| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ఇవ్విధంబునం బోరి సూర్యాస్తమయం బగుటయు నెప్పటియట్ల చని యే నా రాత్రి యేకాంతంబున దర్భశయనంబున నుండి సురభూసుర వర్గంబులం దలంచి భక్తిం బ్రణామంబులు సేసి ‘పరశురాముని జయింపరా దయ్యెడు, దినంబులు పెక్కులు సనియె, నతని నాజి జయించుటఁ గలుగునేని మీరు నాకుం దోఁచి యూఱడింపవలయు’ నని ప్రార్థించి నిద్రించుచుండం బవలు నన్నెత్తి రథంబుపయిం బెట్టిన యెనమండ్రునుం బ్రభాత సమయంబునం గలలోన వచ్చి. | 338 |
| తే. |
నీవు నేమును నొక్కటి; నీకు వెఱవ | నేల గాంగేయ! రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు | నిచ్చిపోయిరి క్రమ్మఱ నెక్కడేని. |
339 |
| వ. | ఏను మేలుకాంచి సంతోషించి తన్మంత్ర స్వరూపంబును బ్రయోగోపసంహార ప్రకారంబులును జిత్తంబున నిలిపికొనుచుఁ గాలోచితకృత్యంబు లాచరించి యొక్క సారథి నంగీకరించి, యరదంబు పూన్పించి, సన్నద్ధుండనై సత్వరంబుగా సమరంబున కరిగినం బరశురామదేవుండు. | 340 |
| క. |
నిన్న యఱసచ్చి పోయితి | వున్న యఱయు నేఁడు దీర్చి యుడిపెద నీ గ ర్వోన్నతి; యిం కెట వోయెదు | నన్ను నెఱుఁగ వెట్టు?’లనుచు నాపైఁ గవిసెన్. |
341 |
| క. |
కవిసినఁ గడంగి పెల్లుగఁ | గవియించితి నంపవెల్లిఁ గడుఁ గ్రూరత భా ర్గవుఁడును మద్గాత్రంబున | వివిధాస్త్ర ప్రతతి నించి వెగ డొందించెన్. |
342 |
| వ. | ఏనుం గోపించి. | 343 |
| తే. |
రయము మెఱయంగ నొక్క నారసము ఫాల | దేశమునయందు నాఁ టించి తీవ్ర శక్తి నురము వైచినఁ దూఁగాడి యొఱగ నూఁది | పట్టి యకృతవ్రణుఁడు తేర్చెఁ బరశురాము. |
344 |
| క. |
అప్పుడు దెప్పిఱి కన్నుల | నిప్పులు రాలంగ నన్ను నిశ్చల దృష్టిం దప్పక చూచి యలఁతి న | వొప్పఁగ బ్రహ్మాస్త్ర మాతఁ డుగ్రత నేసెన్. |
345 |
| క. |
తెగఁగొని బ్రహ్మాస్త్రమ యేఁ | దగ నేసిన నొకటి నొకటి దార్కొని రెండున్ గగనంబంతయుఁ దేజ | స్స్థగితముగాఁ జేసె సురలు దైత్యులుఁ దలఁకన్. |
346 |
| తే. |
సకల భూత సంక్షోభ సంజనకమైన | యట్టియెడఁ గని యిది తఱి యని తలంచి మోహనాస్త్రంబు నంచితావాహనంబు | సేయుటయును జరాచర శ్రేణి మ్రోసె. |
347 |
| వ. | తదవసరంబున. | 348 |
| క. |
ఉడుగుడుగు మోహనాస్త్రము | విడువకు మను నెలుఁగుతోడ వేగంబున న య్యెడ కేఁగుదెంచి నారదుఁ | డెడమడు గించుకయు లేక యిట్లను నాతోన్. |
349 |
| క. |
‘గురునకు నవమానము ని | ష్ఠుర వృత్తిం జేసెదీవు సూచితిమే యి ప్పరుసునఁ బరుసపు నడవడిఁ | గురువంశప్రవర యిట్లుఁ గూడునె చేయన్?’ |
350 |
| వ. | అని సువ్యక్తంబుగాఁ జెప్పి. | 351 |
| క. |
‘వీరె సుర లాకసంబున | గారవమున బుద్ధి సెప్పఁగా నీకడకుం దా రేగు దెంచి’రని క | న్నారంగాఁ జూపె నాకు నయ్యెనమండ్రన్. |
352 |
| వ. | ఇవ్విధంబున నెప్పటి విప్రవరులు సన్నిధిసేసి నన్నుం జూచి నగుమొగంబులతో నెఱుఁగని వారపోలె నిట్లనిరి; | 353 |
| క. |
‘నారదముని త్త్రెలోక్య స | మారాధ్యుం డితని పలుకు లాగమ వాక్యో దారములు వినుము వీనిం | గ్రూరత వాటింపఁ దగదుగురు విషయమునన్.’ |
354 |
| వ. | అనిన విని యేను సమ్మోహనాస్త్రం బేయుట యుడిగి బ్రహ్మాస్త్రంబు దీపింపఁజేసితి; నప్పుడు జామదగ్న్యుం డది యెల్ల నెఱింగి, యోటమి యెక్కించుకొని చలంబు మిగిలియున్నం దజ్జనకుండు జమదగ్నియుఁ దదీయ పితృవర్గంబును నతనికి సన్నిధి సేసి వేఁడికొని శాంతవచనంబులం దేర్చి యిట్లనిరి: | 355 |
| క. |
‘వినుము వసుమూర్తి యీతం | డనన్య సామాన్య తేజుఁ డాహవభూమిన్ మనకు జయింప వశమె భీ | ష్ముని? విప్రున కగునె రోషమును మత్సరమున్?’ |
356 |
| తే. |
సమర ముడుగు నారాయణసఖుఁడు నరుఁడు | సవ్యసాచి నా నింకొక జన్మమొంది యితని వధియించుఁగాని తక్కితర జనము | లకు నసాధ్యుండు భీష్ముఁ డాలంబులోన. |
357 |
| వ. | అనిన నతండు పోక పెనంగిన వెండియు ననేక ప్రకారంబులం జెప్పి యమ్మునులు నాకడకుం జనుదెంచి యుపశమన వాక్యంబులు పలికి జామదగ్న్యుతోడం దమయాడిన మాటలు తేటపఱిచి యప్పుడు పొడసూపిన జాహ్నవియుం దారు బహు విధంబుల నన్ను ననునయించి భార్గవుపాలికి నమ్మహాదేవిం దోడ్కొని యరిగియుం గ్రమ్మఱ మత్సమీపంబునకు వచ్చియు నెట్టకేలకుం జలం బుడిపిన నే మిరువురమును దివ్యాస్త్రంబులుప సంహరించి సమరం బుడిగితి; మట్టియెడ నయ్యెనమండ్రు విప్రులుం జేరి నాతో నిట్లనిరి: | 358 |
| ఆ. |
‘గురుఁడు బ్రహ్మవిదుఁ డకుంఠిత తేజుండు | పరశురాముఁ డతని పాలి కీవు భక్తి మెఱయ నేఁగి ప్రణమిల్లి తదనుగ్ర | హంబు వడయవలయు ననఘ! యిపుడు.’ |
359 |
| వ. | అని చెప్పి యతని కడకుం దారును నారదమునీశ్వరుండును జమదగ్ని ప్రముఖులును భాగీరథియును జని ‘నీ శిష్యుండు దేవవ్రతుండు; వాని యెడ నలుగం దగునె? వాఁడు తగవు మాలిన పనిఁ జేయంజాలక పెనంగె; నింతియకాని విరోధి గాఁడు; వానిం గరుణింపు’ మని తెలిపి, నన్నుం బిలిచినం బోయి యే నమ్మహాత్మునకు సాష్టాంగదండ ప్రణామంబు సేసిన నతండు దీవనతో గ్రుచ్చి యెత్తి కౌఁగిలించికొని ‘గాంగేయా! నీశక్తికి భక్తికిం బ్రీతుండనైతి’ నని సస్నేహంబుగా సంభావించి, యంబ నవలోకించి; నన్ను భీష్ముండు గెలిచె ‘నా వలన నయ్యెడుపని యింతియ; నీవింక నీకుం జూడం బోలిన గతిం బొమ్మ’నిన నమ్మానిని’ ‘దేవా యిది యిట్టిద; నీ యోపినంతయుం జేసితి; నీ చేతం బోకున్న నేమి సేయుదు? నేను దపంబు పెంపున భీష్ముని వధించెద జన్మాంతరంబున నైననుం జలంబు సాధ్యంబు చేయుదు; నటు సూడు’ మని పలికిపోయెఁ; దదనంతరంబ యమ్మునిజన పితృదేవతా సమూహంబును భృగు నందను నన్ను నామంత్రణంబు చేసి యంతర్ధానంబు సేసె; భార్గవుండును నన్నువీడ్కొలిపి మున్ను దనతో వచ్చిన తపోధనవర్గముం దానును మహేంద్ర శైలంబునకుం జనియె; నేను మగిడి యెడనెడ నుర్వీసురుల యాశీర్వాదంబులు సంభావన వచనంబులుఁ బ్రస్తుతి వాక్యంబులుఁ గర్ణంబుల కింపుసేయ నిటవచ్చి సత్యవతికి నమస్కారపూర్వకంబుగా నంతయు నెఱింగించిన నద్దేవి యభినందించె. | 360 |