| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| శ్రీరామునకు సీత సందేశము | ||
| చ. |
రవికుల వార్ధిచంద్రుఁడగు రాముని సేమము చాల వింటి, నా వివిధము లైన పాట్లు పృథివీపతికిం దగఁ జెప్పఁగల్గె నేఁ డవిరళభంగి నీ వలన, నచ్చుగ నే నుపకార మేమియుం దవిలి యొనర్ప లేను వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మ కల్పముల్. |
109 |
| వ. | ఇట్లు దీవించి మఱియును, | 110 |
| క. |
ఏ యెడఁ జూచిన ధరణీ నాయకు శ్రీపాద యుగము నా చిత్తములోఁ బాయ దని విన్నవింపుము వాయు తనూభవుఁడ పుణ్యవంతుఁడ! తెలియన్. |
111 |
| తే. |
ఇపుడు రావణుఁ డేతెంచి కపట బుద్ధి, గర్వమునఁజేసి నన్నెన్ని కాఱులాడె, నన్నియును నీవు చెవులార విన్న తెఱఁగు పతికి దయ పుట్టఁగా విన్నపంబు సేయు. |
112 |
| సీ. |
నిడుదపున్నెఱివేణి జడలుగా సవరించి-మలిన జీర్ణాంబరం బొలియఁ గట్టి, భూమీరజంబు విభూతి పూఁతగఁ బూసి-తన పతి మూర్తిఁ జిత్తమున నిల్పి, నిరశన స్థితితోడ నిలిచి భూశయ్యను-బవళించి నిదుర యేర్పడఁగ విడిచి, తారక బ్రహ్మ మంత్రంబుఁ బఠింపుచుఁ-గఠిన రాక్షస దుర్మృగములలోన |
|
| తే. |
నహిత లంకా మహా ద్వీప గహన సీమఁ-దపము సేయుచున్నాను తన్నుఁ గూర్చి, నాకుఁ బ్రత్యక్ష మగు మని నాథునకును-విన్నవింపుము సత్త్వ సంపన్న! నీవు. |
113 |
| వ. | అని చెప్పి మఱియును, | 114 |
| చ. |
జనకుని భంగి రామ నృపచంద్రుని, నన్నును దల్లిమాఱుగాఁ గని, కొలువంగ నేర్చు గుణగణ్యుని, లక్ష్మణు నీతిపారగున్ వినఁ గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా. |
115 |
| క. |
ఆ మాటలు మది నుంచక నా మానముఁ గావు మనుచు నయ వినయ గుణో ద్ధాముఁడు, రాముని తమ్ముఁడు, సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసివర్యా! |
116 |
| వ. |
అని యిట్లు జనక రాజ తనయ పలికిన పలుకు లాలకించి హనుమంతుం డా జననితో నిట్లనియె. |
117 |
| క. |
ఇనుఁ డుదయింపక మున్నే వననిధి లంఘించి, మనుజ వల్లభుకడకున్ నినుఁ గొనిపోయెద, వీఁపున జననీ! కూర్చుండు మనిన, సంతోషమునన్. |
118 |
| క. |
నీ వంతవాఁడ వగుదువు, నీ వెంటనె వత్తునేని నెగడవు కీర్తుల్ రావణుకంటెను మిక్కిలి భూవరుఁడే దొంగ యండ్రు బుధ నుత చరితా! |
119 |
| వ. |
అదియునుం గాక రామచంద్రునిం దప్ప నితరుల నంటుదానం గాను, గావున నీతో రాఁదగదు మఱియును, |
120 |
| క. |
దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వాని వారి సాహస మొప్పన్ సంగర ముఖమునఁ జంపక దొంగిలి కొనిపోవఁ దగునె దొరలకు నెందున్? |
121 |
| వ. |
మఱియు రామచంద్రుండు త్రిజగదేక వీరుండును, గోదండ దీక్షా గురుండును, రాక్షస కులాంతకుండును నగుటంజేసి రాణివాస ద్రోహి యగు రావణుని సంగరరంగంబునఁ బ్రఖ్యాతంబుగాఁ జంపి కొనిపోవుట ధర్మంబు; నీవు రామచంద్రునకుఁ బరమ భృత్యుండవును, బుత్త్ర సముండవును నగుటంజేసి, నీ వెంట నరుగు దెంచుట తప్పుగాక బోయినను, బగ తీర్పక వచ్చు టుచితంబు గాదు. కావున రాఘవేశ్వరుల కిన్నియుం దెలియ విన్నపంబుసేసి తడయక తోడ్కొని రమ్మనిన నద్దేవికి నమస్కరించి హనుమంతుం డిట్లనియె, |
122 |
| ఉ. |
నీ విభుఁ డబ్ధి దాఁటి, ధరణీతల నాథులు సన్నుతింప, సు గ్రీవ సుషేణ ముఖ్య బల బృందముతో నరుదెంచి, నీచునిన్ రావణు నాజిలోఁ దునిమి, రాజస మొప్పఁగ నిన్నుఁ గొంచు, సే నావళితోడ నీ పురికి నారయ నేఁగు నిజంబు నమ్ముమా! |
123 |
| వ. |
అని విన్నవించి నమ్రుండై యద్దేవిచేత దీవెనలు పొంది, మరలి చనుచున్నవాఁడై తన రాక రావణున కెఱుంగఁ జేయవలయు నని తలంచి. |
124 |