| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| భరతుని భాతృ భక్తి | ||
| మ. |
ఘనుఁడా రాముఁడు చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో నన దంతావళ వాజిరత్న రథ నానా యోధ సంఘంబుతో డ, నమాత్య ద్విజ బంధు వర్గములతోడం గూడి వాద్యంబులం జనుదెంచెన్ భరతుండు రాముకడకున్ సద్భక్తి సంపన్నుఁడై. |
37 |
| సీ. |
చనుదెంచి, రాముని చరణంబులకు మ్రొక్కి,-కైకేయి చేసిన కపటమునకు నగరంబు విడిచి, యీ పగిది ఘోరారణ్య-మున కిట్లు రానేల మునుల పగిది? నది గాక, మన తండ్రి యత్యంత మైనట్టి-పుత్త్ర శోకంబునఁ బొక్కి పొక్కి త్రిదశాలయమ్మున దేవేంద్రుఁ గనఁ బోయె-నని చెప్ప విని రాముఁ డంతలోన |
|
| తే. |
భరత లక్ష్మణ శత్రుఘ్ను ధరణి సుతులఁ-గూడి దుఃఖించి దుఃఖించి, కొంత వడికి నాప్త వర్గంబుచే మానె, నంతమీఁద-భరతుఁడిట్లనె శ్రీరామభద్రుతోడ. |
38 |
| తే. |
"రాజు లేకున్నచో మఱి రాష్ట్రమందుఁ గార్య మెట్లౌను? మీ రెఱుంగనిది కలదె? నేఁటి సమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ దిరిగి విచ్చేయుఁ" డనుడు నా భరతుతోడ |
39 |
| వ. | శ్రీ రామచంద్రుం డిట్లనియె. | 40 |