునఁ బ్రమోదంబు నొందియున్నయన్నరోత్తము నకు నారాయణప్రియుం డిట్లనియె.
126
క. ‘ఇమ్మెయి నీ దగు సత్క | ర్మమ్ము విశేషమునఁ జేసి మానస మత్యం
తమ్ము ప్రియమందె నీకు వ | రమ్మొసఁగఁగ వచ్చితిన్‌ ధరాసురవర్యా!’
127
వ. అనవుడు. 128
తే. తనువు పులకల ప్రోవుగా, మనము గాఢ | సంభృతానందముగ శరాచార్యసుతుఁడు
వితత సంభ్రముఁడై వేది వెడలి సాఁగి | మ్రొక్కి లేచి ఫాలంబున మొగిచెఁ గేలు.
129
వ. అప్పుడు. 130
చ. అతని మొగంబుమీఁద నొలయన్‌ మధురంబగు చూడ్కి పార్వతీ
పతి మృదురీతి నిట్టు లను; ‘భవ్యములైన తపంబు, సత్యము,
న్ధృతియును, శౌచముం గలిగి నిశ్చలభక్తి నొనర్చుఁ గృష్ణుఁ డ
ప్రతిమసపర్య నాకు; ననురక్తుఁడ నేనును నమ్మురారికిన్‌.’
131
క. అతనికి సన్మానము సే | యు తలంపున భూతరూప యుక్తుఁడనై వ
చ్చితి నినుఁ బాంచాలురపై | నతి స్ఫురణఁ బోవనీక యడ్డం బైతిన్‌.
132
తే. తెల్లముగ నీదు చిత్తంబు తెఱఁ గెఱుంగ | వలసి నే ని ట్లనేకమాయలు పొనర్చి,
యస్త్రశస్త్ర నిరాసంబు నాచరించి, | కేలి సలిపితి వేయును నేల చెపుమ.’
133
వ. ‘కృష్ణ సన్మానంబును గృతంబయ్యెఁ; బాంచాలురకుఁ గాలంబు డగ్గఱియె; నేఁడు దెగుదురు; నీవు నా యను గ్రహంబు వడసి’ తని యొక్క మహనీయఖడ్గం బవ్విప్రు ని చేతి కిచ్చుచు నతండెఱుంగకుండఁ దేజోరూపం బున నతని తనువున నావేశించె; నిట్లు రుద్రుండొలసిన యగ్గురునందనుండమంద హర్షమయమూర్తియై యతులప్రభనొప్పె; మున్ను భూతంబుచేత నవహృతంబులైన యస్త్రశస్త్రంబులును, బిదప వేదియం దిడిన యాయుధంబులు నమ్మహావీరుని తేరిపైఁ బూర్వ ప్రకారంబున నుండె; నప్పుడు ప్రమభగణంబు లదృష్టా కారంబులై యమ్మహాత్మునిఁ బరమాత్ముఁ గొలుచుచందంబునబలసి రా రథారూఢుండై పాండవ శిబిరం బునకు నాతండు నడవఁ దోడన కృపకృతవర్ములు నడచి’; రనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 134
చ. అతఁ డటు లేవునం జనఁగ నా కృపుఁడుం గృతవర్మయున్‌ ‘మహో
న్నత వరలాభ గర్విత మనస్కుఁడు ద్రోణసుతుండు వోవఁగా,
నితని క్రియన్‌ బలోద్ధతి సహిష్ణుత గల్గునె యెడ్ల? కంచు సం
భృత భయ చిత్తవృత్తులయి పెంపఱఁ బోరు గదా పిఱిందికిన్‌?’
135
వ. మఱియును. 136
వ. పటువేగంబున ముట్టి ద్రోణసుతుఁ డప్పాంచాలలోకంబుఁ ద
క్కటి భూపాలుర, ద్రౌపదీతనయ వర్గంబున్‌ భూజాఖేలనో
ద్భట ఖడ్గోల్లసనంబు పాల్పఱిచి తద్ధాత్రీతలం బెల్ల నె
త్తుట జొత్తిల్లఁగఁ జేసెనే రిపుచమూ దుర్వార ఘోరాకృతిన్‌?
137
క. పాండవ శిబిరముఁ జొచ్చి య | ఖండిత పౌరుషము వెలయఁగాఁ గలశజపు
త్రుం డది యంతయు మత్పు | త్రుం డరిగెడి తెరువునం దరుగఁజేసెఁ గదే?
138
వ. సమరప్రకారం బంతయు సవిస్తరంబుగా నెఱిఁగింపు మనుటయు నతం డి ట్లనియె. 139
తే. ఇవ్విధంబున గరురుసుతుఁ డేపు మిగిలి | చనఁగఁ గృపుఁడును గృతవర్మయును దలిర్చు
కడఁక నతనితో నడచిరి గాని వారి | వలన నించుకయును నరవాయి లేదు.
140
వ. ఇట్లు తన కెలంకుల నడచు నవ్వీరుల నాలోకించి యాచార్యసుతుఁడు సంతోషించి. 141
ఉ. ‘మీరును దెంపుసొం పెసఁగ మిక్కిలి బీరము లావు చూపఁగాఁ
గోరి కడంగి పైఁబడుటకుం దగి యుండదు వీడు మీ బలో
దారత ప్రాపునం జని యుదగ్ర భుజావిభవంబు పెంపు సొం
పారఁగ నవ్విరోధి నిచయంబు సమస్తము నేన త్రుంచెదన్‌.’
142
వ. అని యిట్లు వారి నగ్గించి వాకిట నిలిపి మహనీయ బాణ బాణాసనంబులు వహించి సుప్రసుప్త సకల జనంబైన యా శిబిరంబుఁ జొచ్చి తాను మున్న గతాగతజనంబులవలనఁ బ్రసంగాధీనతం జేసి యవ్విడిదల తెఱంగు లిట్టిట్టివి వారి సన్నివేశంబు లిచ్చటిచ్చట నని సాభిజ్ఞానంబుగా వినియునికి కతంబున నరసికొనిపోవ నేర్చి తొలుత ధృష్టద్యుమ్ను సదనంబునకు నరిగి బాణబాణాసన సహితంబై యున్న రథంబు డిగి రుద్రు నుద్దేశించి మానసంబున. 143
క. ‘పూనితి నిష్ఠమెయి న్నిను | నానా భూతోపహార నవ్యార్చన నీ
కే నొనరించెద; నది యీ | శానా! కైకొనుము; సుప్రసన్నుఁడ వగుమీ.’
144
వ. అనుచు నరిగి 145
తే. అచటి జనములు పగలింటి యాహవమున | శ్రమముఁ బొందియు, నిశ్శేషశత్రు నాశ
నమున నూఱటఁ జేసియు నమితనిద్ర | నొంది యత్యంతవివశులై యుండ నతఁడు.
146
వ. మందగతిం బ్రవేశించి యన్వేషించి. 147
చ. తెరయును, మేలుకట్లుఁ, దగు దీవియలుం జెలు వొంద మేటిచ
ప్పరమునఁ జాల హృద్యమగు పాన్పున నూఱడి నిద్రపోవు న
గ్గురువధికారిఁ గాంచి మదిఁ గ్రోధము మోదము సందడింప సు
స్థిరతఁ బదప్రహారమునఁ దెల్పెఁ దృణీకరణాభిరాముఁడై.
148
వ. తెలిపినఁ గనువిచ్చి తన్నుం జూచి యెఱింగియుఁ గలంగక రణదుర్మదుండైన యా ద్రుపదనందనుఁడు దిగ్గన లేచినం దనచేతివిల్లు విడిచి యతని తలఁబట్టుకొని పెడమఱలఁ దిగిచి యబ్బలియుండు. 149
ఉ. నేలపయిం బడం దిగిచి నిష్ఠురభంగి నురఃస్థలంబు మో
కాల నొగిల్చి యేపున మొగం బతిదారుణ ముష్టి నొంచె ని
ద్రాలసవృత్తి నంగములయందు బలంబును బుద్ధి నేర్పునుం
జాలని యవ్విరోధి వివశత్వముఁ బొందఁగఁ జేసె వ్రేల్మిడిన్‌.
150
వ. ఇవ్విధంబున నతనిచేత ధృష్టద్యుమ్నుండు. 151
చ. వివశత భీతిఁ బొంది కడు విహ్వలుఁడై తనుఁ జూడ ద్రోణసం
భవుఁడు వెసన్‌ శరాసనము వాపి గుణంబు తదీయకంఠముం
దవులఁగఁ జేర్చి వాగురవిధం బొడఁగూర్చి మనంబు విక్రమో
త్సవమున నుబ్బఁగాఁ బశువుఁ జంపెడు చాడ్పునఁ జంపు వేడుకన్‌.
152
వ. ఉరంబును మెడయును నిరుగాలం ద్రొక్కినఁ ద్రోచియు దైన్యంబు దోఁప గోళ్ళ గీఱియు నిస్తరింపలేక యెలుంగు వెడలకున్న నెట్టకేలకు మాట వెడవెడ యెఱుంగవచ్చు తెఱంగునఁ బాంచాలవరుం డమ్మహీసుర వరున కిట్లనియె. 153
క. ‘గురుపుత్ర! శస్త్ర నిహతిం | బొరిపుచ్చుము; తడయ నేల? పుణ్యగతికిఁ జె
చ్చెరఁ బోవునట్లు సేయుట | పరికింపఁగ మేలకాదె పగతురకైనన్‌?’
154
వ. అనిన విని యశ్వత్థామ యతని మొగంబు చూచి. 155
క. ‘వినుము గురుద్రోహికిఁ గ | ల్గునె యుత్తమ గతి? నితాంత కుత్సితభంగిం
దునిమితివి నీవు గురు; నే | నను దుర్విధకరణమున నినుం దెగఁ జూతున్‌.’
156
ఆ. అనుచుఁ బెలుచ నొంప నచ్చటి జనములు | గలఁగి యపుడు మేలుకాంచి చూచి
భయము దోఁపఁ గడిఁది బలుగాముగాఁ దమ | యుల్లములఁ దలంచి యొదిఁగియుండ.
157
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )