| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
కాలను గేలనుం జదిపి గంధకరిం దెగటార్చు సింహముం బోలుచుఁ బేర్చి యాద్రుపద భూపసుతున్ సమయించె వేదనన్ ఱోలఁగ రోఁజఁగాఁ బలుమఱుం బొరలంబడి లాలగ్రక్కన వ్వాలుమగండు ప్రాక్పరిభవంబుఁ దలంచుచుఁ గ్రౌర్యధుర్యుఁడై. |
158 |
| క. |
ధృష్టద్యుమ్నుని నిట్లతి | కష్టవిధిప్రాప్తమరణుఁ గావించి మహా వష్టంభోజ్జ్వలుఁడును సం | హృష్టాత్ముఁడు నగుచు వింట నిడియె గుణంబున్. |
159 |
| వ. | ఇట్లు సజ్యం బయిన చాపంబు ముష్టి నమర్చి యాచార్యనందనుండు. | 160 |
| ఆ. |
చప్పరంబు వెడలి చనుదెంచి యల్లని | నగవు నెఱయ సూతు మొగమునందుఁ జూడ్కి వొలయ రత్నసుందరం బగు నిజ | స్యందనంబు పైకిఁ జనియె నధిప! |
161 |
| మ. |
అదరం బిమ్మెయి నెక్కి, యుబ్బి, శిబిరం బాప్రొద్ద నిశ్శేషతం బొరయం జేయుకుతూహలంబు మది నుప్పొంగన్, లసన్నేమి ని ష్ఠుర నాదంబు ప్రమోదముం బెనుప రక్షోభూతచిత్తంబులం బరవీరావలి యిండ్ల కందవ లెడం బాటించుచుం బోయినన్. |
162 |
| తే. |
పీనుఁగై యున్న పాంచాలసూనుఁ జూచి | రక్షకులును, దదీయ పురంధ్రులును స మగ్ర శోకాంధకార నిమగ్నచిత్త | వృత్తులై యేడ్చి రెలుఁగులు మిన్నుముట్ట. |
163 |
| క. |
ఆ కలకలమున మేల్కని | యా కెలఁకుల యిండ్ల రాజు లది యే మనుచున్ వే కదియం గని యా జను | లాకులరవ మెసఁగ నిట్టు లనిరి నరేంద్రా! |
164 |
| క. |
‘రక్కసుఁడో, మానిసియో | నిక్క మెఱుంగము; వధించె నృపసూనుని వీఁ డొక్కరుఁ డుదగ్రుఁడై, రథ | మెక్కి యరిగెడున్; దురాత్ము నెయిదుఁడు కడఁకన్.’ |
165 |
| వ. | అనిన విని యన్నరపతులు తల లెత్తి చూచి ‘పోనీక పొదువుం’ డనుచు సపరివారంబుగా నడరి యశ్వత్థామం బొదివిన నుద్దామప్రకారంబునం దిరిగి మూఁపులు పెరుఁగ గొనయంబు సారించి. | 166 |
| మ. |
ఖరనారాచపరంపరా విహరణ క్రౌర్యంబునన్ శాత ని ష్ఠుర భల్ల ప్రవిసారదారుణతర క్షోణీశులం, దద్బలో త్కరముం గేలియవోలె గీటడఁచె దోర్గర్వం బఖర్వంబుగా వెరవుం జేవయు భూతముల్ వొగడ నవ్వీరుండు ధీరోద్ధతిన్. |
167 |
| వ. | తదనంతరంబ యుత్తమౌజునిలోఁగిలి చొచ్చికృపాణపాణియై యరదంబు డిగ్గి యరసికొని యతని యభ్యంతర మందిరంబుఁ బ్రవేశించి. | 168 |
| సీ. |
అలికిడి మేల్కనునతని ధృష్టద్యుమ్నుఁ | బట్టిన క్రియఁ దలపట్టి యీడ్చి యాతనిఁ జంపిన యట్టులు పశుమర | ణాతి కౌతుకమున నవనిఁ బెట్టి చంప, నచ్చేరువఁ జప్పరంబున శయ | నించు యుధామన్యుఁ డెఱిఁగి కడఁగి చనుదెంచి రాక్షసుఁడని తలంచియుఁ గొంకు | పెట్టక పెనుగద బెట్టు వ్రేయ |
|
| ఆ. |
వ్రేటువడి చలింప కాటోపదీపితుఁ | డగుచు గురుతనూజుఁ డక్కుమారు నగ్రజన్ముంబోలె నుగ్రత వధియించెఁ | గాని ఖడ్గలీల గలుగదయ్యె. |
169 |
| వ. | ఇట్లు ద్రుపదపుత్త్రుల నొక్కుమ్మడి నిరువుర గీటడంచి యబ్బలుమగండు. | 170 |
| శా. |
కాలాకారతఁ బేర్చి దోర్లసిత ఖడ్గస్ఫారసాంద్రప్రభా జాలం బొప్పఁగ నిట్లు సొచ్చి లఘుసంచారంబు శోభిల్లఁ బాం చాల వ్రాతముఁ గ్రీడమైఁ దునిమె రక్షశ్శ్రేణి మాంసంబుఁ గీ లాలంబుం గబళించి త్రావి మదలీలాలోలతం గ్రాలఁగన్. |
171 |
| వ. | అట్టియెడ. | 172 |
| శా. |
నిద్రాసక్తునిఁ, గొంత మేల్కనిన వానిన్, సుప్రబుద్ధాత్ముఁడై యుద్రేకంబును శౌర్యసారమును బాహూల్లాసముం జూపఁ జం చద్రేఖం దిరమైనవానిఁ దను నుత్సాహోగ్రతం దాఁకి యు న్నిద్రస్వైర సముద్ధతిన్ మెఱయువానిం దున్మె నేకాకృతిన్. |
173 |
| వ. | మఱియు నతండు. | 174 |