| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| తెగిన తోడనే మరల మొలుచుచున్న రావణుని శిరములు | ||
| క. |
సరసీరుహమిత్త్రాన్వయుఁ డరుదరుదని సురలు వొగడ నసురేశ్వరున క్కరములు శిరములుఁ దెగిపడ నురుముష్టిని దీసి వేగ నుగ్రాస్త్రములన్. |
84 |
| క. |
తెగి పడినతలలుఁ జేతులు దెగినట్లే మొల్చుచుండఁ దీవ్రత యడరన్ జగదీశుఁ డపుడు మదిలోఁ దెగ కుండుట చిత్ర మనుచు దీకొని మఱియున్. |
85 |
| క. |
ఒకకోలఁ దలలుఁ జేతులుఁ బ్రకటంబుగఁ ద్రుంచినంతబాహులుఁదలలున్ వికచాంబుజములరీతిని సకలేశుఁడు వెఱగుపడఁగఁ జయ్యన మొలిచెన్. |
86 |
| క. |
తొడిగెడి శరములు ధరపైఁ బడియెడుమస్తకము లేరుపడ కుండఁగ న ప్పుడు రామమహీతలవరుఁ డెడతెగ కుండంగ నేసె నేమని చెప్పెన్. |
87 |
| వ. | అట్టి సమయంబున. | 88 |
| ఆ. |
వింటఁ దొడుగుశరము వెడలెడుశరమును దిరుగ మొలుచుతలలుఁ దెగినతలలు నెట్టివారి కైన నెఱుఁగంగ రాకుండ రాముఁ డేయఁ దొడఁగె రణములోన. |
89 |
| ఆ. |
శరము దొడిగి తివియఁ జక్రంబువలె నుండు శరము విడుచునపుడు చాప మగును జూడ నొప్పె నౌర శోభితం బగు రాము చేతివిల్లు సెప్పఁ జిత్ర మగును. |
90 |
| ఉ. |
కాంచనపుంఖదివ్యవిశిఖంబుల బాహులు మస్తకంబులున్ ద్రెంచినఁ ద్రెంచినట్లె కడుఁదేజ మెలర్పఁగ నుద్భవించు స త్కాంచనరత్నభూషణనికాయముదీప్తులు ప్రజ్వరిల్లఁగాఁ గాంచన గర్భదత్త వర గర్వ విశేషముచేత సారెకున్. |
91 |
| చ. |
పొరిఁబొరిఁద్రుంచినన్ దిరిగిపుట్టెడుచందముఁగోల నారిపై వెరపుగఁ బూనుచందమును వేసెడు చందముఁ బాఱుచందము న్గరము నుతింపఁగా నరుదుగాదె తలంపఁగ దేవతాళికిన్ శిరములచిత్రమున్ నృపచేతి విచిత్రము తూపుచిత్రమున్. |
92 |
| ఉ. |
రావణుఁడేయు బాణములు రాముని బాణము లొక్కపెటునన్ రావణు మేన నాటియును రామునినాటియు రక్తపూరముల్ పూవులతోడిమోదుగను బూర్వగిరీంద్రము మీఁది భానునిన్ జేవురుకొండ కాలువలసిందురమున్ దలపించు నెంతయున్. |
93 |
| క. |
ఒత్తిలి రాముఁడు దైత్యుని కుత్తుక నొకకోలఁద్రుంచి కూల్చుట దొడ్డో నెత్తురు గ్రమ్మకమున్నే మొత్తములుగఁ దలలు మరల మొలచుట దొడ్డో. |
94 |
| వ. |
అని దేవసంఘములు గొనియాడ శ్రీరామచంద్రుండు దైత్య నాయకుని తలలుఁ జేతులుం ద్రుంచి త్రుంచి విసివినం గని విభీషణుండు నరేంద్రున కిట్లనియె. |
95 |