పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రుని మందిరంబునకుఁ బోవుట (సం. 5-87-1)
వ. ఇట్లు దుర్యోధనుం డొక్కరుండు దక్కనెల్లవారిం దూర్యాది శోభన పదార్థంబులు సమకట్టి ధృతరాష్ట్రుండు వనుప నెదుర్కొనిన వాసుదేవుండు వారల నందఱ నయ్యైతెఱంగుల సంభావించి, కృతవర్మ దమవాఁడు గావున నతనికి సవిశేష స్నేహంబు సేసి, యతండు సేరువరా సమస్త జనంబులుం బరివేష్టింపం జని తన రాకకు నలంకృతంబును బ్రమోద చాపల సుభగ జనంబును నైన పురంబు సొచ్చి, రాజమార్గంబున నరుగు నవసరంబున మౌక్తిక మిళితంబులు బహుగంధ లుళితంబులు నగు నక్షత ప్రకరంబులును బుష్ప నికరంబులునుం జల్లుచు సంతసిల్లుచు మ్రొక్కుచుఁ జొక్కుచు నిరుగెలంకుల రమ్యహర్మ్యంబులపై నిలిచి పొలిచి కనుంగొను నంగనాజనంబులు తమలోన. 174
సీ. ‘ప్రాణంబుతోఁ గూడ రక్కసి చన్నుల | పాలు ద్రావిన ప్రౌఢబాలుఁ డితఁడె!
వ్రేల్మిడిఁ జాణూరు విఱిచి లోకముల మె | చ్చించిన యా జగజెట్టి యితఁడె!
దుర్వృత్తుఁడగు కంసుఁ దునిమి యాతని తండ్రిఁ | బట్టంబు గట్టిన ప్రభు వితండె!
సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గల | కోర్కిఁ దీర్చిన రసికుం డితండె!
 
తే. వెన్నలును గోపికాచిత్త వృత్తములును | నరసి మ్రుచ్చిల నేర్చిన హరి యితండె!
శ్రుతిశిరోభాగములఁ దన సుభగచరణ | సరిసిజామోదమును గూర్చు చతురుఁ డితఁడె!
175
వ. అనుచు నతి కుతూహలంబున నవలోకింప నాబాలవృద్ధంబగు పౌరలోకం బాలోకన కౌతుకంబునఁ దన రథంబు గదిసిన సందడి జడియు వేత్రహస్తుల వారించుచు నారాయణుండు సమ్మర్ద మందగమనంబునం జని మణితోరణ సుందరం బగు రాజమందిర ద్వారంబు ప్రవేశించి కక్ష్యాంతరంబులు గడచి యేనుంగు మొగసాలఁ జొచ్చి యరదంబు డిగ్గి యల్లన నడచునప్పు డంతకు మున్నయరిగి భీష్మద్రోణ ప్రముఖులగు తగు వారలు ధృతరాష్ట్రునిం బొదువ నతండుఁ బ్రత్యుత్థానంబు సేసి విదుర సంజయ సహితంబుగా నెదుర్కొనం జేరి. 176
ఆ. అతనిఁ గౌఁగిలించి యచ్చటఁ గల విదు | రాది శిష్టజనుల నాదరార్ద్ర
బంధు దృష్టిఁ జూచి పరిరంభ సంభావ | నము లొనర్చి శౌరి ప్రమద మెసఁగ.
177
వ. వార లందఱకును సాత్యకిని దగిన సమాచారంబులు నడపం బనిచె; నటమున్న ధృతరాష్ట్రు పనుపునం దెచ్చి పెట్టిన నచ్చోటన యున్న యున్నత కనకాసనంబున నతం డునుప నాసీనుం డయ్యె; నవ్వాసుదేవునకు విహితానుష్ఠాన పరాయణు లగు నగరి పురోహితులు రాజానుమతంబున నర్ఘ్యపాద్య మధుపర్కాద్యుపచారంబు లాచరించి యతని తమ్ముని నర్హపీఠంబున నునిచి యర్చించిరి; నరనాథుండును దొరలును నిజోచితాసనంబుల నుండిరి; కొలువెల్లను సూర్యోదయ సమయంబునఁ గమలాకరంబు విధంబున వికసించి యుండె నయ్యవసరంబునఁ గృష్ణుండు ధర్మనందను వచనంబులుగా నాంబికేయునకుం దగువారలకుం బ్రణామ పరిరంభణ ప్రముఖ సముచిత సంభావనంబులు వలికి సంభాషణంబులకుం జొచ్చి. 178
క. రాజునకుఁ దియ్య మెసఁగెడు | పూజా వచనముల నెయ్యపుంబలుకులఁబే
రోజ మెయి బంధుమిత్ర స | మాజములకు మేలములఁ గుమారులకుఁ దగన్‌.
179
వ. ఇంపు వుట్టించుచుఁ గొండొకసేపు నిలిచి పుండరీకాక్షుండు విదురు సదనంబునకుం జనియెద మఱియుఁ బోవలయు నెడలకుం బోయి వచ్చెద’ నని పలికి యాంబికేయుననుమతి వడసి యరుగ, విదురుండు ససంభ్ర మంబునం గడచిచని మంగళోపచార సహితంబుగా నెదుర్కొని భయ భక్తి వినయ స్నేహానందంబులఁ గందళితుం డగుచు గోవిందునకు దేవోపచారంబుల ననేక ప్రకారంబుల నర్చన లిచ్చి, కౌంతేయుల కుశలం బడిగిన నతనికి వారలవృత్తాంతంబు సమస్తంబును సవిస్తరంబుగాఁ జెప్పిన యనంతరంబ. 180
క. ముదమునఁ గృష్ణుఁడు కుంతీ | సదనమునకుఁ జనియె; నపుడు సమ్మదమున న
వ్విదురుం ‘డోగిర మొనరిం | చెద’ నని తన్నడుగ ‘నట్ల చేయుం’ డనుచున్‌.
181
వ. చని కాంచిన నద్దేవియు నతని తోడు నీడయుంబోని తన కొడుకులం దలంచి యడలు వుట్టిన నమ్మాధవు మెడ వట్టికొని యెలుంగెత్తి యేడ్చిన, నతండు సంబోధించి యూరార్ప నెట్టకేలకు నుడిగి యాతనికి నాసన విన్యాసనాద్యుపచారంబులు చేయించి తత్సమీపంబున నుచిత పీఠంబునం గూర్చుండి గద్గద కంఠంబుతో నిట్లనియె. 182
సీ. ‘నీ శిక్షఁ బెరుఁగుట నీతిమంతులుఁ బుణ్య | పరులు శూరులు గదా పాండుసుతులు
సుఖవృత్తిఁ బెక్కండ్రు సూరెలఁ గొలువ నుం | డెడువార లిడుమలఁ బడుచు నిర్జ
నంబైన కానలోనన యెట్లు నిలిచిరి? | ననుఁ బెట్టి నాయెదఁ గొనుచుఁ జనిరి
యేను వడ్డింపంగ నింపారఁ గుడిచి మె | త్తని సెజ్జ నిద్రించి వినుతభద్ర
 
తే. గాన కరి బృంహితముల మేల్కాంచునట్టి | వారు కందమూలంబు లాహారములుగఁ
బొదలఁ బుట్టలఁబడి యుండి పులుఁగు మెకము | లఱవ మేల్కనుచుండిరే యక్కటకట!
183
ఆ. తండ్రిలేని ప్రజలు తల్లిని బాసి పె | ద్దయునుగాల మివ్విధమునఁ బడిరి
భంగపాటు దుఃఖపాటును సంకట | పాటు గలిగె విరటు పాలఁ బిదప.’
184
వ. అని వెండియు. 185
ఉ. ‘దానదయాపరుం డయిన ధర్మతనూభవు సేమ మెట్లు? పం
చాననవిక్రముం డగు బకారికి భద్రమె? యస్త్ర శస్త్ర వి
ద్యానిపుణుండు క్రీడి సుఖియా? వినయాభరణుల్‌ గవల్‌ సమా
ధాన సమేతులే? యకట! ద్రౌపది సాధ్వి; సుఖంబె దానికిన్‌?
186
చ. కొడుకుల కంటె నయ్యనుఁగుఁ గోడలి కెక్కుడు గూర్తుఁ గోడలుం
గొడుకులు సేయు భక్తి కట కోటి మడుంగులు భక్తి నాకు నె
ప్పుడుఁ దగఁ జేయుచుండు నది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొ
త్తడి సకలంబుఁ జూడ సభ దైన్యముఁ బొందుట సూచి పొక్కితిన్‌.
187
తే. నాఁడు ద్రౌపది వడిన బన్నములు సూడ | నోర్చినప్పుడ యెంతకు నోర్వఁ జెపుమ
యంత గడచిన దుఃఖంబు లనుభవింపఁ | గలవె లోకంబువారికిఁ గమలనాభ!
188
వ. అట్టి యెడ. 189
క. విదురుం డొక్కఁడు దక్కఁగ | సదస్యు లెవ్వరును ధర్మసంక్షయ మిది కూ
డదు నార; యతని శీలమ | కుదు రీ లోకమున కింతకుం దలఁపంగన్‌.”
190
వ. అని యివ్విధంబునఁ గృష్ణుతోడఁ దన యుమ్మలికంబు లన్నియుఁ ద్రవ్వికొని శోకంబు వెల్లిగొనఁ గొండొక దిగం బాఱెడు చిత్తంబుతో మఱియు నిట్లనియె; 191
క. ‘ఇది యెల్లను నొకతల; యీ | పదు మూఁ డేఁడులును నాకు బావకొడుకుచే
నదయమగు కూడుగుడుచుట | యది యొక తలయయ్యె; నేమి యనఁగల దనఘా!
192
క. తన్నుఁ దన తమ్ములను నా | కన్న కొడుకు లట్ల తలఁతుఁ గాని విభేదం
బెన్నఁడు నా మది లేమికి | వెన్నుఁడ దైవంబు సాక్షి వినుము పలికెదన్‌.
193
క. ఇది నిక్కం బగునేనియుఁ | దుది నీవుం బాండవులను దురితరహితులై
ముదమందఁ జూడఁగనియెద; | నది దీనికి మందు సువ్వె యంబుజనాభా!
194
సీ. బావ యొప్పం డనుపలుకుల నేమగు? | నాతని కొడుకుఁ గీడాడనేల?
కురువృద్ధుఁడగు బాహ్లికుని దూఱ నేటికి? | భీష్మునిపైఁబ్రయి వెట్టనగునె?
యిట్టి క్రూరుల యింటి కిచ్చిన మనవారి | నందుఁగా కట్లు దాననుటమేలె?
యర్జును పుట్టిన యప్పుడు ‘వీఁడు లో | కము లెల్ల గెల్చు పొగడ్త మొగులు
 
తే. ముట్టు నట్టిద యగు, రణమున జయించు | గౌరవుల; సోదరులుఁ, దాను భూరి రాజ్య
గౌరవముఁ బొందు’ నని యశరీరవాణి | వలికె; నది తిట్టువడుఁగాక వలయునేని.
195
వ. ధర్మంబు గలుగునే నది నిక్కంబయ్యెడు; దాని కెల్లను నిర్వాహకుండవు నీవు గలవు గాదె! నీ మన్నించు నెచ్చెలులకుం జెప్పెడు మాటలు గలవు విను; మయ్యుధిష్ఠిరునితో నిట్లనుము; 196
క. వేఁడికొని కృపణులై కను | పోఁడిమి యది యేల రాజపుత్రులు దమ మై
వాఁడిమి దప్పిన నిప్పులు | వేఁడిమి సెడినట్లు జనులు విని యులుకుదురే?
197
వ. భీమార్జునుల కిట్లని చెప్పుము: 198
ఆ. కొడుకుఁ గాంచు రాచకూఁతు రెద్దానికి? | నట్టిపనికి నుచితమైన సమయ
మొదవెఁ; దడయుటింక నొప్పదు; జనములు | నట్లుగాని పురుషు లనరు మిమ్ము.
199
క. భుజ బలమున జీవించుట | నిజధర్మము మెత్తఁబడుట నింద్యము; మాద్రీ
ప్రజలకుఁ జెప్పుము ద్రుపదా | త్మజఁ గార్యం బడుగుమనుము తగనందఱతోన్‌.
200
చ. అలిగిన భీమ ఫల్గునుల కడ్డము లేమి యెఱుంగు; దంతలం
తలు వడి వాని నీఁగవలదా? విను మాపని కెల్లఁ బాండుపు
త్త్రులె కలవారు; నీ కెటుల దోఁచిన నట్టులు సేయువారు గా;
కలఘువిచార! నా యలఁత యార్పుము; నన్‌ గడతేర్పు మెమ్మెయిన్‌.’
201
వ. అనినఁ గృష్ణుండు గొంతి ననునయించి యిట్లనియె: 202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )