ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
విభీషణుఁడు శ్రీరాముని విజయ వార్తను సీతకు నివేదించుట
సీ. ఆలోన రాఘవుండా విభీషణుఁ జూచి-సత్ప్రీతియుక్తి మై సరగఁ పిలిచి
పంక్తికంధరు నాజిఁ బరిమార్చితి నటంచు-వసుమతీతనయకు వార్త సెప్పి
నీదేవి మొదలగు నీరజాక్షులచేత-నతివకు శృంగార మమరఁ జేసి
కొంచు రమ్మని చెప్ప నంచితగతి నేఁగి-సరమాదిసతుల కాసరణిఁ జెప్ప
 
తే. సతులు నిర్మలజలముల జలక మార్చి-పుట్టుపుట్టంబు ముదమునఁ గట్టఁ బెట్టి
చందన మలంది సురభి పుష్పములు ముడిచి-మేలిమణిభూషణంబులు సాలఁ దొడిగి.
112
క. ఇందిరతో సరి యగునా
సుందరిఁ ద్రైలోక్యమాత సొబ గొందఁగఁ దా
రందలమునఁ గొని వచ్చిరి
కందర్పనిభుండు రామునికడకుం బ్రీతిన్‌.
113
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )