పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
ధృతరాష్ట్రుండు విదురుతో శ్రీకృష్ణు రాక సెప్పి సంతోషించుట (సం. 5-84-20)
క. ‘వివిధ మణిమయ రథంబులు | జవనాశ్వంబులును భద్రసామజములు ర
త్న విభూషణములు దాసీ | నివహంబులుఁ జాలఁ గృష్ణునికి నే నిత్తున్‌.
156
క. మన యింట సుయోధను గృహ | మున దుశ్శాసను నికేతమున నెయ్యది యా
తని చూడ్కి కించు నదియె | ల్లను గౌరవమొప్ప నీవలయు మన మనఘా!’
157
చ. అన విని యాతఁ డిట్లనియె ‘నంబుజనాభునిఁ బ్రీతుఁ జేయు కం
టెను హితమైన కృత్య మొకటిం గలదే? యది మేలు; పాండునం
దనులకు నైదయూళ్ళు లుచితస్థితి నిచ్చుట కోపమన్న యు
న్కిన యిటు లోపు కల్మి ధరణీవర! యేమిట వచ్చెఁ జెప్పుమా!
158
ఉ. నీ తలఁ పేను గంటి నొకనేర్పున శౌరికి లంచమిచ్చి సం
ప్రీతునిఁ జేసి, కార్యగతి భేదము సేయఁగఁ జూచె; దింత బే
లైతిగదే! సుమేరు సదృశార్థముఁ జూచియుఁ బార్థుఁ బాయునే?
యాతఁడు? క్రీడి భక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే?
159
తే. అర్జునుఁడు ప్రాణతుల్యుండు హరికి నట్లు | గాన జలపూర్ణ మంగళ కలశమునకుఁ
బాద్యమునకును గుశలసంప్రశ్నమునకు | మిగుల నొండు జనార్దను మెచ్చుగాదు.
160
క. మన కడకు నేమి కార్యం | బునకై యాతండు వచ్చెఁ బూనికిమెయి నా
పని వంచింపక చేయుట | విను మతనికిఁ బ్రియము; తక్కువేయును నేలా?’
161
వ. అనిన విని దుర్యోధనుండు దండ్రి కిట్లనియె: 162
క. ‘అది విదురు చెప్పినట్టిద | తుదిఁ గృష్ణుఁడు పాండుసుతులతో వేఱగునే?
పదనెఱుఁగ కీఁగియిచ్చిన | బెదరి రనరె యొచ్చెమైనఁ బిమ్మట నగరే!
163
ఆ. అతఁడు పూజనీయుఁ డగు; నే నెఱుంగుదు; | నైన ధనము లీఁగి యనదతనము
వచ్చుఁ; బెచ్చు పెరిఁగి వైరులు గర్వింతు; | రేల పగ యడంగు నిట్టులైన?’
164
క. అనవుడు భీష్ముఁడు ధృతరా | ష్ట్రున కిట్లను ‘నీవునుం గొడుకు నేమే ని
చ్చిన నొకటి యీగి లేకు | న్నను వేఱొక్కటి దలంచునా కేశవుఁడున్‌.
165
క. విను, మతఁడు సేయఁబూనిన | పని దప్పింపంగరాదు పాండవులం దే
ర్పను గృష్ణుఁడు వెరవుగఁ జొ | చ్చిన మే లాపురుషు పనుపు సేయుము పుత్త్రా!
166
క. నారాయణుండు ధర్మా | ర్థారూఢము గాఁగఁ బలుకు నది నీవును నీ
వారును గైకొని యెంతయు | గారవమునఁ జేయ నెల్ల కార్యంబు నగున్‌.’
167
క. అనుటయు సుయోధనుఁడు భీ | ష్మున కిట్లనుఁ ‘బాండురాజు సుతులకు నిమ్మే
దిని హరి సగపా లీఁ దగు | ననుఁ బో, యే నీను, గాని యది యట్లుండెన్‌.
168
వ. వేఱొక కార్యంబు సేయం దలంచితి; నది వినుము! పాండవులకు నేడుగడయు జనార్దనుం; డతనింబట్టి బంధించిన ఱెక్కలు విఱిగిన పులుఁగులుం బోలె వారు నాకు విధేయు లగుదురు; పాంచాల యాదవాదులైన తదీయ బంధు మిత్రులు నా వశంబున వర్తిల్లుదురు; సమస్త దేశంబులు నేన యేలుదు; దీనికిం దగిన యుపాయ సహాయంబు లనువు సేసెద; నీవింక నేమి సెప్పెదవు చెప్పుమనిన విని యతిఘోరంబగు నవ్విచారంబునకు నమాత్యసహితంబుగా సంతప్తచిత్తుండై వైచిత్రవీర్యుండు కొడుకున కిట్లనియె: 169
క. ‘ఓహో! యిట్లనుట జగ | ద్ద్రోహం; బిమ్మాట మఱవు; దూతత్వంబున్‌
మాహాత్మ్యంబును ధర్మో | త్సాహంబును విను మబాధ్యతకుఁ గారణముల్‌.
170
క. ఈ కారణములు గలవను | నా కొలఁదియె వాసుదేవుఁ? డదిగాకయుఁ గీ
డే కురువంశమున కతని | రాక? యతం డేమి సేసెరా పాపాత్మా!’
171
వ. అని యదల్చె నప్పుడు గాంగేయుం డాంబికేయున కిట్లను ‘నీ కొడుకు ప్రాణగొడ్డంబైన కార్యంబు సేయందలంచె దామోదరు నిట్లు సేయం జూచెనేనిం దానును దనవారును వినాశంబుఁ బొందుదు; రింతియ; యిది సేసిరి సేయరైరి యమ్మహాత్మునెడ నీయపరాధంబు విచారించిన దుష్టాత్ములు నష్టాత్ముల కాక, యని పలికి యేనిట్టిదాని వినంజాల’ ననుచు మొగంబు గంటువెట్టుకొని దిగ్గన లేచిపోయె, ధృతరాష్ట్రుండును దుర్యోధనునితో ‘నిటువంటి కొఱగాములు మనంబునం దలంచినప్పుడు సేయంగలవాఁడవు గావున దీనం జేటువచ్చు నుడుగుమయ్య’ యనిచెప్పి యతనిం దక్కినవారినిం బోవంబనిచి తగిన వర్తనంబున నుండె; మఱునాఁడు. 172
సీ. కాలోచితములగు కరణీయములు దీర్చి | కమలనాభుఁడు రేపకడయ కదలి
తనుఁ గుశస్థలవాసు లనుప రా నందఱ | నాదరంబున నిల్పి యరుగునపుడు
గజ్జంబులును బండ్లు గంధమాల్యంబులు | ధృతరాష్ట్ర సుతుఁడు పుత్తేరఁ బ్రీతి
నెడ నెడఁ గొనివచ్చి యిచ్చిన వాని నె | ల్లను వేడ్క ననుభవించిన విధంబు
 
తే. సలిపి, యనుభవ మొల్లక చనఁగ, నెదుర | బాహ్లిక ద్రోణ భీష్మాది బంధుమిత్త్ర
గణము సర్వభూపాల లోకంబుఁ గురుకు | మార వర్గంబుఁ బుత్తెంచె మనుజవిభుఁడు.
173
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )