| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము |
| తరువోజ |
అతిదుర్గమగు నరణ్య ప్రదేశమున నవనీసురుం డొకఁ డరుగుచునుండ మితిలేని ఘోరంపు మృగములు శరభమృగపతిప్రముఖముల్ మిక్కిలి భయము మతి కావహించుచు మార్గంబునందు మల్లడిగొనుడు నున్మార్గ యానమున ధృతి దూలఁ జన నవి తిరిగె వెన్వెనుకఁ దెక్కలికాఱు దోఁతెంచి రాతనికి. |
43 |
| వ. | అట్టి యెడ. | 44 |
| తోటకము |
గరుపాఱఁగ మేను ప్రకంపమునం | బొరిఁ దొట్రువడం బదముల్ దొలఁగం జొర నెచ్చొటు లేమి నసువ్యయభీ | భర మొందినఁ జేడ్పడు భావముతోన్. |
45 |
| తే. |
దెసలు గలయంగఁ జూచుచు దిక్కుదనకు | నెవ్వరును లేమి వెగడందు నెంత దవ్వు సనిన నడవికిఁ గడ లేమియును మృగవ్ర జంబు పొదువుటయును గొందలంబు సేయ. |
46 |
| వ. | అప్పు డాభీషణారణ్యంబున నేదిక్కు సూచినను దఱచుగా నొడ్డిన యురులు దోఁచె. ఘోరాకారయగు నొక్క యువిద యతనిం గౌఁగిలించుకొనియెఁ బంచశిరంబులును నగనిభంబులు నగు నాగంబు లనేకంబు లవ్వనంబునం గ్రందుకొనం దిరుగుచుండెఁ దత్ప్రదేశంబున నొక్కయుదపానంబు వల్లీవితానంబుచేత సంవృతంబై మీఁదఁ దృణంబులు వరఁగి నిగూఢంబైయున్న నప్పురుషుం డా నూతంబడి యొక్క బలుదీఁగం దవిలి తలక్రిందై వ్రేలుచుఁ గొమ్మనున్న పనసవంటి చందంబున నుండె న ట్లయ్యవస్థ నొందియు నక్కూపంబులో నొక్కభీమభుజంగంబు నాలుకలు గ్రోయ నాఱు దలలును బండ్రెండు కాళ్ళును గృష్ణశబల వర్ణంబును గల మహాగజం బానూతి దరినున్న తరువుఁ జేరంజనుదేర నందు శాఖోపశాఖల నానావర్ణంబులగు మధుకరంబులు మధుసంచయనం బాచరించి వర్తింప సితాసితంబులగు మూషికంబు లమ్మహీరుహంబు మూలంబు నఱుకు చుండ. | 47 |
| ఉత్సాహవృత్తము |
ధరణినాథ! వినుము మధుర ధారలెల్ల ప్రొద్దునుం | దొరుఁగుచుండ నతఁడు వాని దోహలమున నానుచుం బొరయఁ డెప్డుఁ దృప్తి వగలప్రోక యైన యట్టి దు | స్తరపుటున్కి కొల్లఁబాటుఁ దన్కఁ డించుకేనియున్. |
48 |
| వ. | ఇట్లున్న యతనికి నా బహుళవ్యాళంబులం, దెక్కలికాఱుల యురుల వలనను, నయ్యుగ్రకామినీ కారణంబున నుం, బంచశిరస్కంబులగు సామజంబుల సందడి, నా కూపంబులోనున్న యద్దారుణ దర్వీకరంబు కతంబునను నూతిదరిం జరించునగ్గజంబు ఘోరత్వంబునం జేసియు మూషికంబుల తరుపతనహేతుభావంబునను నాచంచల చంచరీకంబుల కారించుటనుం జేతోవృత్తంబు వికలతాయత్తంబై యుండ నతండు జీవితాశయు విడువం’ డనిన విని విదురునకు ధృతరాష్ట్రుం డిట్లనియె. | 49 |
| క. |
‘మనమునఁ గృప పుట్టెడు న | ట్లనయముఁ గీడైన యునికి కాతం డెమ్మైఁ గనియెను విడుమర? దానిన్ | వినవలతుం జెప్పవే వివేకనిరూఢా!’ |
50 |
| కవిరాజ విరాజితము |
అనవుడు నిట్లను నన్నర పాలును కాతఁడు ‘మోక్షము నర్థి జగ జ్జనులకుఁ బెట్టుట సన్మతిఁ గోరి విశారదు లాదరసంభృతులై యనఘ! సుదుస్తరమైన భవంబున కచ్చగు నీ యితిహాసము బో ధన మహనీయ విధంబునఁ జెప్పి రుదాత్తగుణాశ్రయతామహితా! |
51 |
| వ. | కావున నేతత్స్వరూపం బభివ్యక్తంబుగా వివరింపవలసియుండు వినుము చెప్పెద నా దుర్గంబు సంసార గహనంబు వాలు మృగంబులుఁ దెక్కలికాఱు నురులు రోగంబులు కామినిజర పంచ శిరస్కంబులగు గజంబు లింద్రియ ప్రపంచంబు లాకూపంబున నున్న నాగం బంతకుండు తీఁగ జీవితాశ కూపంబు నుపాంతంబున నున్న యవనీరుహం బాయువు దాని దెస నడచు సామజంబు సంవత్సరంబు తదీయ శిరంబు లాఱును ఋతువులు తత్పాదంబులు పండ్రెండు మాసంబులు తరుమూలంబు నఱుకు నెలుక లహోరాత్రంబులు మధుకరంబులు కామంబులు మధుధారలు కామరసంబులు మధుసంచయనం బాయువు వానివలన మానవులాసక్తులగుదు రిట్టి సంసార చక్రంబు పరివర్తనంబు బుధు లెఱుంగుదురు వారు దీని పాశంబులు ద్రెంపంజాలుదు’ రనిన విని యాంబికేయుండు విదురున కిట్లనియె. | 52 |
| క. |
‘హిత ముపదేశించితి వీ | వతి నిర్మల చిత్తవృత్తి వగుట సుజన సం స్తుత గుణ! యింకను జెప్పుము | ధృతికారక వచన పద్ధతిన్ విశదముగన్.’ |
53 |
| వ. | అనుటయు విదురుం డవ్విభున కిట్లనియె. | 54 |
| కవిరాజ విరాజితము |
అనయము లోలతమై విషయప్రచయంబను దుస్తర పంకమునన్ మునుఁగుచుఁ దేలుచు నుండఁగఁ గాలము ముట్టి రుజన్ జర నెవ్వగ పై కొన దొరకొల్పి క్రమంబున నంగము క్రొవ్వును జెల్పును బాపి ప్రయో జన రహితంబుగఁ జేసి యపాత్రపుఁజా వొనరించుఁ గురుప్రవరా! |
55 |
| వ. | అని మఱియును. | 56 |
| క. |
‘తేరు శరీరము దానికి | సారథి సత్త్వంబు తురగచయ మింద్రియముల్ దారుణతర బుద్ధి వ్యా | పారము లొనరంగ గనప పగ్గము లధిపా! |
57 |
| క. |
నరవర! యేర్పడ విను మ | త్తురగంబుల పటు రయంబుతో ననుసరతం దిరుగు పురుషుండు సంసృతిఁ | బరువడి భ్రమియించు నవశభావవ్యాప్తిన్. |
58 |
| క. |
వానిఁ దమయిచ్చ నెందుం | బోనీ కుండంగ నాఁగు పురుషుఁడు సంసా రానేక దుఃఖభాజన | తా నిరసనమునకు నేర్చు ధరణీనాథా! |
59 |
| క. |
యముని యధీనం బిది దుః | ఖముల ననేకములఁ జేయఁగా నోపు నృపో త్తమ! యీరథ మది యడఁతురు | విమలవివేకౌషధమున విను మార్యజనుల్. |
60 |
| వ. | ఆ పగ్గంబులు శీలంబను వెరవుతో నలవరించి వేగం బార్యు లుడుపుదురు వారలు జననమరణాదుల వలని భయంబు నుజ్జగించి పరమసుఖంబు నొందుదు రింతయు నెఱింగి శాంతినొంది పుత్రాది జ్ఞాతులకు నౌర్ధ్వదైహికంబులు సేయించి సుఖివిగ’మ్మనిన విని యమ్మాటలన్నియుం బోవిడిచి తుదింజెవి సూఁడినట్టి దయినఁ బుత్ర పరలోక క్రియావిషయంబగు మాటకు శోకం బతిశయిల్ల మూర్ఛిల్లె నట్టి సమయంబునం గృష్ణద్వైపాయనమునీంద్రుఁ డయ్యెడకు విజయంచేసిన విదురసంజయాదులు సంభ్రమంబున నెదురువచ్చి ప్రణతులైధృతరాష్ట్రునకు శిశిరజలసేచన లలితవ్యజనవీజనంబుల నాచరించిన నతండు సేదదేఱుటయు నతని కమ్మహాత్ముని రాక యెఱింగించిన నమ్మహీపతి యతనికి దండనమస్కారంబుసేసి గద్గదిక నెలుంగు రాలుపడ నిట్లనియె. | 61 |
| దోధక వృత్తము |
‘మానుష జన్మము మాన్య వివేకా! | మానసదుఃఖ సమాజము నెల్లం దాన ఘటించుచు దైన్యము దెచ్చుం | గాన భవంబిది గాల్పనె? తండ్రీ! |
62 |
| మంజుభాషిణీ వృత్తము |
ధనమంతయుం బొలియ దారుణంబుగాఁ | దనయవ్రజంబు దెగ దైన్యమారఁగాఁ దన బంధులందఱు మృతంబుఁ బొంద నె | వ్వనినైన శోకమనువహ్ని కాల్పదే? |
63 |
| ఉపజాతి వృత్తము |
మునీంద్ర! నిర్భాగ్యత ముట్టి చావుం | గానేరదయ్యెం గడుగట్టి చిత్తం బనూన మూర్ఛం దెగటారియుఁ దా | రానేర్చె నిమ్మేనికిఁ గ్రమ్మఱంగన్. |
64 |