| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘ఎట్టివారలకైన నెఱుఁగంగ నగునె కా | ర్యంబులగతు లుపాయంబు బలుపు వెలయంగ నట్లు శత్రుల బంధుమిత్ర పు | త్రామాత్య యుతముగ నాహవమున నందఱ నేఁ దెగటార్చినవాఁడనై | విజయంబు సేకొని విభవమెసఁగ నిట యేఁగుదెంచితి నట బంధుమిత్ర పు | త్రామాత్యయుతముగ నస్మదీయ |
|
| తే. |
బలము నెల్లను ముట్టి శత్రులు నితాంత | ఘోరముగఁ దెగటార్చిరి కుత్సితంపు విధము వాటిల్లె నస్థిరవిజయమునఁ బ | రాజయమని యాడు నిఁక ధరాజనంబు. |
13 |
| స్రగ్ధర |
బాణజ్వాలా నితాంత ప్రసరణముల శుంభద్ద్విషత్సాంద్ర సైన్య శ్రేణీ కాంతారముల్ చూర్ణితములుగఁ బటుక్రీడమైఁ దేజరిల్లెన్ ద్రోణాచార్యాగ్ని; వేఁడిం దొడరక మెఱసెన్ దోర్విలాసంబు; వైరుల్ ప్రాణంబుల్ నాఁచికోల్ దప్పదు; తుది విధి యబ్బాలురం ద్రెళ్ళవైచెన్. |
14 |
| మహాస్రగ్ధర |
శరదంష్ట్రా భీషణంబై చటుల రిపుమృగస్వైర విధ్వంసలీలా స్ఫురణన్ శోభిల్లు రాధాసుతుఁ డను పులి విస్ఫూర్జితంబున్ సహింపన్ వెరవున్ దర్పంబు గల్గెన్; వికల రిపులచే వీటిఁబోయెం గుమారో త్కర; మిం కేమందు? నాపత్పరికలన ప్రమాదంబునం గాక యున్నే? |
15 |
| స్రగ్ధర |
శాతాస్త్ర స్ఫారవీచీ సముదయ రభసాశ్చర్యసంపాది హేలా స్ఫీతంబై క్రమ్ముదేరన్ బెదరక కలఁచెన్ భీష్మవారాశిఁ దుచ్ఛా రాతి వ్యాపారదుర్వారతఁ దెగియెఁ గుమారవ్రజం బక్కటా! ని ద్రా తంద్రావ్యాప్తి నక్రూరతఁ బొరసి భుజాప్రౌఢి వమ్మయ్యెఁ జుమ్మీ. |
16 |
| ఆ. |
అధికబలము గెల్చి యవనీపతులు గొంద | ఱతివిహీనరిపుల యాక్రమమున మడిసి రకట! జలధి వెడలి సన్నపుఁ గ్రయ్య | మునిఁగి రూపడంగు జనుల మాడ్కి. |
17 |
| చ. |
జనకుఁడు లేమికిం గడు విషాదము నొందెడి కృష్ణ యిమ్మెయిం దనయులు భ్రాతలుం దెగుట దా విని మూర్ఛ మునుంగు నెమ్మనం బును నవశంపుమేను నయి భూస్థలిఁ ద్రెళ్ళక యున్నె? త్రెళ్ళదే నిని బటుశోకవేగమున నిర్భరవేదనఁ జెందకుండునే? |
18 |
| క. |
మున్నిట్టి తెఱఁగు శోకం | బెన్నఁడుఁ దా ననుభవించి యెఱుఁగ దకట! నేఁ డన్నెలఁత యలఁత పెల్లున | నెన్ని యవస్థలకు వచ్చి యెట్లయ్యెడినో!’ |
19 |
| వ. | అని వగలం బొగిలి పాంచాలి రావింపం దలంచి తన పనుపున నవ్వెలంది ద్రుపద విరాటులు చచ్చిన మఱునాఁడు తదీయ పత్నులకు శోకాపనోదంబు సేయుటకై సుభద్రయు నుత్తరయును దోనరుగ విడిదలనుండి విరాటుపురంబున కరిగి ద్రుపదుండును గొడుకులు నవ్వీటికి వచ్చునాఁడు దోడన వచ్చి కోడండ్రును దానును నందయున్న యా ద్రుపదు పత్నిని, విరాటపత్నిం గాంచి పదంపడి సుభద్ర యర్జును ననుమతి వడసి ద్వారవతికిం బోవ నమ్మత్స్యపురంబున నునికిం జేసి యన్నరనాథుండు నకులుం గనుంగొని యతిత్వరితగమనంబునకుం దగు రథంబునం జటులంబులైన రథ్యంబులం బూన్చికొని యుపప్లావ్యంబున కుం జని ద్రుపదనందనను, దక్కును మనదెసలంగలుగు నంగనలను ద్రుపదమత్స్యపతి పక్షంబు భామలను దోడ్కొని యవ్విడిదలకుం జనుదెమ్మని చెప్పి యేము నయ్యెడకుం జనుదెంచెద మనుటయు నతండు తదుక్త ప్రకారంబునఁ జనియె. నజ్జనవల్లభుండు తక్కటి తమ్ములును, దామోదర సాత్యకులును నడలుచుఁ దన్నుం బొదివికొని చనఁ గౌరవ శిబిరంబునం గల జనంబులు గొల్చి వోవ నేడ్చుచు నిజశిబిరంబునకుం బోయి తత్ప్రదేశంబున. | 20 |
| మహాస్రగ్ధర |
స్ఫురదశ్వత్థామ చంచద్భుజలసదసి విస్ఫూర్జిత క్రూరధారా పరికృత్తావ్యక్తగాత్రప్రకరుల, సఖులన్, బంధులం, బుత్రులం, దాఁ గరుణం బుప్పొంగ నార్తిం గనుఁగొని, వికలాంగత్వముం బొంది మూర్ఛా పరతంత్రుండై ధరిత్రిం బడినఁ, బడిరి తద్భ్రాతలుం, గేశవుండున్. |
21 |
| వ. | ఇట్లు పడి సాత్యకి ప్రయత్నంబున నందఱుం దెలిసిరి. ధర్మనందనుండు వెడవెడ దెలిసియు మగుడ నిగుడు నడలున మనంబు మునుంగ వెగడొంది నందనుల తనువుల మీఁద వ్రాలుచు వదనంబు బాష్పాంబు ధారాక్రాంతంబుగాఁ బ్రకటాక్రందనంబు సేయుచుఁ బలవించుచుండెఁ; గృష్ణార్జునులు సముచిత భాషణంబుల బోధించిరి. తక్కటివారును దగుమాటల నుపచరించిరి. కొండొకసేపునకు నవ్విభుండు రోదనంబు దక్కి. | 22 |
| తే. |
పుత్రులకు బాంధవులకును మిత్రతతికి | నగ్నికార్యంబు వొగులుచు నాచరించి యొక్కచోట నాసీనుఁడై యుండె ద్రుపద | తనయ వచ్చుట వార్చి నెమ్మనము దలర. |
23 |
| వ. | అద్దేవియు నకులునిచేత నుపప్లావ్యంబున సుత సోదర మరణ ప్రకారంబు వినుటం జేసి. | 24 |
| క. |
అలఁత గదిరి నోరెండఁగఁ | బలవించుచుఁ దోడుతోడ బాష్పజలం బ గ్గలమై క్రమ్మఁగ సొలయుచుఁ | దెలియుచు నాతనికి నడలు దీపింపంగన్. |
25 |
| వ. | అరుగుదెంచి యంతంత నవనీకాంతుఁగాంచి యధిక శోకాక్రాంతయై యార్తిం గూరి యాక్రందనంబు సేయ నమ్మాద్రీపుత్రుం డొయ్యన యయ్యంగన నరదంబు డించె; నుచిత వాహనంబుల నెక్కి తోడన వచ్చిన వనితాజనంబు లవతరణంబు సేసి వనట వందురుచుఁ బరివేష్టించి; రప్పు డా వధూరత్నంబు. | 26 |
| క. |
పెనుమంచునఁ జెలువేదిన | వనజంబును బోలె నశ్రువారిపరీతా ననము చెలువెడలఁ గొడుకలఁ | బనవుచుఁ జరణములు తొట్రువడ దీనగతిన్. |
27 |
| వ. | కొన్ని యడుగులు వచ్చి వసుధాతలంబున వ్రాలిన వేగంబ వాయునందనుం డా ద్రుపదనందనఁ గ్రుచ్చియెత్తి ధర్మసూను సమీపంబునకుఁ దెచ్చిన నమ్మగువ మగుడ నిలంబడి యమ్మహీపతి యాననం బాలోకించి యెలుంగు రాలుపడ దైవమానుషంబులు సుసంగతంబులై యుండుటయు నతనికి సామ్రాజ్యంబు చొప్పడుటయు నుగ్గడించి. | 28 |
| చ. |
కలిమికి నొప్పుగాఁగ బలగంబయి నీకడ నా తనూభవుల్ మెలఁగఁగఁ జూడఁ గానన; యమేయ భుజాబలశాలి విక్రమో జ్జ్వలుఁడు సుభద్రపట్టియును వమ్మయిపోయె; ననూనభోగముల్ గలిగెన్ యేనియున్ మఱవఁగా వశమే మన కా కుమారులన్? |
29 |
| వ. | అని యప్పు డశ్వత్థామోద్దామ రణకరణస్మరణంబు దన చిత్తం బుత్తల పెట్టఁ గోపంబు దీపింప నాసీనయై. | 30 |
| క. |
‘భూరమణ! గాఢనిద్రం | గూరిన సమయమున ముట్టికొని నా సుతులం గ్రూరతఁ దెగటార్చెను బా | పారంభుఁడు గురుతనూజుఁ డక్రమలీలన్. |
31 |
| క. |
అది యాఱని పెను చిచ్చై | మదిఁ గాల్పఁ దొడంగె దీని మాన్ప నుపాయం బు దలంప నొండు లే ద | య్యదయుని ముట్టుకొని నామ మడఁచుట దక్కన్. |
32 |
| క. |
వాయుసుతుఁ బనిచి నేఁడటు | సేయింపక తక్కితేనిఁ జెప్పెద విను మేఁ బ్రాయోపవేశమున నీ | కాయ ముపేక్షింతుఁ జుమ్ము కౌరవనాథా!’ |
33 |
| వ. | అనుటయు నమ్మనుజపతి యమ్మానిని కిట్లనియె. | 34 |
| క. |
‘క్షితిపతి తనయులు పోర | న్మృతిఁ బొందుట తగునకాదె నీ సోదరులున్ సుతులు నతిపుణ్యపురుషో | చిత సుగతులు గనిరి వగలఁ జేడ్పడ నేలా? |
35 |
| వ. | మనస్వినివైన నీ కుపశమించుట గర్తవ్యంబు. శోకంబు దక్కు మశ్వత్థామ యొనర్చిన పరాభవంబునఁ బుట్టిన యలుక వాని సమయింపక పోదని చెప్పుటయ కాదు, నా తలంపును నిట్ల; వాఁ డడవిం గలసినవాఁడు గానోపు; సమయించుట నీ కె ట్లెఱుంగ నగుఁ? జెప్పు’ మనిన నప్పొలఁతి ‘యప్పాపాత్మునకు సహజంబైన శిరోమణి గలదు, దానిం దెచ్చి యిచ్చినఁ జూచి జీవంబుతో నుండెద నని తలంచితి’ నని పురుషాక్షరంబుగాఁ బలికి యప్పవమానతనయుఁ దన పాణితలంబున సంస్పర్శించి. | 36 |
| ఆ. |
‘క్షత్రధర్మ మాత్మఁ గైకొని రయమున | నరిగి పాపకర్ముఁడైన కుంభ జన్మతనయు ముట్టి చంపుము నా మది | కనలు నడలు నుడిపి కావు నన్ను.’ |
37 |
| వ. | వెండియు. | 38 |