పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
కృష్ణద్వైపాయనముని ధృతరాష్ట్రునకు దుఃఖోపశమనంబు చేయుట (సం. 11-8-12)
వ. ఇంక నేమిసేయువాఁడ’ నని పలికి యూరకున్న యన్నరనాథునకు మునినాథుం డి ట్లనియె. 65
ఉత్సాహవృత్తము ‘నీవు ధర్మభంగి నెఱుఁగ నేర్తు నీతి కౌశలం | బావహిల్లు నీదు మనమునందుఁ గాన నేను శో
కావిలత్వ ముడుపఁబూని యరుగుదెంచితిన్‌ సుతా | భావజనిత దుఃఖవార్ధిపార మెయ్దు పుత్రకా!
66
క. భూతము లనిత్యములు నీ | వీ తెరు వెప్పుడును విం దహీన ధృతిన్‌ నీ
చేతోగతి నలవఱుపుము | భూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్‌.
67
ఆ. అరయ జీవలోక మధ్రువ మన నరు | నొడలి బ్రదుకు చావుఁ గడవ దనఁగ
వినియు నెల్లఁ గనియు వీతవివేకతఁ | బుత్ర మరణమునకుఁ బొగుల నగునె?
68
వ. అదియునుం గాక. 69
సీ. నీ వెఱుంగక యుండఁగా వచ్చెనే వైర | బంధంబు కౌరవపాండవులకు?
నీ పుత్రకుండ దీనికిఁ గారణం బిది | విధి నిర్మితంబైన విధము సువ్వె!
కౌరవజాతి సంక్షయ మవశ్యంబుగాఁ | గలయదియై చెల్లెఁగాక క్రొత్త
యైనదియే? బంధు లాజి విహార త | త్పరతమై సద్గతిఁ బడసినారు
 
ఆ. వారి కేల యింత వగవ నట్లును గాక | విమలబుద్ధియైన విదురుఁ డిట్టు
లగుట యెఱిఁగి బుద్ధి తగఁ జెప్పె నీకు జూ | దంబు సమయమునన దాని వినవ.
70
దోధక వృత్తము దేవ కృతంబులు ధీరులకైనన్‌ | భూవర! మాన్పఁగఁ బోలునె? యెట్లుం
గావున శోకముఁ గాఱియ దల్గం | గా వలదే తుది గౌరవ మొప్పన్‌?
71
వ. దేవతలకుం గృత్యంబయిన దానిఁ దత్ప్రత్యక్షంబున వింటి నది నీకు మేలు గోరిచెప్పెద నాకర్ణింపు; మే నశ్రమంబున నెందయినఁజరింతు నొక్కనాఁడు దేవసభకుంబోయితి నందుఁబురందరప్రముఖ బృందారకులను నారదాదిమునిబృందములనుంగాంచి సుఖగోష్ఠినున్న సమయంబున భూదేవి యచ్చటికి వచ్చి య వ్విబుధులతో నిట్లనియె. 72
క. ‘మీరలు బ్రహ్మసభను మ | ద్భారము మాన్పుటకు నలిని బనిఁబూనితి రె
క్కారణమునఁ దడసితి రొకొ? | యేరూపునఁ దలుఁగుదాన నేను భరంబున్‌?
73
వ. అనిన విని సర్వలోక నమస్కృతుండగు నారాయణుండు నవ్వుచు న వ్వెలంది కిట్లనియె. 74
తే. ‘వినుము ధృతరాష్ట్రుఁ డనురాజు తనుజశతముఁ | బడయు దుర్యోధనుం డనఁబరఁగు పెద్ద
కొడుకు నీ భారతమంతయు నుడుపు నతఁడు | తడయ కయ్యెడు నది వగఁ దక్కు మబల!
75
వ. ఎట్లనిన. 76
క. వానిం జంపను గావం | బూని సకలరాజలోకమును నీసుమెయిన్‌
సేనాసముదయములునుం | దానుఁ గురుక్షేత్ర సమర దారుణతఁ దెగున్‌.
77
వ. సోదరసముదయసహితంబుగా నతండును మృతుండగు; దానంజేసి భవదీయభారంబు వాయు నిశ్చింతంబునం జనుము భూతధారణం బాచరింపుము పొ’మ్మని పలికి యద్దేవిని వీడుకొలిపెఁ బదంపడి సకల ప్రజాసంహార కారణంబై కల్యంశంబున దుర్యోధనుండు జనియించె; నక్కుమారుండు. 78
తే. ఒరుల యున్నతి సయిరింపనోపఁ డధిక | బలుఁడు క్రోధి శూరత్వసంపన్నబుద్ధి
బుద్ధి సెప్పిన వినియెడు ప్రోడగాఁడు | గాన వైరంబు విడువఁడు కౌరవేంద్ర!
79
క. తమ్ముఁడు, శకునియుఁ, గర్ణుఁడు | నమ్మానవపతికిఁ దగినయనుచరు లతనిన్‌
సమ్మదమునఁ గలసిన నృపు | లమ్మెయి వారలు వినాశమగు టేలుడుగున్‌?
80
తోదక వృత్తము తమ తమ తప్పులఁ దా రెరియంగా | విమలమతీ! యిటు వీరికినై శో
కమునఁ దహింపఁగఁగాదు మనంబున్‌ | సముచిత మిత్తఱి శాంతము సుమ్మీ!’
81
వ. అని చెప్పిన నవ్విభుండు దనకుం బాండవాగ్రజుం డవమానం బాచరించునను శంక నూని యునికి యమ్మహాముని దివ్యబోధంబునం దేటపడి యుండుం గావున నత్తాపసోత్తముండు వెండియు నిట్లనియె. 82
క. ‘పాండవుల వలని కీడొ | క్కొండును లేదధిప! నీదు కొడుకులు ధరణీ
మండలమంతయు మ్రింగిరి | పాండునృపతి భాగమునకుఁ బాపిరి వారిన్‌.
83
వ. దానంజేసి యిట్లు సకల కౌరవ్యులకు నఖిల భూపతులకు నిఖిల ప్రజలకును బొలియవలసె నిది యంతయు మున్న యెఱుంగుదుఁ గావున. 84
ఉత్సాహవృత్తము వినుము నారదుండు దీని వినఁగఁ జెప్పె ధర్మనం
దనున కతని మనము కరుణ దవిలియున్కి హింసకున్‌
గొనకొనంగఁ జొరమి నతఁడు కురుబలంబుతోడ పొం
దునక వడఁడె? జగము మెచ్చఁ దొడఁగి పెక్కు భంగులన్‌.
85
తే. ఏను నతనికిఁ జెప్పితిం గాన నాతఁ | డధికయత్నంబు సేసెఁ దానంతవడియు
వైర మెమ్మెయి మాన్పంగ నేరఁ డయ్యె | నియతిఁ దప్పింప నేరికి నేర నగునె?
86
క. ఏ నిది యంతయు నెఱుఁగుదుఁ | గాన వృథా శోక వహ్నిఁ గాలమికిని నీ
మానసమునఁ గృపకలిమికిఁ | గా నొడివితి దేవగుహ్యగతియుఁ దెలిపితిన్‌.
87
భుజంగప్రయాతము వినీతుండవై ధర్మ వేదిత్వబుద్ధిం | దనర్పొందు నీ విట్లు దైన్యాతిరేకం
బునం బొంది శోకాగ్నిఁ బొక్కంగఁ గుంతీ | తనూజాగ్రజుం డాత్మఁ దాఁ గుందకున్నే?
88
క. డెందము తిర్యగ్యోనుల | యందును గరుణా సమగ్రమై యుండు భవ
న్నందనుఁ డజాతశత్రున | కుం దచ్చరితంబు నీవుఁ గొంత యెఱుఁగవే!
89
మానినీ వృత్తము కావున నీ దెస నాతనికిన్‌ విముఖత్వము గల్గదు; భక్తి మెయిం
దా వినయం బెనయం గొనియాడుట దప్పదు కాంచెద వాతనిపై
నీవును నెయ్యముఁ గారుణికత్వము నెక్కొనఁ దమ్ములు నవ్విభుఁడు
న్వేవుర పెట్టుగ సంతతికల్మియ నీమది నిల్పుము పెంపొలయన్‌.
90
తే. దైవకృతము నా పంపు చిత్తమునఁ బెట్టి | పుత్రశోకంబు విడు పాండుపుత్రు లధిప
తగరె! నినుఁ గొనియాడి పుత్రత్వ వృత్తిఁ | బరఁగ నది కీర్తిధర్మసంపాది గాదె!
91
వ. వనట యనియెడు నగ్ని నెఱుక యనియెడు నీట నార్పుము. ప్రాణంబులు ధరియింపుము. సముచిత వృత్తిఁ జరియింపు’ మనిన విని చింతాక్రాంతుండై కొండొకసే పూరకుండి ధృతరాష్ట్రుఁడు తేజోధనుండగు నత్తాపసోత్తమున కిట్లనియె. 92
క. ‘మును శోకానలతాపం | బునఁ బొగులుట నొండెఱుంగఁ బోలక దుఃఖం
బున మునుఁగ వలసె నీదు వ | చనములు విని మునివరేణ్య! శాంతుఁడ నైతిన్‌.
93
క. ధరియించెదఁ బ్రాణము మది | నెరియకయుండంగ శోక మేఁ దొఱఁగెద ని
ర్భర బాంధవంబు నొందెదఁ | బురుషోత్తములైన పాండుపుత్రకుల దెసన్‌’.
94
వ. అనుటయు నమ్మహాత్ముం డట్లగుట మేలని పలికి యంతర్ధానంబుఁజేసె. నిట్లు ప్రబోధితుండై యాంబికేయుండు గొండొక ప్రొ ద్దూరకుండి సంజయుం బేరుకొని పయనం బాయితంబు సేయుమని చెప్పి, విదురుతో ‘నీవు గాంధారిని గుంతినిం దక్కుఁగల కౌరవవధూవర్గంబును దోడ్కొని రావలయు మనము పొలికలనికిం బోవుచున్న వారమని యెఱింగించి వెలువరింపు’ మనిన నయ్యిరువురు నట్ల చేసిన. 95
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )