| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| శ్రీరామచంద్రున కింద్రుఁడు రథమును గానుకగాఁ బంపుట | ||
| క. |
రథ మెక్కి రావణుండును బృథివీస్థలి నుండి రామపృథ్వీపతియున్ బ్రథనము సేయుట తగ దని వ్యథఁ బొందుచు నాత్మలోన వాసవుఁడంతన్. |
48 |
| క. |
మాతలిచేతను గవచము చాతుర్యము గలుగురథము చాపము శరమున్ భూతలనాయకునకుఁ బురు హూతుఁడు పుత్తెంచెఁగడు మహోన్నత మహిమన్. |
49 |
| వ. | ఇట్లు పుత్తెంచిన. | 50 |
| చ. |
ధరణికి వచ్చి మాతలి ముదంబున రామునిఁ జూచి మీకుఁగా సురపతి పంపినాఁ డధికశోభనకృత్యములై వెలుంగు నీ శరములు విల్లు వజ్రకవచంబును దేరును వీనిచేత సం గరమున దైత్యునిం దునిమి కైకొను రాఘవ! శ్రీజయంబులన్. |
51 |
| వ. |
అని చెప్పిన మాతలి ప్రియవచనంబులకు సంతసించి విభీషణానుమతంబున రామభూపాలుండు వజ్రకవచంబు దొడిగి శరశరాసనంబులు గైకొని యింద్రస్యందనంబునకు వలగొని వందనం బాచరించి బాలాదిత్యుండు పూర్వ పర్వతం బెక్కుచందంబున రథం బెక్కునంత జయజయధ్వనులతో సుగ్రీవాంగద హనుమదాదులైన వానరవీరులు మ్రొక్కి రప్పుడంతరిక్షంబున దేవసంఘంబులు సంగ్రామ రంగంబుఁ జూడ వేడ్కపడి వచ్చి విమానంబులతోఁ గ్రిక్కిఱిసి చూచుచుండి రాసమయంబున. |
52 |