| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| విభీషణుఁడు తెలిపిన రావణ మరణ రహస్యము | ||
| క. |
పోలఁగ నాతనినాభీ మూలంబున నున్న యమృతమును మొదలను ని ర్మూలముగా శ్రీరఘుభూ పాలక! తెగవ్రేయు మగ్ని బాణముచేతన్. |
96 |
| క. |
అది తెగిపోయిన పిమ్మటఁ బదితలలును రెట్టి గలుగు బాహులు మరలన్ జెదరక తునుమఁగఁ దునుమఁగ దుది ముట్టఁగ మొలుచు నూటతొమ్మిదిమారుల్. |
97 |
| వ. | అంత నంతంబౌ నని విన్నవించిన విని రామభూపాలుం డట్లు గావించిన. | 98 |
| క. |
ఒకతలయు రెండు చేతులు నకలంకస్థితిని గల్గునట్లితనిన్ నేఁ డొకతలఁకు దెచ్చె నౌ నని ప్రకటించిరి సురలు రామభద్రుని నెలమిన్. |
99 |
| తే. |
అంత నమృతంబు తెగిపోవ నసురవిభుని మేన బాహులుఁ దలలును మిన్న కడఁగి పోయి కనుపట్టె నప్పు డద్భుతము గాఁగ రెండుచేతులు నొకతల గండు మిగుల. |
100 |
| వ. | అంత దైత్యేంద్రుండు తన మనంబున. | 101 |
| క. |
ఎవ్వరు నెఱుఁగనిమర్మం బివ్విభునకు నెఱుకపఱుప నిటు గావించెన్ మవ్వమున నీవిభీషణు క్రొవ్వెల్ల నడంతు నంచుఁ గ్రూరతతోడన్. |
102 |
| సీ. |
తొల్లి వరప్రాప్తి దొరికినయటువంటి-రక్తాభ మను మహాశక్తి దివిచి గంధపుష్పాక్షతకలిత మై కనుపట్టి-విపుల తేజంబున వెలయుచున్న దానిఁ బ్రయోగింప దారుణానలతీవ్ర-శిఖలు దిక్తటములఁ జెలఁగుచుండ ఘనఘనారవమై ఘంటానినాదంబు-శ్రుతిపుటంబులకు నశ్రుతము గాఁగఁ |
|
| తే. |
జండతరముగ నట విభీషణునిపైకిఁ-జిచ్చు లుమియుచు నుగ్రమై వచ్చుదానిఁ గాంచి రాముండు నిశితమార్గణముచేతఁ-దృణము కైవడి నడిమికిఁ ద్రెంచివైచె. |
103 |
| వ. |
ఇట్లు తనశక్తివృథ యగుటఁ గని దానవేంద్రుండు మానవేంద్రునిపైఁ గరం బలిగి నిట్టూర్పు నిగిడింపుచు నసి ముసల ముద్గర పరశు పట్టిస ప్రాస గదాదండ కోదండ భిండివాలాది సాధనంబుల నవక్ర విక్రమంబున నాలంబు సేయుచుండఁగని విభీషణుం డులికి దేవా! వీఁడు రెండుకరంబులతోడనే మెండుగ యుద్ధంబు సేయం దొడంగె నింక శిరంబులుఁ గరంబులు మరల నుద్భవించెనేనిఁ గార్యంబు దప్పుటకు సందియంబు లేదు. కావున వీని నీలోనన బ్రహ్మాస్త్రంబున నడఁగింపఁ దగు నని విన్నవించిన. |
104 |