| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
రక్త సంసిక్తమైన ధరాతలమున | నార్తిఁ బొరలుచు నూర్పు లందంద సంద డింప జీవంబు వెడల నుంకింపఁ జేష్ట | లొయ్యనొయ్యన యడఁగంగ నున్న యధిపు. |
213 |
| మహాస్రగ్ధర |
కని శోకం బాత్మలం దగ్గలముగ రథముల్ గ్రక్కునన్ డిగ్గి, భూమిన్ ధనువుల్ వోవైచి, భాష్పోద్గమము వొదువు వక్త్రంబులన్ విప్రలాపం బును దైన్యం బావహిల్లం బొరలుచుఁ బొరి నా భూవిభున్ శాంతదృష్టిం గనుఁగొంచుం జేరి, కే లంగముపయి నిడుచుం గౌఁగిటం జేర్చుకొంచున్. |
214 |
| చ. |
పురపురఁ బొక్కి యా నృపతిపుంగవు చుట్టును నుండి ‘యక్కటా! ధరణి సమస్తమున్ భవదుదారమహాజ్ఞకు లోను సేసి యి ప్పరుసున నీవు దీనతకు భాజనమైతి; విధాత కెందు దు ష్కర మగు కార్యముం గలదె? కౌరవనాయక! మ మ్మెఱుంగుదే?’ |
215 |
| క. |
అన నప్పలుకులు వెడ వెడ | విని యా విభుఁ డల్లఁ గన్ను విచ్చిన వదనం బునఁ జూడ్కి నిలిపి కలశజ | తనయుం డి ట్లనియె గద్గదగళుం డగుచున్. |
216 |
| చ. |
‘అమితబలంబు దర్పమును నద్భుత ధీరతయున్ గదాపరి శ్రమముఁ బొగడ్త కెక్కు నినుఁ జక్క నెదుర్చుట గాక పోర రం ధ్రముగని యొక్కఁ డుద్ధతి గదం దెగటార్చుట గల్లెనట్టె యిం క మగల కెట్టివారలకుఁ గల్గ దపాయము దైవ మల్గినన్? |
217 |
| చ. |
దురమునఁ బెంపుఁ జేవయును దుర్దమలీల వెలుంగుచుండ సు స్థిరత శమంతపంచక విశిష్ట తలంబునఁ బోరి సద్గతిన్ బొరసెదు; నీకునై వగపు పుట్టదు; బంధులు, రాజు, దేవులుం దిరియుదు రింక; వారి దగు దీనత కోర్వక యుమ్మలించెదన్. |
218 |
| ఉ. |
సీరి యనారతంబుఁ దన శిష్యులలోపల నెల్ల నిన్ను దు ర్వార పరాక్రమాఢ్యుఁడని వర్ణన సేయుట గేలిచేసి యా మారుతికిన్ జయం బొసఁగె మాల విధాతృఁడు; వాని గెల్పుకో లేరికి సమ్మతంబగునె యిట్టిది? దీనను బెంపు గల్లునే? |
219 |
| చ. |
కురువర! నీ మగంటిమియుఁ గోల్తలయున్ బలముం జలంబు దు స్తరగతిఁ బేర్చి భీమునకుఁ జావక పోవఁగరాని యట్టిదై నరు బెదరించి కేశవు మనంబు గలంచి యధర్మవృత్తికిం జొరుఁడని పంచె; దీని దివిజుల్ గని; రిం కిటవేయు నేటికిన్? |
220 |
| ఉ. |
ధర్మము మాని యూరులు గదం బొడి సేసినయంతఁ బోక దు ష్కర్ముఁడు వాయుజుం డెడమకాల శిరంబటు దన్నెఁ జూచి యా ధర్మసుతుండు శాస్తిఁ దగ దానికిఁ జేయఁడ; యాతఁడెప్డు నం తర్మదదుష్టుఁ; డీ గెలుపు దైన్యము సేయదె? కీర్తి మాయదే? |
221 |
| క. |
కౌరవనాయక! నీదు గ | దారణ గౌరవము సకల ధరణీజన చే తోరంజనమై నిర్మల | సారయశోధనము నీకు సంపాదించెన్.’ |
222 |
| వ. | అని పలికి తన మానుషంబు తెఱం గూహించి. | 223 |
| చ. |
‘కుడువఁగఁ గట్ట, బంధులకుఁ గోటి విధంబులఁ బెట్ట, జన్నము ల్నడుప, ననేక ధర్మవిధులం బొగ డొందఁగఁ జాలునట్టి యె క్కుడు సిరి యిచ్చి పేర్మి నొక కొండగ మన్చిన నీవు సావఁగా నొడ లిటు లోమితిం; గురుకులోత్తమ ! యేనొక సేవకుండనే?’ |
224 |
| వ. | అని తన్నుఁ దాన నిందించుకొనుచు మఱియు. | 225 |
| ఉ. |
‘న్యాయము దప్పకుండఁగ రణం బొనరించి దివంబు గైకొనం బోయెద; వందు రాఁదగిన పుణ్యము సేయుటలేదు గాని, మా చేయు మనంబునుం దనియఁ జెండఁగఁ బడ్డ విరోధివర్గమున్ నీయెడ కిం పొనర్పఁగ గణింపఁగ భాగ్యము గల్గె భూవరా! |
226 |
| ఆ. |
పుణ్యలోకమునకుఁ బోయినయప్పుడు | ద్రోణుఁ గాంచి నీకు ద్రోహియైన జనవినింద్య చరితుఁ జంపె దృష్టద్యుమ్ను | నీ తనూజఁ డనుము తొలుత. |
227 |
| వ. | అని నా మాఱుగా నమస్కరించి కౌఁగిలించుకొనుము. మఱియు వలయు సల్లాపంబులు సేయుము. బాహ్లిక సోమదత్తభూరిశ్రవస్పైంధవప్రముఖ భవదీయ బాంధవజనంబులతో నా చేసిన కుశలప్రశ్నంబుగా సంభావింపు మది యట్లుండె రేయింటి తెఱం గెఱింగించెద. | 228 |
| సీ. |
అమృతంబు నింపు కర్ణములకు నొసఁగెడు | మాట లాకర్ణింపు మనుజనాథ! శాత్రవ శిబిరంబు సౌప్తికవేళఁ బ్ర | వేశించి నీచుఁ గిల్బిషమయాత్ముఁ దొలుత ధృష్టద్యుమ్నుఁ ద్రుంచితిఁ బశుమర | ణంబుగాఁ దదనంతరంబ కవిసి వాని బంధులనెల్ల వరుస గీటడఁగించి | ద్రౌపదీసుతుల నందఱను బొదివి |
|
| తే. |
మిడుక మిడుకంగఁ జంపి యప్పుడమి యెల్లఁ | దునియ పెంటగఁ గరివాజిమనుజతతుల నెల్ల నఱికితిఁ బాండవు లేవురును ము | రారియును సాత్యకియును నా బారిఁ బడరు’. |
229 |
| వ. | అని చెప్పి | 230 |
| ఉ. |
‘ఏ మటు పోక శౌరి మది నేర్పడ మున్ గని డాఁగురించెనో యేమిటి కెందుఁ బోయిరొ నరేంద్ర! యెఱుంగము ధర్మదూష్య సం గ్రామ విధంబులం జయము గల్గియు వారికి దక్కదయ్యె వా రేమయి రేమి మా కెలస మెక్కె నెఱుంగుము మమ్ము మువ్వురన్. |
231 |
| వ. | అని కలిపికొని పలికి కృపకృతవర్మల వలనుం జూచి. | 232 |
| క. |
‘వీరి పెనుఁబ్రాపు వడసినఁ | గౌరవకులనాథ! యేన కా దరయంగాఁ జీరికిఁ బోవని వారును | వైరుల సమయంగఁ జేయ వలఁతుల కారే?’ |
233 |
| వ. | అనిన నమ్మాటలు మనఃప్రియంబులై నాలుకకు లావిచ్చిన నా భూవరుం డమ్మహీసురవరున కిట్లనియె. | 234 |
| క. |
‘నీవును నీ యోధవరులు | నావైరులఁ బఱిచినంత యాచార్యుండున్, దేవవ్రతుండుఁ బఱిచిరె? | భావింపఁగ దుష్కరంపుఁ బని యిది యనఘా! |
235 |
| ఆ. |
కర్ణు మనము పెద్దగాఁ గొనియాడుదు; | మతనికంటె శల్యుఁ డధికుఁడందు; రతఁడు నతఁడు నిట్టి యాక్రమంబున నాకుఁ | బ్రియము సేయఁ జూచిరే మహాత్మ!’ |
236 |
| వ. | అని యమ్మువ్వుర మొగంబులు గలయం గనుంగొని ‘మీరు కృతకృత్యులరు. సుఖులరై యుండుఁడు, పునర్దర్శనంబు త్రిదివంబున నయ్యెడుఁగాక. వగలు మాని పొం’ డని పల్కి ప్రాణంబులు విడిచిన, వారలవ్వసుమతీ పతిఁ గౌఁగిలించుకొని వలగొని వచ్చి మరలి మరలి చూచుచు నరదంబు లెక్కియరిగి; రంత నుదయగిరి శిఖరంబునకు ఖరకరుండు వచ్చె, నేను నిత్తెఱంగు నీకెఱింగింపవచ్చితి; నాహవప్రకారం బంతయు నీకు వినిపించుటకు నాఁడు మునీశ్వరుండు నన్నుఁబనిచి యొసంగిన దివ్యదర్శనత్వంబు నీ కొడుకు తోడిదయయ్యె’ నని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రునకు నశ్వత్థామాది రథికత్రయ వ్యాపార కథనపూర్వకంబుగా దుర్యోధను లోకాంతరగమనంబు సెప్పె; ననిన విని ‘యటమీఁదఁ బాండునందను లెవ్విధంబునం బ్రవర్తించి?’ రని యడుగుటయు. | 237 |