| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘పగతు పని సక్కనయ్యెన్; | వగ మానుము రాజధర్మ వైశిష్ట్యము పెం పుగ నాదరించి; నీ తా | ల్మిగదా భూపాలు నుమ్మలికముం బాచున్. |
91 |
| చ. |
జనపతి పంపఁ గేశవుఁడు సంధికిఁ బోయెడునప్డు నీవు సె ప్పిన గరువంపు రాజసపు బెట్టిదపుం దగు మాట లెల్ల నె మ్మనమున నెక్కొనన్ నిలుపుమా; వగవం బనియేమి? సంగరం బునఁ బగవారు పేర్చి పొరిపుచ్చక పువ్వులకోల సాఁతురే? |
92 |
| క. |
వినుము ధృతరాష్ట్ర! వంశం | బున మగపీచంబు నెల్లఁ బొలియించితిఁ గృ ష్ణుని కారుణ్యము, జిష్ణుని | పెనుఁ బ్రాపును గలుగ నేను విగత భయుఁడనై. |
93 |
| ఉ. |
త్రావితి దుస్ససేను రుధిరం బుర ముగ్రతఁ బేర్చి వ్రచ్చి, క్రీ డా విధి వాని యగ్రజు తొడల్ వడి నుగ్గుగఁ జేసి, యార్చి, యా భూవరు మౌళిఁ దన్నితి నృపుల్‌గని సంతసమంద; నింత హ ర్షావసరంబు శోకసమయంబుగఁ జేయుట నీకు నర్హమే? |
94 |
| క. |
గురుతనయుఁ డగుటఁ బ్రాణము | హరియింపఁగఁ జొరక విజయుఁ డశ్వత్థామం బరిభూతుఁ జేసి యాయుధ | పరిగ్రహముతోడ’ లజ్జఁ బాయం జేసెన్. |
95 |
| వ. | చూడామణి గోలుపోవుటంజేసి యా కుంభసంభవసంభవు కీర్తిశరీరంబు వడియె; ముఱికిఁ బొందియున్న; దింతియ; యిటువైరంబు పేరు లేకుండఁ దీర్చుట యెవ్వరికిం జను? నేమియుఁ గీడాడఁ దెఱపిలేక ధర్మతనయుండు నిర్మలకీర్తికి భాజనంబై యుల్లసిల్లెడు; నూఱడిల్లుము.’ | 96 |
| తే. |
అనినఁ గొండొక తెలివొందు నాననంబు | తోడ నుత్థితయైన యా తోయజాక్షి ప్రభలు పర్వంగ నొప్పు నాపద్మరాగ | రత్న మఱచేత నిడికొని రాజుఁ జూచి. |
97 |
| వ. | భీమసేను నుద్దేశించి. | 98 |
| ఉ. |
‘నా మనమార దీనిఁ గని నందముఁ బొందితి; నింత సాలు నా, కీ మహనీయరత్నము వహింపఁగ నర్హుఁ డితండ; యంచు నా భూమిపుచేతఁ బెట్టుటయు, భూవర! యాతఁడు ద్రౌణిగౌరవ శ్రీ మది భక్తిఁ బెంపఁగ ధరించె శిరంబున దానిఁ బ్రీతుఁడై. |
99 |
| వ. | ఇవ్విధంబున. | 100 |
| తే. |
విలసితం బగు నమ్మణి చెలువు మిగుల | మౌళియందు ధరించి యమ్మనుజనాథుఁ డుదయరాగ నితాంత సముజ్జ్వలేందు | బింబమునఁ బొల్చు పూర్వశైలంబు వోలె. |
101 |
| వ. | ఇత్తెఱంగునం బాండవాగ్రజుండు పాంచాలికిఁ బ్రియం బాచరించి తత్ప్రభృతి కాంతలును సహదేవ ప్రముఖ పురుషులును వినఁబవనతనయుం డశ్వత్థామఁబొడఁగనుట మొదలై గురునందనుండు చూడామణి యిచ్చుట తుదియైన వృత్తాంతం బంతయుఁ జెప్ప, నా భూవల్లభుండు లోనుగా నెల్లవారును నపత్యభాధకంబైన యా బ్రహ్మశిరంబు ప్రభావం బూహించి కృష్ణుని ప్రతివిధానంబు గలుగుట నూఱడిల్లియు నెట్లగునో యను శంకనుండి; రత్తఱి నుత్తరకుం దక్కఁ బాండవేయ వంశవధూజనంబులకు గర్భంబులు లేకయుండె; నయ్యస్త్రోత్తమం బవ్విరాటపుత్రి యుదరంబున నున్న పిండంబు బాధితంబు సేయుట గనుంగొని యప్పుండరీకాక్షుండు ద్రౌణితో సల్లాపంబు సేయునవసరంబున నయ్యస్త్రఘాతవేదన లేకుండఁ దన చిత్తవృత్తిన యుడిపెం గాన నవ్విశేషం బయ్యభిమన్యువల్లభయాదిగా నెవ్వరు నెఱుంగ; రది యట్లుండెఁ; బుత్రుల దెస వగ దొఱఁగకున్న యా ధర్మనందనుండు దేవకీనందనున కిట్లనియె; | 102 |
| చ. |
‘బలమున శౌర్యసంపద నభంగపరాక్రములైన ద్రౌపదే యుల నొకరుండ ముట్టికొని యుద్భటవిక్రమ ముల్లసిల్ల దు ర్బలుల వధించు చాడ్పునఁ గృపాణకళాలలితంబు లొప్ప వి చ్చలవిడిఁ ద్రుంచె నట్టె! గురుసంభవుఁ డంతకు నెట్టు సాలెనో! |
103 |
| శా. |
ఉద్యోగ స్ఫురితుం, డజయ్య భుజవీర్యుం, డిద్ధ విక్రాంత సం పద్యోగ ప్రథితుండు, శక్రనుతసంభావ్యక్రమోద్యద్ధను ర్విద్యావైభవశాలి, సంగరకళావిస్తారసంవేది, ధృ ష్టద్యుమ్నుం; డతఁ డోర్వకున్కి యెటు లశ్వత్థామ యుద్రేకమున్?. |
104 |
| క. |
తక్కును గల పాంచాలుర | నొక్కఁడ శిబిరంబు సొచ్చి యుక్కు దలిర్పం బెక్కండ్రఁ దునిమె నటె; యిది | యక్కజ మగు! నేమి కతన నధికుం డయ్యెన్?’ |
105 |
| వ. | అనిన నమ్మహీకాంతునకు మురాంతకుం డి ట్లనియె. | 106 |