పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుఁ డుత్తరగర్భంబు దగ్ధంబు గాకుండఁ జేయ నిశ్చయించుట (సం. 10-16-1)
క. వనజాక్షుఁడు ద్రౌణికి ని | ట్లనుఁ ‘దునిమితి పాండు పౌత్రు లందఱఁ; బాపం
బునఁ బోయితి; గర్భంబులఁ | దునిమెద వం దొకటియైనఁ దొలఁగింపఁ దగున్‌.’
80
క. ‘ఏ నొక్కనిఁ బాండవ సం | తానార్థము గాఁగ నిత్తు; ధర్మముల మహా
దానంబులఁ గ్రతువుల జన | తానందితుఁ డగుచుఁ బెంపుఁ దలకొనువానిన్‌.’
81
తే. ‘అట్టి గర్భంబు నిలుపు త క్కన్ని గర్భ | ములును భవదస్త్రమున దగ్ధములుగఁ జేయు’
మనుడు సంరంభజృంభితుఁ డగుచు ద్రోణ | తనయుఁ డిట్లను నమ్మురాంతకుని తోడ.
82
వ. ‘పక్షపాతంబున నీ విట్లు పలికిన నే నట్లేల చేయుదు? మదస్త్రంబునకు లక్ష్యంబులుగా గర్భంబు లొండు గలుగు లేకుండు; నది యట్లుండె; విరాటనందన యగు నుత్తరగర్భంబు రక్షించెద నని చూచె; దప్పనికిఁ బూనితేనియు నా యస్త్రంబున నవశ్యం బదియును విధ్వంసంబు గావింతు’ నని పలికినఁ బద్మనాభుండు. 83
క. ‘అనఘుఁ డభిమన్యు తేజం | బనూనమై మాత్స్యపుత్రియం దున్నది; నీ
తునుముట గలిగిననుం ద | త్తనయున కే నాయు విచ్చెదను దీర్ఘముగన్‌.’
84
క. అనిన విని నగుచుఁ గుంభజ | తనయుం డిట్లనియె; ‘నస్త్ర దగ్ధుని బ్రతికిం
చిన మేలకాదె! నీ వి | న్ననువు నెఱింగెదము గాక నరసఖ! దీనన్‌.’
85
వ. అని పలికి పరమాదరణీయులగు సాత్యవతేయదేవకీనందనుల వాక్యంబు లాదరింపక పాండవ సంతాన సకల గర్భవిషయంబుగా నస్త్రప్రమోచనంబు సేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో నిట్లనుఁ; ‘ద్రికాలవేదియగు నొక్క బ్రాహ్మణుం డుపప్లావ్యంబునకు వచ్చి యుత్తరను జూచి నీ పుణ్యంబునఁ బ్రాణంబులు పరిక్షీణంబులైన పుత్రుండు జనియింపంగలవాఁ; డది కారణంబుగా భవదీయగర్భస్థునకుఁ బరిక్షిన్నామధేయం బగునని పలికె; నమ్మహాత్ముని వచనం బనృతంబు గానేరదు; భవత్కృత్యం, బకృతసమంబ; యబ్బాలుండు పాండవవంశకరుండగు,’ నని చెప్పి తన చిత్తంబున రోషం బావహిల్లుటయు, ‘బాలఘాతి వగు నీకు నశనంబు దుర్లభంబై, సహాయరహితుండవై దుర్గంధరక్తంబున నంగంబు దగ్ధంబగుచుండ మూఁడు వేలేండ్లు దిరుగుము; నాచేత రక్షితుండై, యక్కుమారుండు గృపాచార్యువలన ధనుర్వేదవిదుండై సర్వశస్త్రాస్త్రంబులు వడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపంగలవాఁడు; వానికి జనమేజయుండను మహారాజు ప్రభవించి నీవు సూచుచుండ నుజ్జ్వలుండె ప్రవర్తించు; మదీయంబులగు తపస్సత్యంబుల మహనీయ ప్రభావంబులు సూడు;’ మని యాడె నప్పుడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కిట్లనియె. 86
తే. ‘బ్రాహ్మణుఁడ వయ్యు నిట్లు క్రూరతకు రోయ | కస్మదీయ వాక్యంబుల నాదరంబు
సేయ కీ పాపకర్మంబు సేసినాఁడ; | వచ్యుతుఁడు వల్కినట్టుల యగుము నీవు.’
87
వ. అని యిట్లు శపియించి ‘నీచకర్ముండ! పొ’మ్మనిన, విని యశ్వత్థామ యమ్మహాత్ముని యాననం బాలోకించి ‘మునీంద్రా! నీవు మనుజులలోన నుండువాఁడ’ వని ప్రతిశాపం బిచ్చి, ‘నీకడన యేను వర్తిల్లఁ గలవాఁడ, నీవును శౌరియు సత్యవాదు లగుదురుగాక!’ యని తన శిరోమణి పాండవుల కిచ్చి తపోవనంబునకుం జనియెఁ; బాండవులును గృష్ణుండును నమ్మునీంద్రునకు నమస్కరించి వీడ్కొని యతిత్వరితగతి నరుగుదెంచి. 88
క. అరదములు డిగ్గి వగలం | బరితాపముఁ బొందుచున్న పాంచాలిం గాం
చిరి తమచేతోవృత్తులఁ | గరుణము మగుడంగఁ బొడమఁ గౌరవనాథా!
89
వ. అట్లు గాంచి యక్కాంత చుట్టు నాసీనులై; రప్పు డగ్రజుండు వనుపఁ బవనతనయుం డమ్మణి యద్దేవికి సమర్పించి. 90
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )