పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు పరశురామునితో యుద్ధము సేయుట (సం. 5-180-18)
క. శరవర్షము నామీఁదం | గురిసిన నే నాకసమునఁ గుదియించితి నా
యరదంబు పొంతకును న | చ్చెరువుగ నొక బాణమైనఁ జేరకయుండన్‌.
316
క. ఒక మొగి నఱువది యమ్ములఁ | బ్రకటబలుండైన పరశురాముఁడు నా యం
గకములు దాఁకఁగ నశ్వ | ప్రకరము నోనాఁట సూతుపైఁ బడ నేసెన్‌.
317
క. దానికి నవ్వుచు వేగం | బే నొక భల్లంబు దొడిగి యేసితి సాంద్ర
జ్యానాద భరిత రోదసి | యైన తదీయోగ్ర చాప మఱిముఱిఁ దునియన్‌.
318
ఉ. ఒండొక విల్లు పుచ్చికొని యుజ్జ్వల రోష మహానలార్చు లొం
డొండ మొగంబుపై నెగయ నుర్వి చలింప గుణధ్వనిన్‌ సము
ద్దండతఁ దీవ్ర మార్గణ శతంబున నా యరదంబు ముంచె రా
ముండు వియచ్చరప్రకరముల్‌ వెఱఁగందుచుఁ బ్రస్తుతింపఁగన్‌.
319
క. ఉఱక మదీయాంగంబులు | గిఱికొన నట్లేయుటయును గినుక గదిరినన్‌
మెఱుఁగారు నారసమ్ములు | దఱచుగ నించితిఁ గడంగి తద్గాత్రమునన్‌.
320
తే. ఉచ్చిపోయిన యేటుల నొలుకు శోణి | తమున సర్వాంగకంబులుఁ దడిసి యొప్పెఁ
జిగురుఁదఱుచునఁ గెంజాయ మిగిలి చెలువు | వడయు క్రొమ్మావిచాడ్పున భార్గవుండు.
321
క. నెత్తురు వడిసిన మూర్ఛా | యత్తుండై సొగయుటయును నాతనిఁగని యు
ద్వృత్త క్షత్రియ ధర్మో | పాత్తంబగు తేజ మొల్లఁబాటై తోఁచెన్‌.
322
వ. అప్పుడు మనంబున నన్ను నేన గర్హించుకొనుచుండితి. 323
ఆ. అంతఁ దెలిసి రాముఁ డతికుపితాత్ముఁడై | యేఱువాఱుతెంచు నెసకమెసఁగ
నప్రమేయశరము లడరించె; నవి సత్వ | రముగ నేను బ్రతిహతములు సేసి.
324
క. మరుదస్త్ర మేయ గుహ్యక | శరమున వారించె నతఁడు; సరభసముగ ను
ద్ధుర శిఖి బాణం బేసిన | గురుఁడు వరుణ విశిఖ నిహతిఁ గుదియం జేసెన్‌.
325
క. ఇమ్మెయి నతఁడును దివ్యా | స్త్రమ్ములు నామీఁద నేయ రయమునఁ బ్రతి ఘా
త మ్మొనరించితి దివిజగ | ణ మ్మంబర వీథిఁ గీర్తన మ్మొనరింపన్‌.
326
తే. రాముఁ డంత్యకాలానలో ద్దామ లీల | మండి నా యురస్స్థలి యొక్క మార్గణమున
నేసె నంతంత నున్న మునీశ్వరులును | గాశిరాజ కన్యకయును గడఁగి యార్వ.
327
క. ఆ నిశితాస్త్రం బెయ్యది | యో నాకుం దెలియ; దది మహోగ్రత నాఁటం
గా నొచ్చి పడితి నరదము | పై; నప్పుడు సూతుఁ డచటు వాపె రథంబున్‌.
328
తే. చేతనుఁడ నయి యేను మత్సూతుఁ గినిసి | రాముఁ డున్నెడ కప్పుడు గ్రమ్మఱంగ
రథముఁ దోలించి బాణపరంపరా ని | మగ్నుఁ జేసితి నంబ నెమ్మనము దలఁక.
329
వ. ఇట్లు బహు ప్రకారంబులం బోరుచుఁ బ్రొద్దు గ్రుంకినప్పుడు రణం బుపసంహరించుచు, రేపకడ దొడంగుచుం బెనంగ నిరువది దినంబులు చెల్లిన, మఱునాఁటి కయ్యంబున నేనునుం గడంగి. 330
క. కడు బెట్టిదముగఁ గదియం | బడి హయములు నొవ్వ ధనువు భగ్నంబుగఁ జే
డ్పడి సారథి దెరలఁగఁ దన | యొడలు సిరుఁగ నేసినను మహోద్ధతి గురుఁడున్‌.
331
క. ఒక శక్తి వైవ నఱకితి, | నకుటిలముగ శక్తి దశక మడరించిన స్రు
క్కక త్రుంచితి, బహుశక్తుల | నికరము పరఁగించినం దునిమితిం బెలుచన్‌.
332
క. విస్మయము నొందు భార్గవు | నస్మత్కర మపుడు లాఘవారూఢముగా
సస్మితుఁడ నగుచుఁ బటు దీ | ప్తి స్మేరాస్త్రముల నేసితిం బరవశుఁగాన్‌.
333
వ. ఇ ట్లతండు మూర్ఛిల్లిన మునిజనంబులును నంబయు నధిక శోకసమాకులత్వంబు నొంది హాహా కారంబులు సెలంగఁ బొదివి రంత. 334
ఆ. తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నారాచ | పంక్తి గురిసి నన్నుఁ బారవశ్య
మంది నేల కొఱగునట్లుగాఁ జేసి మ | త్సూతు మస్తకంబుఁ దునియ నేసె.
335
వ. అట్టియెడ నెనమండ్రు విప్రులు సమానవయోరూపంబుల నొప్పు వారలు నన్నెత్తి, సేదదీర్చి రథంబు పయింబెట్టి, గగన గమనంబునం బోయి; రంతకు మున్న మందాకిని మున్ను నాకన్న చందంబున నొగలపయినుండి మదీయ రథ్యంబుల పగ్గంబులు ధరియించి యున్న నేనునుం గనుంగొని నమస్కరించిన దీవించి చనియె; వెండియు. 336
క. సారథ్యంబును జేయుచు | ధీరత వాటించి రామదేవుని తోడం
గ్రూరాస్త్రంబుల సమర వి | హారం బొనరించితిని సురావలి వొగడన్‌.
337
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )