పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
విదురుఁడు ధృతరాష్ట్రునకు దుఃఖోపశమనంబు చేయుట (సం. 11-2-1)
క. ‘పెరుఁగుట స్రగ్గఁగ, రుచులం | బొరయుట యరుచంబు గాఁగఁ, బుట్టుట సావం,
బెరయుట పాయఁ, బదార్థో | త్కరముల నైజ; మది యెట్లు దప్పింప నగున్‌?
24
సీ. బిరుదుల నైనను బిఱికి వాండ్రనునైనఁ | జంపుచోఁ గడపఁడు జముఁడు నేర్పు
లావును మర్త్యుని చావు మాన్పఁగలేవు | రణమొనర్చినఁ గాని రాదె మరణ
మెయ్యది యవధి? యిందెల్ల వారును దెగు | వారకా కది గడవంగ వశము
గా దింత యుమ్మలికంబేల? యట్లును | గాక నీ సుతులు సంగ్రామకేళి
 
తే. సలిపి యింద్రుని కతిథులై చనిరి యజ్ఞ | దానవిద్యాతపోలబ్ధ మాననీయ
గతులు సమరానివర్తన మృతుల యరుగు | నట్టి గతులకుఁ బాటిగా వండ్రు బుధులు.
25
వ. కావున వారికి వగవం బనిలే దది యట్లుండె. సంసారంబున మాతృ పితృ సోదర దార పుత్ర సహస్రంబు లనుభవ గోచరంబులయ్యె నందెవ్వరికి వగచెద?’ వని వెండియు. 26
తే. ‘యౌవనంబును రూపంబు జీవితంబు | ద్రవ్య సంచయములు ననిత్యములు గావె?
వీని హానికి వగ పవివేక మగుటఁ | బండితులు వగఁ గూరరు పౌరవేంద్ర!
27
వ. పాండిత్య సంపన్నుండవగు నీవు బంధుజీవహానికి వగవందగునె? వగవకూరకునికి మే లాకర్ణింపుము. 28
ఇంద్రవజ్ర చింతాపరత్వంబునఁ జెందు దుఃఖా | క్రాంతత్వ ముర్వీశ్వర! కానఁ గీడుం
జింతింపఁ డార్యాత్ముఁ డచింతనుండై | యంతః పరీతాపము నార్పఁ జాలున్‌.
29
క. ప్రియవస్తు వెడలుటయు న | ప్రియంబు వాటిల్లుటయుఁ బరిజ్ఞాన విని
శ్చయ హీనులైన యల్పా | శయులకు ‘దుఃఖంబుఁ జేయు’ జగతీనాథా!
30
వ. పండితుల నవి గలంపం జాల ‘వనిన విని ధృతరాష్ట్రుం డతనిదిక్కు మొగంబు గాఁగఁ గూర్చుండి ‘నీ సుభాషితంబుల కతంబున శోకంబు డిందువడియెఁ బండితులు ప్రియాప్రియ వస్తు వియోగ సంయోగంబు వలన జనించు మానస దుఃఖంబుల నేమిటంజేసి పొరయకుండుదు రది సెప్పు ‘మనుటయు నమ్మనుజపతి కతం డిట్లనియె. 31
క. ‘ఈ లోకము నిస్సారం | బాలోకింపంగ ననఁటియట్టుల; యని తా
లోలతఁ బొందని పురుషుం | డేలా నెవ్వగలఁ జెందనిచ్చు మనంబున్‌?
32
తే. అరయవచ్చినఁ దనమేను నెరవ తనకు | నొండు రూపులు దక్కక యునికి యరుదె?
యను తలంపు ధ్రువంబుగ నలవరించి | బుధజనంబులు శోకంబుఁ బొరయ రధిప!
33
సీ. ఒక యింటనుండి వేఱొక యింటి కరిగిన | విధమును వస్త్రంబు విడిచి యొండు
వస్త్రంబు గట్టిన వడువును నై యుండు | నొడలు దొఱంగి యొండొక్క యొడలు
గైకొంట నృప! విను కడవకు సారెపై | నమర మృత్తిక యిడినపుడు విరియు
టయు వెరవారఁ బట్టఁగరాక చెడుటయు | వాని యెత్తెడు నెడ వ్రయ్యుటయును
 
తే. నెత్తి యొకచోట డించిన నెడలుటయును | నెండి యవియుటయును నావ మిడినఁ బగిలి
పోవుటయు వాడు జనులచేఁ బొలియుటయును | గలుగు గతి మేనికెట్లును గలుగుఁ జేటు.
34
వ. అది యెట్లంటేని గర్భాధానవేళయందును బిండావస్థయందును బ్రసూతిమాత్రంబున బాల్యంబునను యౌవనంబునం బ్రౌఢత్వ సమయంబునను వార్ధకంబునం గర్మానురూపంబగు నాశంబు శరీరంబునకు సంప్రాప్తంబగు నిది కొలందియని యెఱుంగరా దట్లగుటం దమతమ సుకృతదుష్కృతంబుల తెరువులఁ బోయిన నీ తనయాదులవలని వగలం బొగులం బ్రయోజనంబు లేదు. ప్రాజ్ఞులు వివేకంబున సంసారంబు దుఃఖబహుళంబని యెఱింగి తద్రూపగహనంబు గడచి శాశ్వత సుఖంబుఁ బడయుదు’రనిన విని యాంబికేయుండు ‘సంసారదుఃఖబహుళతయును దద్గహనత్వంబును నెఱిగింపు’ మనుటయు నవ్విభునకు విదురుం డిట్లనియె. 35
తే. ‘కలసి శుక్ల శోణితములు కరుడు గట్టి | విను మమేధ్య మధ్యమునఁ బ్రవృద్ధిఁ బొంది
కాలవశత నప్పిండ మంగంబులెల్ల | గలిగి శిశువయి మారుతగతి యెలర్ప.
36
క. వెడలునెడ గాఢ పీడం | బడి సుడివడి యోని నొత్తువడి యొక భంగిన్‌
వెడలఁగ గ్రహభూతముల | ప్పుడు దొడఁగి యనేక దురితములు గల్పించున్‌.
37
వ. అట్లు జనియించి మనుజుండు. 38
క. బాలత్వంబున నవివే | కాలోలత శుచియు నశుచి యైనదియు సమం
బై లీల జుగుప్సిత విధి | శీలత నొందంగ దుర్విచేష్టలఁ దిరుగున్‌.
39
క. యౌవనమున విషయ పర | త్యావేశము దుఃఖకారియై యలఁపఁగ నా
నా విధ దుర్వినయములకుఁ | దావలమై మెలఁగు నిందితప్రక్రియలన్‌.
40
మత్తకోకిల వృద్ధుఁడైనతఱిన్‌ బలంబును వీఁకయుం దఱుగంగ దు
ర్బుద్ధి వాటిల మ్రగ్గి యింద్రియముల్‌ విశక్తతఁ బొంద దో
షోద్ధతిన్‌ రుజ లుద్భవింపఁగ నొండురూపగు పాశసం
బద్ధుఁ జేసి జముండు దివ్వఁగఁ బాయు నబ్భవముం దుదిన్‌.
41
వ. కావున సంసారంబు దుఃఖబహుళంబగుట విస్పష్టం బది యట్లుండె లోభక్రోధ మదోన్మత్తులై దుర్మతు లింద రమింతు రందలి సుఖలేశంబునకై యొండొరులం జెఱుపను జంపను జొచ్చి ధర్మపథంబు దప్పి యమ కింకరుల చేతం బడుదు రిత్తెఱంగు బుధులవలనఁ దెలియ విని విమలస్వాంతులు సన్మార్గంబున వర్తిల్లి నిత్యానంద స్వరూపు లగుదురు. దీని గహనత్వంబు పెద్దలచేత వినినతెఱంగు సెప్పెద నాకర్ణింపుము. 42
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )