ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
రామ రావణుల నిరుపమ మహా సమరము
క. గిరిగిరి నభము నభంబున
ధర ధరయును జలధి జలధి దార్కొనురీతిన్‌
సురరిపుఁడు నసురరిపుఁడును
దురమున నెదురించి రధికదోర్బలయుక్తిన్‌.
53
వ. ఇట్లు మార్కొనుచు. 54
శా. వీరాలాపము లాడుచుం గదిసి దోర్వీర్యంబుతోడన్‌ దను
ర్జ్యారావంబులు మిన్ను ముట్టనతితీవ్రం బైన శబ్దంబులన్‌
వారాసుల్‌ కలఁగంగనార్చి నిజగర్వస్ఫూర్తి నుప్పొంగుచున్‌
గ్రూరాస్త్రంబులనేసి రొండొరులపైఁ గోదండపాండిత్యులై.
55
క. దనుజేశుఁ డేయుశరమును
మనుజేశుఁడు తప్పఁ ద్రుంచు మార్కొని కడిమిన్‌
మనుజేశుఁ డేయు శరముల
దనుజేశుఁడుఁ దప్పఁ ద్రుంచుఁ దతభుజశక్తిన్‌.
56
క. కంటున వేసినశరములు
వింటన్‌ దప్పించుకొనుచు వెస బాణములన్‌
గెంటింపుచు దమగాత్రము
లంటక యుండంగ నేటులాడిరి కడిమిన్‌.
57
క. మొదల నొకబాణ మావలఁ
బదులును బదిపదులు వేయిఁ బదివేలును నేఁ
బదివేలు లక్ష కోటియుఁ
జెదరక విలుకాండ్రమీఁద శీఘ్రమ పర్వెన్‌.
58
క. తొడిగినబాణము వింటను
దొడిగినయట్లుండు మిగుల దోడ్తోనవలన్‌
వెడలెడుశరములు లెక్కకుఁ
గడగుఱు తన రాక చిత్రగతులన్‌ బర్వెన్‌.
59
వ. అట్టి సమయంబున. 60
చ. అభవమురాంతకాదులు మహాత్ములు వింటికి వారికన్ననున్‌
త్రిభువనమందు వీరెగణుతింపఁగనెక్కుడటంచు మెచ్చుచున్‌
నభమున నుండి ప్రస్తుతి ఘనంబుగఁ జేతురు దేవకోటు ల
ట్లుభయఫలంబునం బొగడుచుందురు రాముని రావణాసురున్‌.
61
చ. ధనువులమ్రోత మేఘనినదంబులుగా శరదీప్తి జాలముల్‌
ఘనవరచంచలావళులుగా మణిమౌక్తికదీప్తి ధాత్రిమీఁ
దను వడగండ్లుగా క్షతజధారలు సంతతవర్ష ధారగా
ననయముఁ జెప్ప నొప్పె విపులాహవమప్పుడు వానకాలమై.
62
తే. పంక్తికంఠుండు మిగులఁఁ గోపంబు గదురఁ
దేవగంధర్వశరము సంధించి తివిచి
రామ భూపాలుమీఁద విక్రమము మెఱసి
వేసి వడి నార్చె దిగ్దంతివిసర మడల.
63
క. దానికిఁ బ్రతిశర మప్పుడు
మానవనాథుండుఁ దొడగి మానుష మడరన్‌
బూనిక నేసిన దానిం
బోనీయక త్రుంచి వైచె భువనము లలరన్‌.
64
క. త్రుంచినఁ గనుఁగొని దనుజుఁడు
మించినకోపమున రాముమీఁదను వడి సం
ధించి స్ఫురద్విషబాణము
వంచింపక యేయ దానివలనన్‌ జాలన్‌.
65
ఆ. నాగశరము లొదవి నానాముఖంబుల
వచ్చునపుడు మనుజవల్లభుండు
గరుడబాణ మేసి ఖండించె నన్నింటి
మింట సురలు సూచి మెచ్చి పొగడ.
66
చ. అది వృథవోయినన్‌ దనుజుఁడాగ్రహమూని కరత్రిశూలమ
య్యదనునఁ ద్రిప్పివైవ విపులార్చులఁబేర్చుచువచ్చుదానిపై
వదలక ముందుగాఁ ద్రిదశవల్లభుఁ డిచ్చినశక్తి నేసినన్‌
బొదలుచుఁ బాఱిత్రుంచె మణిభూషణజాలమునాత్రిశూలమున్‌.
67
వ. అట్లు శూలంబును దూలి పోయిన. 68
క. సూతుని రథమును వాజులఁ
గేతువుఁ దూలంగ నేసి కినుక మెయిం జే
సేతను నొప్పించిన నృపుఁ
డాతఱి దైతేయవిభుని నద్భుత మడరన్‌.
69
క. సూటి గొని యసుర తలల కి
రీటము లవలీల డుల్లిరివ్వున నొసలున్‌
బీటలు వాఱ శతాంగము
ఘోటకములగుండె లవిసి కూలఁగ నేసెన్‌.
70
ఉ. ఆయెడ దైత్యనాయకుఁ డహంకృతి రామునిమేన నాటఁగా
వేయుశరంబు లాయముల వేగమె గాఁడిన రక్తపూరముల్‌
కాయముదొప్పఁదోఁగఁవడిఁగ్రమ్మెడు నప్పుడు గూడ నొప్పెఁ బ
ద్మాయత లోచనుండు చరమాద్రితటిం దగు భానుఁడోయనన్‌.
71
ఆ. అంత రామచంద్రుఁడత్యంతకుపితుఁడై
బాణవృష్టిఁ గురియఁ బంక్తిముఖుఁడు
కాలు వ్రేలు చెయ్యి కదలింప నోపక
మెదల లేక రథముమీఁద నొరిగె.
72
వ. రావణుండు సొమ్మసిల్లిపోవు టెఱింగి కాలకేతుఁడు తేరు దూరంబుగాఁ గొనిపోయినఁ గొంత ప్రొద్దునకు
దనుజేంద్రుండు మూర్ఛ దేరి యోరీ పగవారలు నవ్వఁ దగ దనక రథం బిట్లుఁ తేఁ దగునే యని
కోపించినఁ గాలకేతుండును యుద్ధమధ్యంబున దేవరకు సంకటం బైన రథంబు వెడలఁ గొనిపోవుట
యోటమిగాదని ధర్మవిదులు సెప్పుదురు గావున నే నిట్లు దెచ్చితి నని విన్నవించిన సూతుని వాక్యంబులకు
మెచ్చి పసదనంబు లిచ్చి మనరథంబు రాముని పయిం బఱపు మనిన నట్ల కావించినన్‌ గనుంగొని.
73
క. అతనిరథమున కెదురుగ
మాతలి! మనరథముఁ బఱపుమా యన నతఁడున్‌
వే తీవ్రగతింబఱపిన
భూతలపతి వలికె దనుజపుంగవుతోడన్‌.
74
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )