| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘జతుగృహదాహావసరమునఁ జేసిన | సముదీర్ణతరపౌరుషంబుతోడ నత్యుగ్రుఁడగు హిడింబాసుర వ్రచ్చిన | చోటఁ గైకొన్న నిష్ఠురతతోడ యక్షులు పొదివిన యపుడు వాటించిన | యాభీల దోర్బలవ్యాప్తితోడ సమధికబలుఁడు గీచకుని యేఁచినయెడఁ | బూనిన విక్రమస్ఫూర్తితోడఁ |
|
| ఆ. |
గూడ నిన్ను జనులు గొనియాడునట్టుగఁ | జనుము నీదు బలముఁ జలము మెఱయ గీటడంపు మనల గెలిచితి నని గర్వ | మునఁ దనర్చు ద్రోణతనయు నెట్లు.’ |
39 |
| వ. | అనిన విని యగ్గురుపుత్రుదెసం బొడమిన యమర్షంబున మేను వొంగఁ బవమానసూనుండు ద్రుపదనందనతో ధర్మనందనుం డాడిన మాట లశ్వత్థామపైఁ బోవుట కనుమతిగా నంతరంగంబున నంగీకరించి. | 40 |
| మహాస్రగ్ధర |
కనక ప్రస్ఫీత రత్నోత్కర పరివిసరత్కాంతి రాజన్నిజస్యం దనముం బన్నంగ నత్యాదరమున నకులుం దా నియోగించె; నాతం డును దీప్తోత్సాహుఁడై గండున సబలరయాటోపరథ్యాది సత్సా ధనయోగం బొప్ప సారథ్యమునకు నమరెం దన్మనోవృత్తియుక్తిన్. |
41 |
| వ. | ఇట్లు సహదేవ పూర్వజుం దనకు సారథిం జేసికొని సమీరనందనుండు కోదండ గదాదండాది హేతి సంపన్నం బైన యా రథం బెక్కి శిబిరంబు వేగంబ వెడలి గురుతనయాది యోధుల యరదంబుల చొప్పు వట్టికొని యతిత్వరితగతిం జని కురుక్షేత్ర సంచారి జనంబులం గని ‘యశ్వత్థామ యెక్కడ మెలంగెనో యెఱుఁగుదురే?’ యని యడిగిన వార లతండు కృపకృతవర్మలతోడం గరినగరంబు దెసకు నరిగి మగిడి భాగీరథీ తీరంబున కరుగుదెంచి యయ్యెడ నయ్యిరువురుం బాసి యొక్క వలని కరుగం దానును గృష్ణద్వైపాయన మహాముని యాశ్రమంబునకై తొలఁగి తత్ప్రదేశంబున వసియించెనని చెప్పుటయు నద్దిక్కు తేరు నడప నియోగించి నట్టియెడ ధర్మనందనునకు వసుదేవనందనుం డిట్లనియె. | 42 |
| చ. |
అనిలసుతుండు శోకమును నల్కయుఁ జిత్తమునం గరంబు పే ర్చిన గురుపుత్రు ముట్టికొనఁ జెచ్చెరఁ బోయెడు; నీతఁ డొంటి యా తనిపయిఁ బోవ భూరమణ! తప్పదె కార్యము? పెద్దగూర్తు వీ వనుజులలోన నాతనికి; నందఱుఁ బోవుట మేలు పోరికిన్. |
43 |
| వ. | వినుము. ‘సకల పృథివియు దహింపఁ జాలునట్టి బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్త్రం బశ్వత్థామకు ద్రోణుం డిచ్చెఁ బ్రియాతిశయంబున వివ్వచ్చునకు నొసంగె. నశ్వత్థామ వివ్వచ్చుతోడి మత్సరంబునఁ దదీయబల నైపుణ్యంబునకు నసహ్యంబువడుఁ బదంపడి యెఱింగి పాండవులపై వీఁడు దీనిం బ్రయోగింప కుండవలయు నని తలంచి యమ్మహనీయ సాధనంబు మనుష్యులపైఁబ్రయోగించుకొలఁది గాకునికియుం గలదు గావున సర్వధర్మవిదుండైన యగ్గురుం డొక్కనాఁ డస్త్రవిషయ సంభాషణ సమయంబున నతనితో ని ట్లనియె.’ | 44 |
| క. |
‘మనుజులపై బ్రహ్మశిరం | బనునస్త్రం బేసితేని నశుభం బొలయున్ విను మెన్ని యాపదలు వ | చ్చిన నపరోపాయములన చెఱుపుము పుత్రా!’ |
45 |
| వ. | అని చెప్పి మనోగతం బవశంబై నాలుకకు వచ్చి, ‘వీఁ డెట్లును సజ్జనుల వృత్తంబునఁ బ్రవర్తిల్లెడునే?;’ యని యతండు విన నుగ్గడించె. దానికి నశ్వత్థామ విషాదంబునఁ గుందియుండుఁ గాని యగ్గురుని చెప్పినట్లు సదుపదేశ కరణ నిష్ఠుండుగాఁ; డతనికి దురభిమానంబును గలదు. వినుము చెప్పెదఁ జిరజీవిత్వంబును భర్గవరప్రసాద జనక కారణంబును గలిగి యుండు ననియును దివ్యాస్త్ర శస్త్ర విద్యారహస్యంబునకు మూలం బైన యగస్త్యుచేత ద్రోణుండు వడసిన బ్రహ్మ శిరోనామకంబు దనకుం గలదనియును దత్ప్రభావంబు దేవమనుజ దనుజలోకంబులు భస్మీభూతంబులు సేయు నని యుండుం గావున మున్ను మీరు వనవాసులరై యున్నతఱిఁ దాను మా పురంబునకు వచ్చి యాదవ కుమారులతోడి వినోదంబులం దగిలియుండి యొక్కనాఁడే నొంటిమై నుండ నా కడకుం జనుదెంచి నగుచు నిట్లనియె. | 46 |
| తే. |
‘విను మగస్త్యుఁడు మా తండ్రి వినుత తపము | పేర్మి కెంతయు నాత్మలోఁ బ్రీతిఁ బొంగి బ్రహ్మ శిరమను దివ్యాస్త్రరత్న మొసఁగె; | నగ్గురుండు నాకిచ్చె నత్యాదరమున. |
47 |
| వ. | ఆ దివ్యాస్త్రంబు నీ కిచ్చెద. నీవు నాకుఁ జక్రం బొసంగవలయు’నని పలికిన నే నద్దురభిమాని నాయెడం బరమ స్పర్ధ గలిగి యట్లడుగుట యెఱింగియు నొండనక యతనికి మదీయ చక్ర ధనుర్గదాఖడ్గంబులు సూపి ‘వీనిలోన నీకు ధరింపఁ బ్రయోగింప శక్యంబైన దాని ధరింపు’మని చెప్పి ‘నీవు నీ యస్త్రంబు నాకు నీ వలవదు. మిత్రుని కోరినయది యిచ్చుచుండి దానికి మాఱుగా నొకటి పుచ్చుకొనుట పురుషార్థంబు తెరువే?’ యనుటయు నతండు సుదర్శనంబు వరియించినఁ; ‘బుచ్చుకొ’ మ్మంటి. నమ్మాటకు ముదితుండగుచు నమ్మూఢుండు దనవామకరంబునఁ జక్రం బవలంబించి యెత్తం జాలక దక్షిణపాణిం బట్టి యెట్లుఁ గదలఁ దివియశక్తుండు గాక యుభయ హస్తంబులును లావుసేసి తివిసినను నది కదలకుండె నాతండు డస్సి నిలిచి విషణ్ణుండై యున్న నతని నాలోకించి యిట్లంటి. | 48 |
| తే. |
‘అధికనిష్ఠమై బ్రహ్మచర్య వ్రతంబు | తోడ రుక్మిణీయుతముగాఁ దుహినశైల తటమునందుఁ బండ్రెండు వత్సరము లుగ్ర | తప మొనర్చి యిమ్మహిత సాధనము వడసి. |
49 |
| వ. | దివిజ దానవ గంధర్వాది సమస్తభూతంబులు నాతోడి యెత్తు రాకుండెడు నట్టి దోర్వీర్యంబున వెలసి వర్తిల్లుదు; నట్టిది దీని మహత్త్వంబు; న న్నీ చక్రం బింతక మున్ను బలభద్ర ప్రద్యుమ్న సాంబాది యాదవశ్రేష్ఠు లెవ్వరు నడుగరు; గాండీవి శ్వేతాశ్వ కపిధ్వజంబులుఁ దపోబలంబునఁ బడసి యెక్కటికయ్యంబున రుద్రు మెప్పించి పాశుపతంబు గొనియెఁ; బ్రాణంబులకంటె నే నతనికిం గూర్తు; నద్దేవసమునకు నొసంగఁ దగనిది యెద్దియులే; దట్టి యర్జునుండును దీని నడిగెనే? భరతవంశాచార్యపుత్రుండవు, సకలజన మాన్యుండవు, నీ విట్లెఱుఁగక యడుగుదె? దీని నెవ్వరితోడ రణంబు సేయఁ దలంచి యడిగి?’ తనిన నగ్గురునందనుం డిట్లనియె. | 50 |
| చ. |
‘సకలజగత్ప్రసిద్ధ మగు చక్రము నీ వొసఁగంగ నిప్డు వు చ్చి కొని భవత్పదాంబురుహసేన పదంపడి చేసియైనఁ బో రికి నిను నియ్యకొల్పి మదిఁ బ్రీతి యెలర్పఁ బెనంగి నీకు నో డక విలసిల్లి యెల్లఁ బొగడం పెనుపొందఁగఁ గోరి వేఁడితిన్. |
51 |
| వ. | ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండుఁ గాక, నా కిది లేకున్న నేమియగు? నెట్లును నీతోడ సంగరంబు సేయంగలవాఁడ’ ననియె. నేను నవ్వుచు నట్లకాక యని ద్రోణాచార్య పుత్రత్వ బహుమానంబున మాననీయ రథ్యంబులు, నభిరామరత్నాంబరాభరణంబులు నిచ్చి పుచ్చినం జనియె; నట్టి మహాహంకారంబునకుఁ గారణంబైన బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్త్రంబున నవ్యాహత సంరంభుండును, నసద్వ్యాపారారం భుండును, గ్రూర దర్శనుండును నగు నశ్వత్థామచేత భీముండు బాధితుండు గాకుండవలయు’నని పలికి పద్మనాభుండు సాత్యకి సహదేవులం జూచి మీరు శిబిరంబున నిలువుం’డని నియోగించి. | 52 |