| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
ప్రద్యోతితానేక రత్న శోభితమును | సంభృతాయుధవరిష్ఠంబు నైన మాన్య రథమ్మున శైబ్యసుగ్రీవంబు | లను మేఘపుష్పవలాహకములఁ బూన్పించి యాభీల భుజగారికేతనం | బెత్తించి వే నొగ లెక్కుటయును, గాండీవధరణోద్భటుండును దూణీర | యుగళసన్నాహసముజ్జ్వలుండు |
|
| ఆ. |
నై ధనంజయుఁడు రథారోహణము సేసె | నగ్రజుండు నెక్కెననికి నమరి యొప్పి రమ్మురారియును వారు నప్పుడు | బలహరుండు నశ్వినులును బోలె. |
53 |
| వ. | ఇట్లు సన్నద్ధంబైన యా రథంబు భాసురప్రతోదంబు పుచ్చుకొని యద్దామోదరుండు వఱప నయ్యుత్తమ రథ్యంబుల రయాతిశయంబున సమీరనందన స్యందనంబు గొండొక సేపునకుం గూడె; నప్పుడు భాగీరథీతీరం బునఁ గ్రోధాయత్త చిత్తుండగుచు నశ్వత్థామ యున్నయెడ రోయుచుఁ బోవు నప్పావని నమ్మువ్వురు వారించి; రట్టు వారించిన నిలువక వారి ముందటం జని యతండు సూడ్కి యట నిగిడించి. | 54 |
| చ. |
సలిల సమీపదేశమున సంయమిసంఘము గొల్వఁగా సము జ్జ్వల మహనీయమూర్తి యగు సాత్యవతేయుఁడు తారకాగణం బుల నడుమం బ్రదీప్తుఁడగు పూర్ణసుధాంశుని యట్టు లుండ న వ్వలనికిఁ బోక భక్తి నభివాదనముల్ మదిలోనఁ జేయుచున్. |
55 |
| వ. | కెలంకులు గలయం బరికించి యొక్కెడ. | 56 |
| ఆ. |
మేన భసిత మలఁది మాననీయ తపః ప్ర | యుక్తి నాదరించి యున్న ద్రోణ తనయుఁ గాంచి చాపదండంబు సజ్యంబు | సేసి మహితశరముచే నమర్చి. |
57 |
| వ. | భ్రుకుటిత వికట ఫాలభాగుండై. | 58 |
| తే. |
‘ఓరి ధాత్రీసురాధమ! క్రూరకర్మ! | కపట ధార్మిక! యత్యంత కల్మషాభి యుక్తిఁ బోయినరేయి మహోగ్రవృత్తిఁ | దగిలి; తెంత వేగిరమునఁ దపసివైతి! |
59 |
| వ. | ఇట్టు లొదిఁగిన జావు దప్పునే? లే లెమ్ము. తపమ్ము సాలు రణమ్మునకు ర’మ్మని కఠినాక్షరంబులుగాఁ బలికె. నటు పలుకు నా భీమసేనుం గనుంగొని యతని వెనుకఁ గదియ నడచిన సవ్యసాచి ధర్మజులం జూచి సవ్యథంబగు నంతఃకరణంబుతో నగ్గురునందనుండు వారల దివ్యాస్త్రవేదిత్వం బూహించి దుస్సహంబగు నమ్మహా దురితంబునకుఁదలంకి బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్త్రంబు దలంచి యొక్క యిషీకంబు వుచ్చికొని యం దయ్యస్త్రంబు నావహించి ‘యపాండవం బయ్యెడు’ మని దారుణ భాషణంబులతోడ రోషప్రదీప్తుం డగుచుఁ బ్రయోగించిన. | 60 |
| స్రగ్ధర |
ఆ దివ్యాస్త్రంబునం దుద్యత మయి ఘనఘోరాగ్ని యర్చిర్వితానం బేదిక్కుం దానయై పెల్లెసఁగుచు భవనంబెల్ల భస్మంబుగా నా పాదింపం బేర్చుమాడ్కిం బరఁగి పెరిఁగినం బార్థునిం జూచి తద్బా హాదర్పజ్ఞానముద్రావ్యపగతభయుఁ డై యంబుజాక్షుండు వల్కున్. |
61 |
| వ. | ‘అర్జున! యర్జున! యిది బ్రహ్మ శిరోనామకం బను దివ్యాస్త్రంబు. దీని నొం డస్త్రంబు ప్రతిహతంబుఁ జేయంజాలదు, బ్రహ్మ శిరంబు నీవునుం బ్రయోగించి దీని నుడిపి నిన్నును నీ సోదరులను గాచికొనుము. సత్వరుండవు గమ్ము.’ | 62 |
| క. |
అనవుడు నవ్వీరుఁడు స | య్యన నరదము డిగ్గి నియతుఁడై ధనురాచా ర్యుని సంస్మరించి చాపము | గొని మంత్రముతోడ శరము గుణమునఁ గూర్చెన్. |
63 |