పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజునకుఁ గృష్ణుఁడు శివప్రభావంబు చెప్పుట (సం. 10-17-6)
చ. ‘హరుఁ, బరమేశ్వరేశ్వరుఁ, గృపాతిశయార్ద్రు, నమేయమూర్తి, శం
కరు, నచలైక భక్తిరసగమ్యుని, నవ్యయు, నిందుమౌళిఁ ద
త్పరమతి నాశ్రయించి యనపాయబలోద్భటశౌర్యసంపదన్‌
గురుతనయుండు గాంచి యధికుం డగుటం బగదీర్చె నమ్మెయిన్‌.
107
చ. శివుఁడు ప్రసన్నుఁడైన నఱచేయునె యెవ్వరికైన? రాజపుం
గవ! యమరత్వమైన, బలఘస్మరు గెల్వఁగ నోపునట్టి ద
ర్ప విభవమైన నిచ్చుఁ; బరిపంథు లనేకుల నొక్కరుండు బా
హువిలసనంబు ఘోరముగ నోర్వఁగఁ జాలుట యీగి చోద్యమే?
108
ఉ. తెల్లమి గాఁగ నేను శివదేవు నెఱుంగుదు; భూతసంచయం
బెల్ల జనింప, నిల్వఁగ, లయింపఁగఁ జేయు నతండె; యవ్విభుం
డుల్లమునం దలంప భువనోత్కరవిశ్వవిధానయుక్తి వ
ర్తిల్లుచునుండు; భక్తికి విధేయుఁ, డమేయుఁడు కౌరవేశ్వరా!
109
వ. అమ్మహాదేవుని దివ్యలీలలు సెప్పెద నాకర్ణింపుము. 110
సీ. భూతసంచయ సృష్టి బుద్ధిఁ దలంచి య | ప్పరమేశుఁ గానఁగ బ్రహ్మ యరిగి
తనదు మనోవృత్తి దగ నెఱింగించిన, | నమ్మహాత్ముండు తదభిమతంబు
గావింపఁ బూని తపోవిభవం బేమి | పనులకు నైనను బ్రథమసాధ
నంబని యూహించి, యంబుసమర్పిత | నిజమూర్తియై, తపోనిష్ఠ నుండె;
 
తే. నా విరించియు నద్దేవదేవు రాక | బహుసహస్రవర్షంబులు వార్చియుండి,
నిజతపఃప్రభావంబున నిపుణచిత్తు | దక్షుఁడనువాని సృజియించె; ధరణినాథ!
111
వ. ఇట్లు సృజియించి యవ్విరించి యతని నాలోకించి ‘ప్రజల సృజియింపు’ మని పంచిన, నతండు ‘పెద్దవా రొండ్లు లేరై రేనియు సృజియించెద’ ననిన, నప్పరమేష్ఠి ‘పరమేశ్వరుండు జలనిమగ్నుండై యున్నవాఁ; డేను నిన్ను నియోగించెద; నింక సృజియించుపెద్ద లెవ్వరును లేరు. సృజియింతువు గాక’ యనవుడు నమ్మహాత్ముండు దేవాసురమనుష్యతిర్యగాత్మకభూతంబుల సృజియించిన, నాఁకొని యవి దక్షప్రజాపతి భక్షింపం గవిసిన. 112
ఆ. అతఁడు బ్రహ్మపాలి కతిరయంబునఁ బాఱి | ‘భూతతతులు నన్నుఁ బొదువకుండ
నాఁగవలయు; వాని కాహారములు గల్పి | తములు సేయవలయుఁ దగ మహాత్మ!’
113
వ. అనిన విని యా జగత్కర్త యోషధులును ఫలమూలాదిభక్ష్యసంపదుపకారంబులుగా వృక్షలతాగుల్మంబులను గల్పించి, యా భూతంబులకు వాని నాహారంబులుగా సమర్పించి, మఱియును బలిష్ఠభూతంబులకు దుర్బల భూతంబులు భక్ష్యంబగుం గాక యనియు నాదేశించె; నంత నా భూతంబులు ప్రీతంబులై చని తత్ప్రకారంబున వృద్ధినొంది సంతానరూపంబున సమృద్ధంబు లగుచునుండెఁ; బెద్దకాలంబునకు బాలేందుధరుండు జలంబులు వెడలివచ్చి భూతకోట్ల నాలోకించి కోపించి నిజలింగంబుఁ బుచ్చి నేలనిడినం గని యా నీరజాసనుండు భవునిం బ్రశమనవాక్యంబుల ననునయించుచుఁ జేరనరిగి ‘లింగంబు నిట్లేల చేసి?’ తనుటయు నద్దేవుండు. 114
క. ‘భూతంబుల సృజియించుట | కై తోయములందు మునిఁగి యత్యుగ్ర తపః
స్ఫీతుఁడనై వచ్చితి నొరు | చేత సృజనమగుట నిట్లు సేసితి దీనిన్‌.’
115
వ. ‘భూతంబుల సృజియించుటకుం గాక లింగంబు దన కేల?’ యని పలికి సంరంభవిజృంభితుం డగుచు మాల్యవంతంబునకుఁ జని మహాతపంబు సేయుచుండ. 116
క. ఆ సమయంబున లింగము | భాసురగతిఁ జూడ నొప్పె బ్రహ్మాదులకుం;
జేసిరి పూజలు వారలు | వాసవముఖ్యామరాదివర్గముఁ దారున్‌.
117
వ. అంతం బెద్దకాలంబునకు. 118
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )