| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| బ్రహ్మాస్త్రమునకు గట్టువడిన హనుమంతుఁడు | ||
| క. |
సుర ఖచర యక్ష కిన్నర గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ గణం బరుదంది చూడఁగా ని ర్భర ముష్టిం దొడిగి యేసె బ్రహ్మాస్త్రంబున్. |
186 |
| వ. | అట్టి యవసరమున. | 187 |
| క. |
సప్తాంభోధులు కలఁగెను, సప్త ద్వీపములు వణఁకె, శైలము లదరెన్, సప్తానిలములు దలఁకెను, సప్తాశ్వుఁడు మ్రానుపడియె, జగములు గదలెన్. |
188 |
| వ. |
ఇట్లనేక ప్రకారంబులఁ గాలాగ్ని తెఱంగున వెడలి, మిడుం గుఱులు చెదరి పడఁగ, బ్రహ్మాండ మండలంబులం బట్టుకొనునట్టు పెను మంట లుప్పరం బెగయ, నేతెంచు బ్రహ్మాస్త్రముం గని హనుమంతుఁడు తన మనంబున, |
189 |
| ఆ. |
తనకుఁ జిన్ననాఁడు దయచేసినటువంటి వనజ భవునిచేతి వరముఁ దలఁచి, బ్రహ్మ మంత్ర మప్డు పఠియింప, నది చంప కతనిఁ గట్టి వైచె నవనిమీఁద. |
190 |
| వ. |
ఇట్లు కట్టుపడిన కరువలి పట్టిని జూచి, రావణాసురుని పట్టి తనలో నిట్టు లనుకొనియె, |
191 |
| క. |
ఈ బ్రహ్మాస్త్రము తాఁకున కే బలియుఁడు బ్రదుక నోపఁ, డితఁడు ఘనుండౌ, నీ బాహుబలుని గట్టుట నా బలిమికిఁ దొడవ కాదె నాకులు మెచ్చన్! |
192 |
| క. |
పెక్కండ్ర దనుజ వీరులఁ జక్కాడిన వీనిఁ బట్టి, సాహసముగ మా రక్కసుల ఱేని యొద్దకుఁ జక్కఁగఁ గొనిపోవు టదియ చంపుట గాదే! |
193 |
| చ. |
అని తన సత్త్వ సంపద రయంబునఁ బొంగుచు మేఘనాదుఁడ య్యనిలజుఁ గొంచు నేఁగె దివిజారి సభాస్థలి కద్భుతంబుగా, ఘన రథ దంతి ఘోటక నికాయ భటావళి శస్త్ర దీప్తకే తన వర శంఖ కాహళ వితాన రవంబులు మిన్ను ముట్టఁగన్. |
194 |
| వ. |
ఇట్లు కొనిపోయి రాక్షసేశ్వరుం డయిన రావణాసురు సమ్ముఖ మ్మునం బెట్టినంతనే గాడుపు పట్టిం గని. |
195 |