| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| అక్షకుమారాదుల సంహారము | ||
| సీ. |
పొడిచిన మూర్ఛిల్లి, వడిఁ దేఱి, దైత్యుండు-గదఁ గొని వైచె వక్షంబు పగుల, వైచిన మారుతి వడి వాని గదఁ బుచ్చు-కొని వాని దేహంబు గుదియ నేసె, నేసినఁ దన వీఁక నోసరింపక వాఁడు-గగనంబు కెగసె నా క్షణమునందె, వాయు తనూజుండు వదలక తన వెంట-నెగసిన, గదఁ గొని యేసె నతని, |
|
| తే. |
నతఁడు గదఁ ద్రుంప, ఖడ్గాన నతుల శక్తి-వాఁడు మారుతి తొడలు నొవ్వంగ నడఁచె, నంత సోలుచునా హనుమంతుఁ, డెగిరి-పట్టుకొని వాని ధాత్రిపైఁ గొట్టి చంపె. |
157 |
| తే. |
అంత హతశేషు లగువార లరుగుదెంచి, సంభ్రమంబున దానవ చక్రవర్తిఁ గాంచి, కొలువెల్ల సందడి గాఁగ, నపుడు బహు విధంబుల హనుమంతుఁ బ్రస్తుతించి, |
158 |
| సీ. |
అక్షుండు తెగె, నశ్మవక్షుండు తెగటాఱె-రక్తరోముఁడు నీల్గె రణములోన స్తనితహస్తుఁడు మ్రగ్గె, శార్దూలముఖుఁడీల్గెఁ-గింకర వర్గంబు గీటడంగె శార్దూలకబళుండు సచ్చె, దుర్జయుఁ డేఁగె-శతమాయుఁ డొరిగెను, సమసె వక్ర నాసుండు, మఱి రక్తనాసుండుఁ గడతేఱె-శూలదంష్ట్రుఁడు నేలఁ గూలిపోయె, |
|
| తే. |
మడిసె యూపాక్షుఁ, డట జంబుమాలి తునిఁగెఁ-బింగళాక్షుని పే రంత బిలము సొచ్చె, వనము కావలి రాక్షస వర్గ మడఁగె-దీర్ఘజిహ్వుండు నేటితోఁ దీఱిపోయె. |
159 |
| వ. | అని వేఱు వేఱ విన్నవించిన నసురేంద్రుఁడు విని తన మనంబున. | 160 |
| మత్త. |
వీని వానరుఁ డంచు నాత్మను విశ్వసింపఁగ జెల్ల, దీ దానవావళి మ్రింగఁ బుట్టిన దయ్యమో? యటుగాక వై శ్వానరుం డిటువంటి రూపున వచ్చి నిల్చెనొ? కాక యీ మేను గైకొని విష్ణుఁ డీడకు మేటియై చనుదెంచెనో? |
161 |
| మత్త. |
కాక యే వర మైన నా కఱకంఠుఁ డిచ్చిన నుబ్బి యా నాక వల్లభుఁ డెల్ల కాలము నాకు నోడిన భీతిమై లోక భీకర మైన రాక్షస లోక మెల్ల నడపంగా నీ కరాళపు రూపు నిప్పుడ యీడ కంపఁగ వచ్చెనో? |
162 |
| మత్త. |
కాక తక్కినవార లెవ్వరు గర్వ సంపద మీఱఁగా నాకు డీకొని ఢాకతోడ రణంబు సేయఁగ నోపరే లోకమందిటు క్రోఁతు లెక్కడ లోఁచు దానవ వీరులన్ జోక వీనికిఁ గల్గెనేనియుఁ జూఱ పుచ్చఁడె సర్వమున్. |
163 |
| వ. |
అని యిట్లనేక ప్రకారంబులఁ జింతించి యక్షకుమారుం దలంచి పలు దెఱంగులఁ బలవించుచున్న తండ్రిం గాంచి మేఘనాదుం డిట్లనియె. |
164 |