| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
భూవర! కురువంశ పుంగవుం డగు ధర్మ | తనయుండు ధృతరాష్ట్రు వినయ మొప్ప మున్నిడుకొని యాఁడు మొత్తంబుఁ దోడ్కొని | బంధు జనంబులు బలసి రాఁగ నరిగి గంగాస్నాన మాచరించి తిలోద | క ప్రదానము సర్వకౌరవులకు నయ్యాంబికేయుండు నక్కురుభార్యలు | ననుజులుఁ దానును నధిక నిష్ఠఁ |
|
| ఆ. |
చేసి రతనికడకు నా సమయంబున | నడలు నెమ్మనమున నడరి క్రమ్ము కన్నునీరు మొగము గప్పంగఁ జని కుంతి | యెల్లవారు వినఁగ నిట్టు లనియె |
174 |
| తరలము |
‘వినుము! కౌరవ కోటికిం దన విల్లు పెట్టనికోటగా నని యొనర్చి, భవద్బలంబుల నన్నిటిన్ మిము నేవురం దనిపి, యంబరచారులెల్లను దన్ను మెచ్చి నుతింపఁ బా ర్థునిమహాస్త్రము బల్విడిం దలఁ ద్రుంపఁ గూలిన కర్ణునిన్. |
175 |
| క. |
జనులెల్లను రాధేయుం | డనుటను మీరలును వాని నట్టుల కా నె మ్మనమునఁ దలంతు రటుగా | దనఘ! మదీయాత్మజన్ముఁ డాతం డరయన్. |
176 |
| ఆ. |
మీకు నగ్రజుండు నాకు భాస్కరు దయ | లలితకవచకుండలములతోడఁ బుట్టినాఁడు గానఁ బోయంగ వలయుఁ ది | లోదకంబు లమ్మహోన్నతునకు’. |
177 |
| వ. | అని తదీయ జన్మప్రకారంబును దివాకరుప్రసాద ప్రభావంబును జెప్పుటయు దుస్సహంబు లగు నమ్మాటలు చెవులు సూఁడినట్లయినఁ బాండవులు పరమదుఃఖావేశంబు నొంది రందు భీమాదులు నివ్వెఱపడియుండ ధర్మనందనుండు దల్లడిల్లుచుం దల్లితో నిట్లనియె. | 178 |
| సీ. |
‘అనిలజార్జునుల మార్కొని నేర్చె నెవ్వని | యుత్సాహమూఁది సుయోధనుండు, వైదేహ పౌండ్రాది వసుధేశులెవ్వని | కడిమి సొంపున కరిగాఁపులైరి, మనసైన్యకోటి యెవ్వని బాహువీర్య సం | పద కోడి యంతంత నొదుఁగుచుండు, నద్భుతం బొనరించె నమరుల కెవ్వని | యసమాన వివిధ దివ్యాస్త్ర మహిమ. |
|
| తే. |
మమ్మునందఱ నెవ్వని మహితశక్తి | యెక్కుడై సంగరంబునఁ జిక్కుపఱిచె, నట్టికర్ణునిఁ గొంగున నగ్ని డాఁచి | నట్టు లెమ్మెయి డాఁచితో యమ్మ! చెపుమ. |
179 |
| క. |
అర్జునుఁ డొకరుఁడు దక్క ను | పార్జితశౌర్యమున నమ్మహాబాహుని వి స్ఫూర్జితరథమున కెదురై | గర్జిల్లఁగ రథికుఁ డెందుఁ గలుగునె జననీ! |
180 |
| తే. |
కర్ణుఁ దొలుచూలుగా నేల కంటి తల్లి? నీదుమంత్రంబు పరమ విషాదకారి యయ్యె మాకెల్ల నట్టి మహాబలైక | గణ్యు బ్రుంగుడుపఱుచుట కారణమున. |
181 |
| తరువోజ |
భానుపుత్రుని చావు బంధులనెల్లఁ బరమసంతాపంబు పాల్పడఁజేసె మానితబలుఁ డభిమన్యుండు పోర మడిసినప్పుడు నిట్టి మఱకువ నాత్మ మానదు ద్రౌపదేయుల నాశమునకు నుడుక దివ్విధమున నుల్లంబు ద్రుపద సూనులు ధృతరాష్ట్రసుతులును ద్రుంగుచొప్పున కిమ్మెయిఁ జొర దడల్ చాల. |
182 |
| ఆ. |
అతఁడు మాకు నన్న యని మున్న యెఱుఁగంగఁ | గన్నఁ గురుబలంబుఁ గలఁగఁబడక మనుదు మట్టులైన మనుజలోకమునకుఁ | గలుగ దడలు మాకుఁ గలుగ దడలు.’ |
183 |
| వ. | అని విలాపంబు సేసి విషాదశిథిలవర్ణంబులతో గోత్రనామంబు లుగ్గడించుచు నమ్మార్తాండనందనునకుం దిలోకప్రదానంబు సేసెఁ; దదనంతరంబ భీమార్జున నకుల సహదేవులుం జేసి రట్లు కర్ణుండు పాండవాగ్రజుం డగుట యెఱింగి గురువధూజనంబు లార్తనాదంబు లెసంగ నాక్రందించిరి; ధృతరాష్ట్రుండును గాంధారీ కుంతీ పూర్వకంబుగా నతనికి నుదకకర్మం బాచరించె; నయ్యజాతశత్రుండా దినేశపుత్రునివలని సౌభ్రాత్రంబువలనఁ బరిచారికాసమేతంబుగాఁ దద్భార్యల రావించి గారవించి యతనికై యనేక విధ పుణ్యకర్మంబులు భూరిదక్షిణంబులుగాఁ ననుష్ఠించి కృతకృత్యతానందంబు నొంది సకలబంధుసహితంబుగా గంగాసముత్తరణం బాచరించె - నని యిట్లఖిలజనాభినందితుండగు ధర్మనందనుండు గర్ణుం దమయన్న యని యెఱింగిన తెఱంగు వైశంపాయనుండు జనమేజయున కెఱింగించిన నజ్జనపతి ‘కురువంశ్యుండగు నయ్యుథిష్ఠిరువర్తనం బటమీఁద నెట్లు సెల్లె?’నని యడుగుటయు. | 184 |