| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| హనుమంతుని సాగర లంఘనము | ||
| క. |
ఈ వార్ధి దాఁట సత్త్వము మా వలనం జాల దింక మారుతి! వినుమా పావని వగుటం జేసియు నీవలనం దక్క నొరులు నేరరు దాఁటన్. |
15 |
| వ. |
అని యిట్లు ప్రార్థించినతోడనే యుబ్బి వారి వచనంబులకు సమ్మతించి వాయు తనూజుం డిట్లనియె, |
16 |
| ఉ. |
పావనమూర్తి రామ నరపాలకు పంపున నబ్ధి దాఁటెదన్, దేవవిరోధి చేఁబడిన దేవిని జూచెదఁ, గానకుండినన్ లావున గడ్డతోఁ బెఱికి లంకయ తెచ్చెద, నట్లు గానిచో రావణుఁ బట్టి తెచ్చెదను, రాముని సన్నిధి కెన్ని రీతులన్. |
17 |
| వ. |
అని వారి మనంబులు సంతసిల్లునట్లుగా బిరుదులు వక్కాణించి, తనకుఁ దండ్రి యైన వాయు దేవునకును, ద్రిమూర్త్యాత్మకుండైన లోకబాంధవునకును, నింద్రునకును, సంద్రమ్మునకును నమస్కరించి, శ్రీరామ లక్ష్మణులఁ దన మనఃపద్మంబునం దిడికొని మ్రొక్కి, బంధు మిత్త్రులం గౌఁగిలించుకొని, వారిచేత దీవనలం బొంది, గమనోన్ముఖుండై, |
18 |
| చ. |
మొగము బిగించి, పాదములు మొత్తముగా వడినూఁది త్రొక్కి, నీ టుగ మొగమెత్తి, భీకర కఠోర రవంబున నార్చి, బాహు ల త్యగణిత లీల నూఁచి, వలయంబుగ వాలముఁ ద్రిప్పి, వ్రేఁగునన్ నగము సగమ్ము గ్రుంగఁ, గపి నాథుఁడు నింగికి దాఁటె ఱివ్వునన్. |
19 |
| వ. |
ఇట్లు నింగి కెగిరిపోవుచుండు సమయంబునఁ బావనికి నడ్డంబుగా మానవ రూపంబున మైనాక పర్వతంబును, సురస యను నాగ జననియు, ఛాయాగ్రాహిణియైన సింహికయునుం, గనుపట్టిన నెల్లర నతిక్రమించి, సువేలాచలంబున కరిగి, యక్కడ నలయిక దీర నొక్క యిక్కువ నించుక సేపు విశ్రమించియున్న సమయంబున. |
20 |