| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
శ్రీ సాంగత్య విధాయి వి | కాసోల్లాసిత కటాక్ష! కరుణామయ మూ ర్తీ! సారబోధ భరిత | వ్యాసాది మనోనివాస! హరిహరనాథా! |
1 |
| క. |
దేవా! జనమేజయ జగ | తీవరుఁడు కుతూహలము మదిన్ మొలతేరం గా వైశంపాయన వద | నావేశిత దృగ్విలాసుఁ డై యి ట్లనియెన్. |
2 |
| వ. | తన సుతుండును సైన్యంబును బాండుసుతులచేత నట్లగుట సంజయువలన విని ‘ధృతరాష్ట్రుం డెబ్భంగి వర్తించె నశ్వత్థామ కృప కృతవర్మ లా రాత్రి తమ చేసిన పరాక్రమంబు తెఱంగు దుర్యోధనున కెఱింగించి పోయిరని వింటిఁ బదంపడి కరినగరంబు దెస కరిగి మగిడి రనియు నాకర్ణించితి వార లట యెవ్వలనికిం జని రేల మగిడి రశ్వత్థామ కృష్ణద్వైపాయనాశ్రమంబునకుం బోవం దక్కిన యిరువురు నెక్కడ వోయి రవ్విధంబున విజయంబు నొందిన ధర్మనందనుం డేమి యాచరించె నంతయుం బరిపాటిం దేటపడం జెప్పు’ మనిన నమ్ముని వరుం డిట్లనియె. | 3 |
| తరలము |
ధరణినాయక! యట్లు పుత్రశతంబు వైరికులంబుచే నిరవశేషత నొందుటన్ మహనీయ గౌరవహీనతం బొరసి కొమ్మలు దున్మ మ్రోడ్పడు భూరుహంబును బోలె ని ర్భర విపద్వికలాత్ముఁడై ధృతరాష్ట్రుఁ డుల్లము వమ్ముగన్. |
4 |
| వ. | చింతా భరంబున నూరక యున్నం జూచి సంజయుం డతని కిట్లనియె. | 5 |
| ఆ. |
‘నీకు నితరులట్ల శోకింపఁదగునె? యె | వ్వరిఁ దలంచి యింక వనరువాఁడ వీవు? శోకమునకు నెయ్యది తుది? యిది | వలవ దుడుగు వినుము వసుమతీశ! |
6 |
| వ. | పదునెనిమిది యక్షౌహిణులు సమసెఁ బితామహ పితృభ్రాతృ పుత్ర పౌత్ర సఖి సుహృత్సహాయులుందెగి రందు వగపునకుం బనిగాని వారలు గలరే? యేది కొలందిగా వగచె దందఱకు నగ్నికార్యంబు నిర్వర్తింపను దగిన వారలకుం దిలోదక ప్రదానంబులు సేయను వలయుఁ బొలిగలనికి వేంచేయు’ మనుటయు. | 7 |
| క. |
విపులార్తిఁ గూరి మనుజా | ధిప! యా భూవల్లభుండు ధృతిలేమిం జం డపవన పతితంబగు పా | దపంబు చందంబు దోఁప ధరణిం బడియెన్. |
8 |
| వ. | పడియుండి తల దోర్చికొనుచు నిట్లనియె. | 9 |
| వసంత తిలకము |
‘హా! పుత్రవర్గ మిటులాఱడిఁ బోవ దీప్త | వ్యాపారమేది మది వందుచు దీన వృత్తిం బ్రాపించి యన్యులు కృపం బరికింప నిం కే | నోపన్ భవం బెడలి యుండఁగ జీవితోడన్. |
10 |
| క. |
ఎఱకలు విఱిగిన గరుడుని | తెఱఁగునఁ దేజంబు సెడిన దినకరుగతి నం దఱు బంధులు దెగి విభవం | బఱి వెలవెలఁబాఱుచునికి యది బ్రదు కగునే! |
11 |
| సీ. |
సంధికిఁ గృష్ణుండు సనుదెంచి పెక్కుభం | గులఁ జెప్ప భీష్ముండు గుంభజుండు నట్లు హితార్థులై యంతలంతలు మాట | లాడిరి జామదగ్న్యాదులైన మునివరు లవ్విధంబున నొత్తి చెప్పి రా | బుద్ధులన్నియును దుర్భుద్ధి నగుటఁ బాటింపనైతి లోభమునఁ బాండు నృపాలు | పాలు తత్సుతులకుఁ బంచి యీని |
|
| తే. |
నా కతంబునఁ బొలిసిరి నందనులును | జెలులుఁ జుట్టంబులును సహాయులును ధైర్య మెట్లు కలుగు వైదికముల కెట్లు మనసు | గొలుపుఁ బ్రాణంబుతో నెట్లు నిలువ వచ్చు? |
12 |
| క. |
నా కీడు దలఁప నేరక | శ్రీకి నెడపి పాడి యింత సేయక పుత్రా నీక సుహృద్బాంధవులం | బోకార్చితి బ్రదుకు టింకఁ బొసఁగునె చెపుమా! |
13 |
| వ. | దైవంబు దుఃఖ భాజనత్వం బొనర్చుటం బూర్వజన్మాచరితంబైన సుకృతంబు లేమి గాననయ్యెడు వయః పరిణామంబునఁ బంచభూత క్షయంబును దుర్వినయ పరిపాకంబున సకల బంధునాశంబును సమయ ప్రాప్తంబులయ్యెనింక బ్రహ్మపదప్రాప్తియ తగు నదియై యున్నది యది యాచరించుట సంశితవ్రత పరాయణులైన పాండు సుతులు చూతురు గాక యనిన విని యజ్జనపతి శోకంబు శాంతంబు సేయుటకు సంజయుం డిట్లనియె. | 14 |
| క. |
‘శ్రుతులును శాస్త్రములు బహు | శ్రుతులవలన వింటి శాంతి చొప్పడ వలదే? మృతికి నృపులడలుదురె? ధీ | యుతు లీ విధమునకు రోయకుండుదురె? నృపా! |
15 |
| వ. | తొల్లి సృంజయుండు పుత్రశోకార్తుండైన నమరమునిసత్తముండగు నారదుం డుపన్యసించిన యితిహాసం బభిమన్యు మరణ శోక సంతప్తుండైన ధర్మతనయునకుం బరాశర తనయుండు సెప్పిన చొప్పునన యేనును జెప్ప నాకర్ణించితి గాదె! సుహృజ్జనంబు లుపదేశించిన మాటలు విననైతి నని నీవ చెప్పె దుమ్మలింపం బనియేమి? నీకును నీ కొడుకునకు మంత్రులు దుశ్శాసనుండును గర్ణుండును శకునియునటె యేమి సెప్పఁగల దవధరింపుము. | 16 |
| ఆ. |
కొఱుత నుఱుకుఁ గాని కొడుకెన్నఁడును గార్య | తంత్రమునకుఁ జొరఁడు దాని నీవు మాన్ప నొల్ల వతని మగఁటిమియును లావు | నచ్చి లోభ మెదఁ బెనంగొనంగ. |
17 |
| క. |
ఆర్యులు దఱితోఁ దగియెడు | కార్యమనుష్ఠింతు రట్టుగా కప్పని మా త్సర్యమునఁ దిగిచిపట్టి య | నార్యులు దుదిఁ దూర వగతు రాపదయైనన్. |
18 |
| ఆ. |
జున్ను డెప్పరంపు జోటైన చఱినున్నఁ | జూచి విఱుగఁబడుటఁ జూడ కాత్మ దీపుఁ గోరి యుఱుకు తిండికాఁడును బోలె | నయితి; వగచు టింక యనుచితంబు. |
19 |
| క. |
వగచినఁ బోయిన కార్యము | మగుడునె? వగవంగ లోకమాన్యుండగునే? వగ పుణ్యగతికి మూలమె? వగ పెల్లవిధముల నుడుగ వలయు నరేంద్రా! |
20 |
| మత్తకోకిల |
తాన చుట్టుఁ దగిల్చి యగ్ని యుదగ్రతం దరికొన్నఁ దా పానుభూతికి నోర్వఁజాలక యప్రయోజన వాక్య సం తాన శోషిత వక్త్రుఁడై యతి దైన్యమొందెడు వాని య ట్లైన నీదు విలాప మన్యుల కాడఁ బట్టగు భూవరా! |
21 |
| ఆ. |
నీవుఁ గొడుకుఁ బల్కు నిష్ఠురవచనంబు | లను సమీరగతుల నతిశయిల్లు పార్థు రోషవహ్ని పాల్పడి రధిప! నీ | వారలెల్ల నింక వగవఁ దగునె?’ |
22 |
| వ. | అని యనేక భంగులం బలికిన సంజయు పలుకులకుం జెవియొడ్డి ధైర్యంబు చిక్కఁబట్టి యంకిలిదేఱిన యవ్విభు నాలోకించి ‘యేల నేలఁబడి పొరలెదు? లె’మ్మని పలికి విదురుం డి ట్లనియె. | 23 |