పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము
గాంధారి శ్రీకృష్ణునకు శాపం బిచ్చుట (సం. 11-25-36)
సీ. పూని పాతివ్రత్యపుణ్యఫలంబున | సంపాదితంబైన సారతపము
బలిమి సాధనముగాఁ బలికెద నుత్తమ | జ్ఞాతులఁ దమలోని సంగరమునఁ
బొలియఁజేసితి గాన పొలియుదు రన్యోన్య | ఘాతుకులై భవద్‌ జ్ఞాతిజనులు
నీవును దప్పక నేఁ డాదిగా ముప్ప | దాఱగు నేఁడైన యద్దినమున
 
తే. నరయ దిక్కెవ్వరును లేని యగ్గలంపు | గుత్సితంపుఁ దెఱంగునఁ గూలువాఁడ
విట్లు మీ వధూజనములు నేడ్చువారు | పతుల సుతులను బంధులఁ బనవి పనవి.’
161
క. అని ఘోరంబుగఁ బలికిన | విని విపులమనస్కుఁడైన విష్ణుఁడు చిఱున
వ్వున నానన మొప్పఁగ న | వ్వనితకు ని ట్లనియె గౌరవస్తుత్యముగన్‌.
162
తే. ‘మున్నకాదె యాదవులకు మునివరేణ్య | కలిత దారుణ శాపంబు గలదు నీకు
నేల చర్వితచర్వణమిట్లు సేయ? దీన నీవేమి త్రవ్వితి? దానిఁ జెపుమ!
163
క. యదువంశజాతులకుఁ ద | ప్పదు నాశము వారి సురలుఁ బరిమార్పఁగ లే
రది కారణంబు గాఁగఁ దె | గుదు రొండొరుచేత రణము ఘోరత్వమునన్‌.’
164
తే. అనిన పలుకులు విని పాండుతనయు లెదలు | వెఱపు పెంపున గంపింప విహ్వలించి
యాత్మజీవితములదెస నాస లపుడు | వదల విడిచిరి కౌరవవంశవర్య!
165
వ. ఇట్లు పలికిన యచ్యుతుం డద్దేవి నుద్దేశించి ‘లేవమ్మా! మృతులైన సకల బంధుమిత్రులకు నగ్నికార్యంబులు సేయింపవలయు’నని వెండియు. 166
సీ. ‘వినుము గాంధారి! నీ తనయుండు చేయు దు | ర్నయము లెఱుంగవె? నాకు నీకు
శాంతనవునకు నాచార్యునకు బాహ్లి | కునకుఁ దండ్రికి మాన్పఁ గొలఁది గాని
దుర్మానమున నట్లు దొడరి యి ట్లయ్యె మీ | యపరాధమున వచ్చినట్టి కీడు
నకు నింత నొవ్వంగ ననుఁ బల్కఁ దగునె? యు | మ్మలికంబు ధృతిఁ బట్టి మాన్పు మింకఁ
 
తే. జేటునకుఁ జావునకు వగఁజెందు జనుల | కినుమడింపదె మానసమున నలంత?
రాచ కూఁతుండ్రు సుతుల సంగ్రామ నిరత | హృదయులగు వారిఁ గాంచఁ గోరుదుర కాదె!’
167
వ. అని చెవి సూఁడినట్లు పలికిన విని నిరుత్తరయై గాంధారి యూరకుండె నట్టియెడ ధృతరాష్ట్రుండు ధర్మనందనుతో ‘నీవు మన మొనలంగల జనులకొలంది యెఱుంగుదు చచ్చినవారి లెక్క దలంతేని నా కెఱిఁగింపు’ మని పల్కిన విను మెఱుకపడ్డవా రుత్తమ జనంబులు డెబ్బది యాఱుకోట్లు నిరువది వేలును మ్రుక్కడి మూఁక యిరువది నాలుగువేలు మున్నూట యిరువండ్రుఁ దెగిరని చెప్పిన నమ్మనుజపతి ‘వీరిందఱు నేగతికిఁ బోదు?’ రనుటయు. 168
తే. ‘ఎవ్వ రాత్మదేహములు సమిద్ధమైన | యస్త్రవహ్ని వేలిచిరి వా రమరలోక
మునకుఁ జని నిర్జరాంగనాజన విలసితుఁ | డైన యమరేంద్రునకుఁ బూజ్యు లగుదు రధిప!
169
క. తఱచుగ శస్త్రాస్త్రంబులు | నెఱఁకులు దూఱినఁ జలించి నిజధైర్యంబుల్‌
మఱచి తెఱలి చచ్చిరి కొం | దఱు గుహ్యకగతికిఁ బోవఁ దగుదురు వారల్‌.
170
క. సమరమున నెత్తెఱంగున | సమసిననుం గీడుతెరువు చన రుత్తమ లో
కమునకుఁ బోదురు జనములు | ప్రముదితులై యండ్రు బుధులు పౌరవముఖ్యా!’
171
క. అనిన విని ‘ నాథవంతులు | ననాథులును నైన వీరి కందఱకుఁ గృపా
ధనలోల! చేయఁగా వ | చ్చున కాదే యగ్నికార్యశోభనముఁ దగన్‌?
172
వ. అని పలుకుటయు ధర్మనందనుం డిట్లను ‘నీ యఖిల జనంబులు నాహితాగ్నుల యట్ల యట్లుంగాక వీరలిందఱ కుదకదహనక్రియాకరణయోగ్యులును లేరు మన మేది కొలఁదిగా నిప్పని సేయుద’మని పలికి తా రజ్ఞాత వాసంబు నిర్వహించి సముచిత ప్రకారంబున విరాటాదులచేతం బరిజ్ఞాతులైన సమయంబున సంగతుండై యది మొదలుగాఁ జెల్లెడు శాంతిక పౌష్టికాది శ్రౌతస్మార్తక్రియాకలాపంబులు నడపుచుం దమయొద్దనున్న ధౌమ్యునాలోకించి విదురుని సంజయునిఁ గనుంగొని ‘మీరు భరతకులులకుందక్క ననాథవంతులైన వారలకు విధ్యుక్తంబుగా నగ్నిసంస్కారంబు సేయుం’డని పనిచి యత్తెఱంగునకుం దోడుపడుటకై సూతజనంబులను దత్కాలసమాగతులైన కరిపురజనంబులోనం దగువారి నిరూపించి మున్న తెప్పించిన చందనాగురుఖండ క్షౌమవసన కస్తూరికాకుంకుమఘృతతైలప్రభృతులగు వలయువస్తువు లా ధౌమ్యముఖ్యుల కొప్పించిన వా రయ్యవసరంబునం గూడికొనిన బహుబ్రాహ్మణ సంఘంబులతోఁ జని దుర్యోధన దుశ్శాసనకర్ణశల్యాదులకు నభిమన్యుఘటోత్కచవిరాటధృష్టకేతుప్రముఖులకును దక్కును బే రెఱుకపడు నానాదేశాధీశులకుం బ్రచురకాష్ఠ సంచయంబులను భగ్నరథావయవ ధ్వజ ధనుశ్శరకుంతాదులను సొదలు వేర్పించి పితృమేధ క్రియలు నడపి చిచ్చునం జొనిపి యనాథవంతులైన భూకాంతుల ననేక సహస్ర సంఖ్యులం బ్రోవులుగాఁ బెట్టించి సమగ్రదారుసముదయంబు లమర్చి యగ్ని యిచ్చి రప్పుడు ఋగ్యజుః పఠన రవంబులును సామగాన నాదంబులును రమణీరోదన ధ్వనులును రోదసీకుహరంబు నిండె ధూమంబున దిక్కులు పిక్కటిల్లెఁ జేతనభూతంబులకెల్ల విపులవిషాదం బావహిల్లె నవ్విధంబునం దగవు నడిపించి. 173
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )