| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| శ్రీరాముఁడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే రావణుహననము | ||
| మ. |
అనఘుం డుజ్జ్వలచాపదండమున బ్రహ్మాస్త్రంబు సంధించి యొ య్యనఁ గర్ణాంతముగాఁ గడున్ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుఁడై దనుజాధీశ్వరు బాహుమధ్యము వడిం దాఁకంగ లక్ష్యంబుగాఁ గొనిబిట్టేసె నదల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపఁగన్. |
105 |
| క. |
ఆవ్రేటు వడిగ నాటిన రావణుఁ డతివివశుఁడగుచు వ్రాలె ధరిత్రిన్ దేవతతి పొగడి యప్పుడు పూవులవర్షంబు గురిసె భూవరు మీఁదన్. |
106 |
| ఉ. |
సంగరభూమి రావణుఁడు సత్త్వముఁదూలి ధరిత్రిఁ గూలినన్ గ్రుంగె భరంబునన్ ధరణి క్రుంగెఁ గులాచలవర్గమెల్ల వే గ్రుంగె దిశాకరీంద్రములు గ్రుంగె మహోరగవంశనాథుఁడున్ గ్రుంగె ఢులీకులేశ్వరుఁడు క్రుంగె వరాహముగ్రుడ్లు తేలఁగన్. |
107 |
| క. |
జగములకు నెల్లబాధకుఁ డగు రావణుఁ డాజిఁ గూల నంతటితోడన్ బగ దీఱె ననుచు రాముఁడు తగఁ దన విల్లెక్కు డించి తమ్ముని కిచ్చెన్. |
108 |
| సీ. |
అఖిలలోకమ్ముల కానంద మొదవెను-సురలకంటికి నిద్రసోఁకె నంత మునులు చేసినతపంబులు చాల ఫలియించెఁ-దొడరి సాధ్యులకుఁ దుందుడుకు వాసె గుహ్యకావళికినిఁ గూడు నోటికిఁ బోయె-సిద్ధులతలఁపులు సిద్ధి నొందె దర్వీకరంబులతల్లడం బడఁగెను-గిన్నరసంఘంబు కీడు తొలఁగె |
|
| తే. |
గరుడ గంధర్వ ఖేచర గణములకును-క్షేమ మింపారె జనపరిణామ మయ్యె వేడ్క లింపొందె బాధలు విఱుగఁడయ్యె-సంగరంబున దైత్యుండు సచ్చుకతన. |
109 |
| ఉ. |
అంత విభీషణుండు తనయన్న పదంబులమీఁద వ్రాలి య త్యంత విషాదదుఃఖజనితాశ్రుకణంబులు రాల నేడ్చె లో కాంతకుఁ డైన రావణుమహాద్భుత దుష్టపరాక్రమంబు భూ కాంతునిముంగలన్ దడవి గద్గదకంఠ కషాయనేత్రుఁడై. |
110 |