| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అవతారిక |
| మొల్ల కవితా విలసనము | ||
| సీ. |
దేశీయ పదములు దెనుఁగులు సాంస్కృతుల్-సంధులు ప్రాజ్ఞుల శబ్ద వితతి శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధంబు-లాయా సమాసంబు లర్థ దృష్టి భావార్థములుఁ గావ్య పరిపాకములు రస-భావ చమత్కృతుల్ పలుకు సరవి బహు వర్ణములును విభక్తులు ధాతుల-లంకృతి చ్ఛందో విలక్షణములుఁ |
|
| తే. |
గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రమము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత-నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి. |
12 |
| క. |
చెప్పుమని రామచంద్రుఁడు సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద నే నె ల్లప్పుడు నిహ పర సాధన మిప్పుణ్య చరిత్ర తప్పు లెంచకుఁడు కవుల్! |
13 |
| వ. | అని మఱియును, | 14 |
| చ. |
వలిపపు సన్న పయ్యెదను వాసిగ గందపుఁ బూఁతతోడుతన్ గొలదిగఁ గానవచ్చు వలి గుబ్బ చనుంగవ ఠీవి నొప్పఁగాఁ దెలుఁ గని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్త రీతులం బొలుపు వహింపకున్న, మఱి పొందగునే పటహాదిశబ్దముల్? |
15 |
| క. |
మును సంస్కృతములఁ దేటగఁ దెనిఁగించెడిచోట నేమి దెలియక యుండన్ దన విద్య మెఱయఁ గ్రమ్మఱ ఘన మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచి యగునే? |
16 |
| ఆ. |
తేనె సోఁక నోరు తీయన యగు రీతిఁ దోడ నర్థ మెల్లఁ దోఁచకుండ గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూఁగ చెవిటివారి ముచ్చ టగును. |
17 |
| క. |
కందువ మాటలు, సామెత లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్ బొందై, రుచియై, వీనుల విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్. |
18 |
| వ. | అని మఱియును, | 19 |