| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
శ్రీ మత్కీర్తిమదత్యభి | రామాకృతి! సద్గుణాభిరతి! మత్పుణ్య గ్రామాకృతి! మత్సంప | త్త్యామోదిత భక్తలోక! హరిహరనాథా! |
1 |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు పాంచాలి నూఱడం బలికిన యనంతరంబ పతివ్రతాశిరోమణియు మహాభాగయు సత్యవచనయునగు నయ్యాంబికేయు భార్యకుం బారాశర్య మునీంద్ర వరప్రదానంబునం బ్రాప్తంబై తాత్కాలికం బయిన దివ్యదృష్టి విభవంబున నిజవ్రతహాని లేని తెఱంగున సంగర తలం బఖిలంబును నధికవిస్తార దూరప్రాప్తంబయ్యు నాలోకనగోచరం బగుటయు. | 2 |
| మణిగణ నికరము |
గొడుగుల పఱియలు గుఱుకులు గొనుటన్ | సిడముల తునియలు సెదరి యునికి బెం దడిగలుఁ బడగలు దఱచు మురియలై | పుడమిఁ గలయుటకుఁ బొగు లొలయ మదిన్. |
3 |
| క. |
నుఱుమైన కాల్బలంబులు | నఱవఱ లయి యున్న యట్టి యరదంబులుఁ బెం దఱచగు సూతాంగకములు | నొఱగిన రథ్యములగములు నుల్ల మలంపన్. |
4 |
| లయగ్రాహి |
రావుతుల తుండములు మావఁతుల నుగ్గుఁ దుర | గావలి శవంబులు గజావయవ రాశీ భావభయదస్థలులుఁ బ్రేవులును గండలును | బ్రోవులయి పెన్మెదడుపై విరిసి రక్త స్రావమునఁ బెల్లయిన ఠేవమునఁ జూడఁ గడు | నేవ మగుపట్ల మృతభావగతులయ్యున్ జీవములఁ బాయరొకొ? నా వికచ వక్త్రముల | తో వఱలు రాజులు మనోవికృతి సేయన్. |
5 |
| లయగ్రాహి |
హార రుచులన్ హృదయ హారితరమూర్తు లగు | వారు హరినీలమణి భారవిలసత్కే యూర బహులాంశుచయ చారుతర రేఖులగు | వారు నవవజ్రరుచిరోరు ఘృణిమత్కో టీర రమణీయులగు వారు గరుడాశ్మమయ | భూరికటకద్యుతివిహార పరిశోభా స్ఫారులగు వారలును బోరఁబడి నెత్తురులఁ | గూరుటఁ గరంబెడఁద కారటము సేయన్. |
6 |
| లయగ్రాహి |
అమ్ములును విండ్లుఁ పరిఘమ్ములును దోమర చ | యమ్ములును గుంతనికరమ్ములుఁ గనత్ఖ డ్గమ్ములు నహీన ముసలమ్ములును జక్ర నివ | హమ్ములును లోనగు నసమ్మత మహోగ్రా స్త్రమ్ములును గండలును నెమ్ములుఁ గపాలములు | సమ్మిళిత రూపశకలమ్ములయి సంగ్రా మ మ్మతుల దారుణ విధమ్మగుటఁ దెల్పుట ధి | కమ్మగు కలంక హృదయమ్మున కొనర్పన్. |
7 |
| లయగ్రాహి |
కుత్తుకలబంటి యగు నెత్తురులు దోయిళుల | నెత్తి చవిగ్రోలుచును జిత్తములు దృప్తిన్ జొత్తిలి నితాంత మదమత్తములుగాఁ జటుల | నృత్తములు సేయుచుఁ జలత్తను వికారో ద్వృత్తపటుహాసముల రిత్తలగు దుర్వచన | వృత్తులను నొండొరుల నొత్తికొని మాంసం బత్తి తినుటన్ వికటవృత్తులగు రాక్షసుల | మొత్తము పరిక్షుభితచిత్తత యొనర్పన్. |
8 |
| సీ. |
ప్రేవులు గండలు పెఱికి పేటాడి యం | గదఁగొని మెదళుల గల్చికొనుచు రాగిలి రక్తంబు ద్రావుచు లోచన | గుళికల నొలిచి మ్రింగుచును గుండె కాయ లాదట మెయిఁ గబళించుచును గ్రొవ్వు | దెమలచి నమలుచు నెముక యూట చవిగొని యానుచుఁ జావకయున్న రూ | పులు సచ్చుటకుఁ గాఁగఁ బెలుచఁ దన్ని |
|
| తే. |
కొనిన దెఱఁబాయఁ బాఱుచుఁ జెనకి తొడరి | కాటులాడుచు నున్న సృగాలములును గాకములు రాపులుఁగులును గ్రద్దలును వృ | కంబులును మానసము వికలంబు సేయ. |
9 |
| వ. | అగ్గాంధార రాజనందన కలను గలయం గనుంగొనియెఁ దదవసరంబున సాత్యవతేయుండు కౌంతేయుల రావించి ‘బంధు శవంబులకుఁ గాలోచితాచార సహితంబుగా నగ్ని సంస్కారంబు సేయుం’డని పనిచి యంతర్ధానంబు సేసె. వారు ధృతరాష్ట్రుం బొదివికొని వాసుదేవపురస్సరులయి యప్పనికిం జనుచుఁ గౌరవకాంతలఁ దత్ప్రదేశంబునకు నడపించిన నప్పడఁతులు పతులును సుతులును సోదరులును బౌత్రులును మిత్రులును గుణపంబులై పడియున్నఁ జూచి చెయ్వేది మేదిని నొఱగువారును వా విడిచి యఱచువారును బురపురం బొక్కువారును బడిపొరలుచుఁ బొగులువారును వేనలులు వీడి వెన్నుల విరియం దిరుగువారును బలవించువారును బేర్కొని యగ్గించువారును మ్రాన్పడువారును మోములుం దలలును మోఁదుకొనువారును నై రప్పు డా దుర్యోధనజనని జనార్దనుం బేర్కొని చేరంబిలిచి పరమశోకార్తయగుచు నతని కిట్లనియె. | 10 |