| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| శ్రీ రామాయణము - సుందరకాండము | ||
| క. |
సూర్యకుల రత్న దీపా! సూర్య సహస్ర ప్రతాప! సుందర రూపా! ఆర్యారాధిత నామా! శౌర్యాధిక సుగుణ సీమ! జానకి రామా! |
1 |
| వ. |
శ్రీ నారద మహా ముని వాల్మీకి కెఱింగించిన తెఱంగు విన్నవించెద నవధరింపుము. |
2 |
| సంపాతి కపివీరులకు సీత యునికిని దెలుపుట | ||
| తే. |
రామునకు మ్రొక్కి యక్కపిరాజు కరుణఁ దత్క్షణంబున వెడలిరి దక్షిణంబు వెదకువా రగు వానర వీర వరులు పంతముతోడ నెంతయు సంతసమున. |
3 |
| క. |
మును తా మేఁగిన దిక్కులు పనివడి వెదకంగఁ జనిన బలిముఖు లెల్లన్ జనకజఁ గానక వచ్చిరి మనుజేశుని కడకు చనిన మార్గంబుననే. |
4 |
| వ. | అట్టి సమయంబున, | 5 |
| క. |
గిరులును, నదులును, వనములుఁ బరికింపుచుఁ, బట్టణములు బహు విధ గతులన్ దిరుగుచు వెదకుచుఁ, గానక కరువలి సుతుఁ డాది యైన కపి వరు లెదుటన్. |
6 |
| క. |
ఆలోఁ గాంచిరి సత్కపి జాలముఁ, గరి శరభ సింహ శార్దూల మృగా భీలముఁ, బుణ్య కదంబ వి శాలము నగు నమ్మహేంద్ర శైలము లీలన్. |
7 |
| వ. | ఇట్లు మహేంద్ర పర్వతంబు గనుంగొని డాయంజని యచ్చట. | 8 |
| ఉ. |
ఆ తఱి వానర ప్రవరు లా ధరణీ సుతఁ గానలేక దుః ఖాతురులై వగం బడఁగ నయ్యెడఁ దద్గిరినుండి వచ్చి సం పాతి యనం బ్రసిద్ధుఁ డగు పక్షి కులేంద్రుఁడు రావణుండు దా సీతను గొంచుఁ బోవుగతిఁ జెప్పుచుఁ దెల్పెను లంక త్రోవయున్. |
9 |
| క. |
ఆ పక్షీంద్రునిచేతను జాపల శుభనేత్ర రామచంద్రుని దేవిన్ బాపాత్ముఁ డైన దైత్యుఁడు వే పట్టుక చనిన త్రోవ విని కపు లెల్లన్. |
10 |
| వ. | మహానందంబు నొంది యమ్మహేంద్ర పర్వతం బారోహించి పురోభాగంబున. | 11 |
| క. |
ఆ కపి వీరులు గనుగొని రాకాశనదీ ప్రచుంబితార్భట భంగా నీక మహాఘనరవ భయ దాకార నటత్ప్రకాశు నాజలధీశున్. |
12 |
| వ. | అట్లు కనుంగొని. | 13 |
| క. |
తమ తమ సత్త్వ స్థితులును గమియించెడు నబ్ధి కొలదిఁ గనుకొని మదిలో బ్రమయుచుఁ బలికెను గపి సం ఘము లెంతయు డెందమందుఁ గళవళపడుచున్. |
14 |