| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
బలశౌర్యములఁ దన పాటిగా నెందును | మానవు నొరుఁ జూపలేని యట్టి శంతనుపుత్రుఁడే శత్రులబాహు ద | ర్పంబున రణభూమిఁ బడియెఁ దన్ను వాలాయమును గెల్వవచ్చునె? ‘చంపి కొం’ | డని పాండుసుతులపై నగ్గలంపుఁ గరుణ మర్మము సెప్పెఁగాక యెమ్మెయి నైన | నతినిష్ఠ యెప్పుడు నతనియందుఁ |
|
| ఆ. |
గలదు గాదె! తండ్రి కార్యంబునకుఁ గాఁగ | రాజ్య ముడిగి పూనె బ్రహ్మచర్య మితనిఁ చెప్పి చెప్ప నితరుండు పౌరుష | కలిత సంభవుండు గలఁడె కృష్ణ. |
111 |
| క. |
కురువంశ మెడల వచ్చినఁ | బరమోపాయమున మగుడఁ బడసెన్ మడిసెం గురునికరముతోడన యి | ప్పురుషుఁడు పురుషార్థసారభూషణుఁడు గదే! |
112 |
| క. |
దేవుఁడు గా కితఁడు నరుఁడు | నా వచ్చునె? నిష్ఠపెంపునం బ్రాణంబుల్ తా వలసినపుడ విడువం | గా వేడుక నునిచి నాఁడు గాదె తనువునన్! |
113 |
| తే. |
తీవ్ర బాణజాల దీప్తులు పరఁగించి | పాండుతనయ సైన్య బహుళతమము లీలఁ బదిదినంబు లోలి వినోదించి | యకట! భీష్మభానుఁ డస్తమించె. |
114 |
| క. |
శరవణమునందుఁ బొలుపుం | బొరసిన గాంగేయుతోడఁ బోల్పఁగ ననువై శరతల్పంబునఁ దేజో | భరితుఁడు గాంగేయుఁ డొప్పెఁ బంకజనాభా! |
115 |
| తే. |
అర్జునుఁడు వెట్టె నితనికి నంపపాన్పు | నకుఁ దగంగ నిశాత బాణముల మూఁట నలవరించిన తలగడ యస్త్రజనిత | వారిఁ దృప్తునిఁ జేసె నవ్వీరవరుఁడు. |
116 |
| క. |
వీరశయనమున గంగకు | మారుఁడు కల్పక్షయమున మార్తాండుఁడు సం చార మెడలి ధరఁ బడి యొ | ప్పారెడు చందమున వెలిఁగె నంబురుహాక్షా! |
117 |
| క. |
దేవవ్రతుండు గీర్వా | ణావాసంబునకుఁ జనినయట కురునికరం బేవాని నడిగి తెలియునొ | కో? విశ్రుతధర్మ సంప్రయోగ విధంబుల్. |
118 |
| సీ. |
పగవారి మొన లను పల్లెరులం గాల్చి | మడిసెఁ గుంభజుఁ డనియెడు దవాగ్ని యెన్ని యస్త్రము లింద్రుఁ డెఱుఁగు నన్నింటను | బరిణతుం డీతండు భార్గవునకు నెట్లట్ల సువిధేయ మిమ్మహాత్మునకు ధ | నుర్వేద మితనికి సర్వవేద ములుఁ బరిచితము లియ్యలఘుతేజుని శిక్షఁ | గాదె! పార్థుఁడు కార్ముకమున మేటి |
|
| ఆ. |
యయ్యెఁ? దక్కుకౌరవాన్వయజాతులు | సాత్యకియును ని వ్విశాలబుద్ధి నాశ్రయించుటను మహాస్త్రవిత్తములైరి | యోధు లింతవార లుర్విఁగలరె? |
119 |
| క. |
వివిధ మహాస్త్రంబులు గా | లవశతఁ జెడెఁ గాక శౌర్యలంపటు నియ్యో ధవరునిఁ బగవారికిఁ జే | ర వశంబగునెట్లు సంగరంబునఁ? గృష్ణా! |
120 |
| తే. |
గురుని ము న్నిడుకొని కాదె కురుకుమారు | లనికిఁ బిలిచిరి? ధర్మపుత్రాదులయిన వాలుమగల నట్లంతటివాఁడుఁబగఱు | నఱకివైచినఁ బడియున్న తెఱఁగుఁ గంటె? |
121 |
| తోటకము |
సతతంబును శిష్యులు సద్వినయా | న్వితులై ప్రణమిల్లెడు వీరిపద ద్వితయంబు గడుంజెడఁ దిన్నవి సూ | చితె నక్కలు? దైవము చెయ్దిఁ గటా! |
122 |
| ఆ. |
ద్రుపదతనయుఁ డట్టె! ద్రోణునితలఁ గోయు | వాఁడు విధికి నెట్టివారి నెట్టి తెఱఁగు సేయ రాదు? దీనికి నేమను | వార మిది యసంభవంబు గాదె? |
123 |
| సీ. |
కృపునితోఁబుట్టువు కృపి తన భర్త ద్రో | ణాచార్యుపాల దైన్యంబు విపుల వేణియు మొగమున వెంట ముసుంగు వ | డంగ రాల్పడిన యెలుంగుతోడఁ బలవించి పలవించి బహుశిష్యు లయ్యతి | రథవర్యు నస్త్రశస్త్రములు రథము నవయవంబులును జితాకలనంబు సే | యుచు సామగానసంయుక్తవదను |
|
| ఆ. |
లగుట సూచి సామ మతికరుణంబుగాఁ దాను బాడఁజొచ్చె మానితాగ్ని సొద నమర్చి యవ్విశుద్ధాత్ము నొండొక | యగ్నివోలెఁ బెట్టి రందుఁ గృష్ణ! |
124 |
| క. |
కృపి మున్నుగ శిష్యులు సొద | యపసవ్యము గాఁగఁ దిరిగి యరిగిరి శోకా ర్తపు టొడళులతో గంగకు | నపగతశరవిద్య యయ్యె నవని కటకటా! |
125 |
| ఆ. |
సోమదత్త సుతునిఁ జూడుము సాత్యకి | దూష్యభంగి శిరముఁ దునుమ నొఱగి యున్నవాఁడు గ్రద్ద లొలిచి తినంగ నీ | సుకృతపరుని నిట్లు సూడవలసె. |
126 |
| వ. | సోమదత్తుఁడు పుత్రశోకాయత్తుండై యుండి తన్ను సాత్యకి గవిసినప్పుడు తన కొడుకునెడ నతండు సేసిన యధర్మం బుగ్గడించి గర్హించిన విధంబు మృతుండైనను మొగంబునం దోఁచుచున్నది. భూరిశ్రవు తల్లి యది యతనిని వల్లభునిఁ బొరిఁ బొరిం గనుంగొనుచు గద్గదకంఠంబుతో నా సోమదత్తు నుద్దేశించి. | 127 |
| సీ. |
ఓ రాజ! కల్పక్షయోపమానంబగు | కౌరవజాతి సంక్షయము చూడ కున్నాఁడ వధిక దానోజ్జ్వలు బహుమహా | ధ్వరకర్త భూరిశ్రవసుఁడు నీదు గారాబుపట్టి సంక్రందననందను | దుర్విక్రమంబునఁ దనుమఁబడిన బాహువు సాత్యకి పాపకర్మంబున | సంఛిన్నమైన మస్తకము నై మ |
|
| ఆ. |
హీతలమునఁ బడియె నిప్పుణ్యసంతతి | దిక్కుసూడ వేల? యొక్కమాటు కొడుకు చుట్టు నేడ్చు కోడండ్ర యలమట | యరయ విట్లు దగునె యధిప! నీకు? |
128 |
| క. |
వీ రేవు రొంటి చీరలుఁ | దారును విరిదలలతోడఁ దద్దయు నడలుం గూరి పలవించెదరు నిను | సారసికల భీతిరుతుల చందము దోఁపన్. |
129 |
| ఆ. |
ఆలమునకు వెడలునప్పు డిచ్చితి నీదు | పసిఁడి గొడుగు లసిత విభవుఁ డగుట కది నికృత్తమై పడి యున్నది | య క్కుమారు రథమునందుఁ జూడు. |
130 |
| క. |
అని పనవుచున్నయది య | వ్వనితను గోడండ్రఁ జూడ వశమే? ఘనుఁ డ ర్జునుఁ డిట్టి నీచకర్మం | బున కెట్టులు సొచ్చెనో! కుపురుషుఁడ పోలెన్. |
131 |
| కవిరాజ విరాజితము |
విను మది సాత్యకి చచ్చుట కోర్వక వీరవరుండగు పార్థుఁడు సే సిన తగవైనను నయ్యె నతం డటు చే నఱుకన్ మునియైన మహా త్మునిఁ గని యుబ్బుచు సాత్యకి యేమని త్రుంచె శిరంబు? కడంగి జగం బున నొరు లింత నికృష్టపుఁ గర్మము పొంతను బోదురె? చక్రధరా! |
132 |
| క. |
ఇక్కురువరు నాండ్రురలో | నొక్కత యతిరమ్యమూర్తి యుత్సంగమునం దక్కర మిడికొని పనవెడు | నెక్కుడువగ నూని యదె మహీధర! కంటే? |
133 |
| సీ. |
మెలుపారఁగాఁ బట్టి మొలనూలి మణులు గ | దల్చుచుఁ దిగుచుచుఁ దగులొనర్చుఁ జనుఁగవ మీఁది కల్లన వచ్చి లలిత వి | మర్దనంబున లజ్జ మరలఁ ద్రోచు నాభి యూరులు జఘనము మెత్త మెత్తన | యొత్తి ముదంబున నుల్ల మూన్చు ననయంబుఁ దిన్నని యనువున గనయంబు | ప్రిదులంగ మెలఁపి సొక్కొదవఁ జేయ |
|
| ఆ. |
నిక్కరంబు నెయ్య మెక్కింప నేరంగఁ | దగిలి సంతతంబుఁ దలఁచునట్టి భంగి మెఱయ గీడువఱుపంగఁ గొనియాడ | వలఁతి నీఱు సేయవలసె దీని. |
134 |
| ఆ. |
ఒరుని తోడఁ బోర హరి సూడ సిగ్గఱి | యేసె విజయుఁ డతని యేటు సభల న మ్ముకుందుఁ డెట్టు లగ్గించు? నట్టి వి | వ్వచ్చుఁ డేమిభంగి మెచ్చుఁ దన్ను? |
135 |
| వ. | అని యిట్లు విలాపంబు చేసి యూరకున్న దిన్నాతిం దక్కటి యెలనాఁగ లేలిన దానిఁ బొదివికొని యున్న వా రాలోకింపుము. | 136 |