| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| మేఘనాదుని భయంకర సమరము | ||
| క. |
కలఁగినవి దేవ గణములు, జలధులు ఘూర్ణిల్లె, గిరులు చలనం బొందెన్, జలజాప్త చంద్రు లొదిగిరి, జలధరములు పఱియ లగుచుఁ జదలం బర్వెన్. |
171 |
| క. |
అప్పుడు దానవ వీరులు నిప్పులు వర్షించునట్టి నిశితాస్త్రములన్ గప్పిరి కెందొగ వానలఁ గప్పిన శైలంబుఁ బోలఁ గపివరు మీఁదన్. |
172 |
| తే. |
అంప వర్షంబు తనమీదఁ జొంపములుగ లీలఁ గురియంగ, నవి యెల్ల లెక్కఁగొనక భువికి లంఘించి, యప్పు డద్భుతముగాఁగ వాల మల్లార్చి యొక మహాసాల మెత్తి. |
173 |
| తే. |
తేరు లన్నియుఁ గూరాటి తేరులుగను, గుఱ్ఱముల నెల్లఁ గావేరి గుఱ్ఱములుగ, నేనుఁగుల నెల్ల వెడరూపు టేనుఁగులుగ దళము లన్నియు మఱి హరిదళము గాఁగ. |
174 |
| వ. | ఇట్లు సమయింపం జూచి బలంబుపై కుఱికి, | 175 |
| సీ. |
కరి యూథములమీఁదఁ గదిసి మావంతుల-తోడఁ గూడఁగఁ బట్టి తునియఁ గొట్టి, గుఱ్ఱంపుఁ బౌఁజులకును దాఁటి రౌతులఁ-గలయంగఁ బట్టి చెక్కలుగఁ గొట్టి, రథములపైకి నుగ్రంబుగా లంఘించి-రథికులతోఁ గూడఁ రసను గొట్టి, బలములమీఁద నిబ్బరముగాఁ గుప్పించి-వాల ముఖంబునఁ దూలఁ గొట్టి, |
|
| తే. |
పటహ నిస్సాణ కాహళ పటిమ లురియఁ-ద్రొక్కి శస్త్రాస్త్ర నిచయముల్ తుమురు చేసి, ఛత్రములఁ ద్రుంచి పడగల సత్త్వ మణఁచి-పవన సూనుండు సాహస ప్రౌఢి మెఱసె. |
176 |
| వ. | అట్టి సమయంబున, | 177 |
| చ. |
అనలము రీతి మండి దివిజారి తనూజుఁడు తేరు దోలి, య య్యనిల తనూజు నేసె వివిధాయుధ పంక్తుల, వాని నెల్లఁ దు త్తునియలు సేసె వాయుజుఁడు, దోర్బల శక్తిని దైత్యుఁడేయఁ, దోఁ కను దునుమాడె వాని విశిఖంబుల నన్నిటి వాయు సూనుఁడున్. |
178 |
| క. |
గిరులను బావని రువ్వుచు దరువుల నేయంగఁ, గినిసి దానవుఁ డంతన్ దురమున నడుమనె త్రుంచెను శరజాలముచేత నొక్క క్షణమున వానిన్. |
179 |
| తే. |
గంధవహు పుత్త్రుఁ డప్పు డాగ్రహముతోడ రధముఁ గూలంగఁ దన్ని సారథినిఁ జంపి గుఱ్ఱములఁ జంపి, కేతువుఁ గూల నడవ, మేఘనాదుండు కినిసి సమీర సుతుని. |
180 |
| వ. | అహంకారంబునఁ బ్రతిఘటించి, | 181 |
| క. |
వాయవ్యాస్త్రము నంతట వాయుజు మీఁదికి నతండు వడి నేసిన, నా వాయవ్యాస్త్రముఁ దూలెను వాయుజునిం జంప నోడి వారని కరుణన్. |
182 |
| వ. | అది వృథ యగుటం గని మఱియును, | 183 |
| క. |
రౌద్రం బడరఁగ నేసెను రుద్రాస్త్రం బతనిమీఁద రూఢిగ నతఁ డా రుద్రుని యంశం బగుటను, రౌద్రాస్త్రము దేలిపోయె రభసం బొప్పన్. |
184 |
| వ. |
అమ్మహాస్త్రంబు గూడఁ దప్పిపోవుట కాశ్చర్యంబు నొంది యింద్రజిత్తు మఱియును. |
185 |