ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము
శ్రీరాముని సంతాపము
సీ. హా! భానుకులదీప! హా! సత్యసల్లాప!-హా! సుగుణకలాప! హా! సురూప!
హా! ధర్మసంచార! హా! వైరి సంహార!-హా! కీర్తివిస్తార! హా! సుధీర!
హా! నిత్య సుజ్ఞాన! హా! పుణ్యసంధాన!-హా! పూజ్యసమ్మాన! హా! నిధాన!
హా! శౌర్యగుణవృద్ధ! హా! యుద్ధసన్నిద్ధ!-హా! చిత్త సంశుద్ధ! హా! ప్రసిద్ధ!
 
తే. హా! మునీశ్వరసంరక్ష! యసురశిక్ష!-హా! గుణస్తోత్రసత్పాత్ర! యబ్జనేత్ర!
హా! సదాచారసంపన్న! హా! ప్రసన్న!-యనుచు శోకాతురాత్ముఁడై యంతకంత.
46
క. జనకుని పంపున నడవికిఁ
జనుదెంచియు నిడుము కోర్చి సన్మునివృత్తిన్‌
ననుఁ గూడి నడవ నేర్చిన
యనుజన్మా! యెందుఁ బోయితయ్యా! తలఁపన్‌.
47
క. వనమునఁ గలఫలమూలము
లనుదినమును భక్తి యుక్తి నర్పింపుచు మ
జ్జనకుని భంగిని నన్నును
జనకజఁ బోషించి యెందుఁ జనితివి తండ్రీ!
48
క. నీవంటితోడఁబుట్టువు
నీవంటిగుణోత్తరుండు నిజ మూహింపన్‌
భూవలయమందుఁ గలఁడే
భావింపఁగ నీవెతక్కఁ బావనచరితా.
49
క. నెఱయక నిద్రాహారము
లెఱుఁగక పదునాలుగేండ్లు హితమతితో మ
మ్మఱిముఱి నరసిన నిన్నును
మఱువ నగునె నీతి గల్గుమనుజుల కెందున్‌.
50
క. ని న్నిచట విడిచి పురికిని
జన్నను నినుఁ గన్నతల్లి సనుదెంచి ననున్‌
ని న్నడుగఁ దడవ మదిలోఁ
జిన్నం బోవుచును నేమి చెప్పుదుఁ దండ్రీ!
51
వ. అని మఱియును. 52
చ. వినుఁడు కపీంద్రులార! పలవింపుచు మజ్జనకుండు నాకమున్‌
జనియె ధరాతనూభవ నిశాచరుచేఁ జెఱవోయె నేటితో
ననుజుఁడు దీఱె నింక నడియాసల నుండుట నాకు ధర్మమే
చనుఁడు నిజాశ్రమంబులకు సంశయ మొందక మీరి గొబ్బునన్‌.
53
వ. అని విభీషణుం గనుంగొని. 54
ఉ. అక్కట! నీకు నింటఁ గలయట్టి సుబాంధవకోటిఁ బాసి నీ
విక్కడ కేఁగుదెంచితి వహీనముదంబున మమ్ము నమ్మి పెం
పెక్కఁగ రావణుండు తగ నేలెడిలంకఁ గడంగ నీకు నేఁ
దక్కఁగ నిత్తునన్‌ ప్రతిన దప్పె విభీషణ! నీవు పోవుమా.
55
వ. అని యనేక ప్రకారంబులఁ బ్రలపించుచున్న రామభూపాలునకు సుషేణుం డిట్లనియె. 56
ఉ. దేవర! నీకు నీగతి మదిం దలపోయఁగ నేల తీవ్ర మై
రావణు చేతిశక్తి బవరంబున నాటుటఁజేసి లక్ష్మణుం
డీవిధిఁ నుండెఁగాని ధరణీశ్వర! చూడు ముఖారవిందమున్‌
జావఁడు సావఁ డియ్యెడ నిజంబుగ నమ్ము మనంబులోపలన్‌.
57
ఉ. పున్నమ చందురుందెగడి పొల్పెసలారెడి మోముఁదమ్మియున్‌
గన్నులు కల్వఱేకులను గాంతి జయించెడుఁ గాని రక్తిమన్‌
జెన్నుదొలంగియుండ వఱచేతులుఁ బాదములున్‌ దలంపఁగా
నున్నవి వర్ణముల్‌ గలిగి యొప్పుతొఱంగదు రాఘవేశ్వరా!
58
వ. అని విన్నవించుచు హనుమంతుఁ గనుంగొని సుషేణుం డిట్టులనియె. 59
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - dvitIyAshvAsamu ( telugu andhra )